దోమకొండ కోట ( కోటలోని అద్దాల మేడ.. ఇన్‌సెట్‌లో)
శతాబ్దాల చరిత్ర గల దోమకొండ కోటలోని భవనాల విషయంలో వారసుల మధ్య వివాదం ముదురుతోంది. గడీకోటలోని భవనాలు తమవంటూ మూడు కుటుంబాలకు చెందిన వారు తాళాలు వేయగా.. మరో వారసుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా వేసిన తాళాలను తొలగించారంటూ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. దీనిపైనా కేసు నమోదైంది.
సాక్షి, కామారెడ్డి: దోమకొండ సంస్థాన వారసుల మధ్య ఆస్తుల కొట్లాట ముదురుతోంది. దోమకొండ కోట కేంద్రంగా కామినేని వంశీయులు శతాబ్దాల పాటు పాలించారు. సంస్థానాల రద్దు అనంతరం దోమకొండ కోట ఎవరిది అన్న విషయం ఎప్పుడూ చర్చకు రాలేదు. 2013లో సినీ నటుడు రాంచరణ్ తేజ పెళ్లితో కోట వివాదం వెలుగులోకి వచ్చింది. అనిల్ కామినేని కుమార్తె ఉపాసనకు రాంచరణ్‌తో పెళ్లి కుదరడం, అప్పట్లో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉండడంతో కోటలో కదలికలు మొదలయ్యాయి. ఒక దశలో గడీని రాంచరణ్ సొంతం చేసుకున్నాడన్న ప్రచారం జరిగింది. పెళ్లికి ముందు కార్యక్రమాలు ఇక్కడే నిర్వహించారు. అప్పుడు కోటలో కొన్ని భవనాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ప్రస్తుతం కోట వ్యవహారాలు అనిల్ కామినేని చూస్తున్నారు. ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది ఆధీనంలోకి కోట వెళ్లింది. దీంతో సామాన్య ప్రజలకు కోట సందర్శన అవకాశం లేకుండా పోయింది.
గొడవ మొదలైందిలా.....
కోట పూర్తిగా అనిల్ కామినేని వశమైందన్న ప్రచారం జోరుగా సాగడంతో ఇతర వారసులైన రాజేశ్వర్‌రావ్, సత్యనారాయణరావ్, రాజేశ్వర్‌భూపాల్, లావణ్య కుటుంబాలకు చెందిన వారు స్థానిక కలెక్టర్‌కు ఆస్తుల విషయంలో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి రాములును విచారణ అధికారిగా నియమించారు. పంచాయతీ అధికారులు విచారణ జరిపినా వివాదం తేలలేదు. దీంతో ఈ నెల 9న ఆయా కుటుంబాలకు చెందిన వారు కోటలోకి ప్రవేశించి భవనాలకు తాళాలు వేశారు. ఇవి తమ ఆస్తులని పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. అక్కడ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అనిల్ కామినేని మనుషులు పోలీసులను ఆశ్రయించారు. కోటలోకి అక్రమంగా చొరబడి భవనాలకు తాళాలు వేశారని ఫిర్యా దులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు తాళాలు వేసినవారిపై కేసు నమోదు చేశారు. ఇంతటితో ఆగకుండా భవనాలకు వేసిన తాళాలను తొలగించారు. విషయం తెలిసిన సత్యనారాయణరావ్, రాజేశ్వర్‌భూపాల్, లావణ్యలు తమ ఇళ్లకు వేసుకున్న తాళాలను అనిల్ కామినేని మనుషులు తొలగించారంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాశంగా మారింది.
ఫిర్యాదు నమోదు..
దోమకొండ: కోటలో తమ ఆస్తులకు సంబంధించిన భవనాలకు తాళాలు వేసి ఫ్లెక్సీలు కట్టగా.. కామినేని అనిల్‌కుమార్ మనుషులు వాటిని తొలగించారని కోట వారసులుగా చెప్పుకుంటున్న కామినేని సత్యనారాయణ, కామినేని రాజేశ్వర్‌భూపాల్, లావణ్యలు బుధవారం దోమకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఎస్సై నరేందర్ తెలిపారు. అద్దాలమేడ, అస్గర్‌మంజిల్, ఉమా మంజిల్ భవనాలకు ఈనెల 8వ తేదీన తాళాలు వేశామని, ఈనెల 12వ తేదీన కామినేని అనిల్ మనుషులు వాటిని తొలగించి, ఫ్లెక్సీలను తీసివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. వారి ఫిర్యాదు మేరకు అనిల్ కామినేని మనుషులపై కేసు నమోదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment