గోల్కొండ మెట్లబావి, దోమకొండ కోటలకు యునెస్కో పురస్కారాలు | Telangana Wins Global Laurels Two Initiatives Bag UNESCO Award | Sakshi
Sakshi News home page

గోల్కొండ మెట్లబావి, దోమకొండ కోటలకు యునెస్కో పురస్కారాలు

Published Sun, Nov 27 2022 2:08 AM | Last Updated on Sun, Nov 27 2022 2:59 PM

Telangana Wins Global Laurels Two Initiatives Bag UNESCO Award - Sakshi

గోల్కొండ మెట్లబావి

సాక్షి, హైదరాబాద్‌/కామారెడ్డి: ప్రజలు, పౌర సంస్థలు, వ్యక్తుల ఆధ్వర్యంలో సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణలో మంచి ప్రతిభ కనబరిచిన పనులకు యునె­స్కో పురస్కారాలు ప్రకటించింది. ఆసియా–పసిఫిక్‌ విభాగానికి మన దేశం నుంచి మూడు నిర్మాణాలు ఎంపిక కాగా, అందులో రెండు తెలంగాణకు చెందినవే కావడం విశేషం. సాంస్కృతిక వారసత్వ కట్టడాల పున రుద్ధరణ (ఏసియా–పసిఫిక్‌) కింద కుతుబ్‌షాహీ టూంబ్స్‌ పరిధిలోని గోల్కొండ మెట్ల బావి  ‘అవార్డ్‌ ఆఫ్‌ డిస్టింక్షన్‌’కు, కామారెడ్డి జిల్లా దోమకొండ కోట ‘అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’కు ఎంపికయ్యాయి.

దోమకొండ కోటను నాటి సంస్థానాధీశుల వారసులు పునరుద్ధరించుకుంటూ వస్తుండగా, మెట్ల బావిని ఆగాఖాన్‌ ట్రస్ట్‌ సొంత నిధుల తో పునరుద్ధరించింది. కుతుబ్‌షాహీల కాలంలో అద్భుత నిర్మాణ కౌశలంతో ఈ బావి రూపుదిద్దుకుంది. ఈ తరహా మెట్లబావులు కాకతీయుల కాలంలో నిర్మించిన దాఖలాలున్నాయి. గోల్కొండ కోటను కూడా తొలుత కాకతీయులే నిర్మించినందున, ఈ బావి కూడా వారి హయాంలోనే రూపుదిద్దు కుని ఉంటుందన్న వాదనా ఉంది. భారీ వర్షాలతో బావి కొంతభాగం కూలి పూడుకుపోయింది. ఆగాఖాన్‌ ట్రస్టు దాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించడంతో మళ్లీ అందులో నీటి ఊట ఏర్పడి ఇప్పుడు పూర్వపు రూపాన్ని సంతరించుకుంది. ఈ పునరుద్ధరణ పనులు అద్భుతంగా సాగిన తీరును యునెస్కో గుర్తించింది.  

వారెవ్వా.. ముంబై మ్యూజియం.. 
ఏసియా–పసిఫిక్‌ ప్రాంతానికి సంబంధించి 6 దేశాలకు చెందిన 13 కట్టడాలు పురస్కారాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. భారత్, చైనా, అఫ్ఘానిస్తాన్, ఇరాన్, నేపాల్, థాయిలాండ్‌ మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఇందులో మన దేశం నుంచి నాలుగు కట్టడాలున్నాయి. పురస్కారాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన విభాగం ‘అవార్డ్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌’.

ఈ కేటగిరీలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ వాస్తు సంగ్రహాలయ మ్యూజియం ఒక్కటే చోటు దక్కించుకోవటం విశేషం. దీని నిర్మాణాన్ని పునరుద్ధరించిన తీరు అత్యద్భుతమని యునెస్కో పురస్కారాల జ్యూరీ అభిప్రాయపడింది. రెండో కేటగిరీ అయిన డిస్టింక్షన్‌లో మెట్లబావి చోటు దక్కించుకుంది. అలాగే ముంబైలోని బైకులా స్టేషన్‌ మెరిట్‌ విభాగంలో చోటు దక్కించుకుంది. ఎంగ్‌ టెంగ్‌ ఫాంగ్‌ చారిటబుల్‌ ట్రస్టుతో సంయుక్తంగా యునెస్కో ఈ పురస్కారాలను ప్రకటిస్తోంది. 

40 ఎకరాల విస్తీర్ణంలో...
40 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ఎత్తైన రాతి కట్టడంతో ప్రహరీ, దాని చుట్టూ కందకం.. ఇప్పటికీ దోమకొండ కోట చెక్కు చెదరలేదు. కోటకు తూర్పు, పడమర దిక్కుల్లో  పెద్ద ద్వారాలున్నాయి. సంస్థానాదీశుల ప్రధాన నివాసంగా వెంకటభవనం రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. కోటలో రాతితో మహదేవుని ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. కోటలో అద్దాల మేడ ప్రత్యేకం.

ప్రముఖ సినీ హీరో చిరంజీవి తనయుడు రాంచరణ్, ఉపాసనల వివాహం ఇక్కడే జరిగింది. ఆర్కిటెక్ట్‌ అనురాధ నాయక్‌ కోట పరిరక్షణ బాధ్యతలు చూస్తున్నారు. గుర్తింపు రావడంపై దోమకొండ సంస్థానం వారసుడు అనిల్‌ కామినేని, అతని సతీమణి శోభన కామినేని మాట్లాడుతూ.. కోటకు వచ్చిన గుర్తింపు దోమకొండ ప్రజలకేకాక తెలంగాణ ప్రజలందరికీ దక్కిన గుర్తింపుగా భావిస్తున్నామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement