సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గడువులోగా గృహ నిర్మాణాలు పూర్తి కావట్లేదు. 2014, అంతకంటే ముందు ప్రారంభమై నేటికీ పూర్తికాకుండా కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలో ఇప్పటివరకు రూ.11,810 కోట్ల విలువ చేసే 17,960 గృహా నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయి. వీటిలో ఏడేళ్ల క్రితం ప్రారంభమైనవి 4,150 గృహాలున్నాయి. వీటి విలువ రూ.2,727 కోట్లని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది. నిధుల కొరత, న్యాయపరమైన సమస్యలు, కరోనా వ్యాప్తి వంటివి నిర్మాణ ఆటంకాలకు ప్రధాన కారణాలని పేర్కొంది. హైదరాబాద్‌లో నిలిచిపోయిన గృహాలలో 36 శాతం ప్రీమియం విభాగంలోనివి కాగా.. 20 శాతం లగ్జరీ సెగ్మెంట్, 22 శాతం అందుబాటు గృహాలు.
దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో రూ.5.05 లక్షల కోట్ల విలువ చేసే 6.29 లక్షల గృహా నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. వీటిలో 2014, అంతకంటే ముందు ప్రారంభమైన గృహాలు 1.74 లక్షల యూనిట్లున్నాయి. వీటి విలువ రూ.1.40 లక్షల కోట్లు. ఇప్పటివరకు ఆగిపోయిన గృహాలలో 39 శాతం అంటే 2,47,930 యూనిట్లు రూ.40–80 లక్షల మధ్య ధర ఉండే మిడ్‌రేంజ్ విభాగంలోనివి. 32 శాతం (2,01,350 యూనిట్లు) రూ.40 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలు, 18 శాతం (1,11,050 యూనిట్లు) రూ.80–1.5 కోట్ల ధర ఉండే ప్రీమియం విభాగంలోనివి, 68,300 యూనిట్లు రూ.1.5 కోట్లకు పైగా ధర ఉండే లగ్జరీ విభాగంలోనివి. అత్యధికంగా ఎన్‌సీఆర్‌లో 1,13,860 గృహా నిర్మాణాలు నిలిచిపోయాయి. వీటి విలువ రూ.86,463 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment