stop construction
-
ఢిల్లీలో నిర్మాణ కార్యకలాపాలు బంద్
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్య స్థాయి పెరగడంతో నివారణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఢిల్లీలో శనివారం సాయంత్రం నాలుగింటికి 24 గంటల సగటు వాయు నాణ్యత సూచీ 397కు పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే ఇంతగా గాలి కాలుష్యం నమోదవడం ఇదే తొలిసారి. దీంతో సూక్ష్మ ధూళి కణాలు గాల్లో మరింతగా పెరగకుండా చూసేందుకు నిర్మాణ కార్యక్రమాలను ఆపాలని, కూల్చివేతలకు స్వస్తిపలకాలని కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఏక్యూఎం) శనివారం ఆదేశాలు జారీచేసింది. దేశ భద్రత, రక్షణ, రైల్వే, మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులకు మినహాయింపునిచ్చింది. బీఎస్–3 పెట్రోల్, బీఎస్–4 డీజిల్ వాహనాల రాకపోకల నిషేధానికి నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సీఏక్యూఎం సూచించింది. చలి పెరగడం, ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతో వెలువడే పొగ ఢిల్లీని కమ్మేస్తోంది. నిషేధకాలంలో బోర్లు వేయడం, డ్రిల్లింగ్, వెల్డింగ్, రోడ్ల నిర్మాణం, మరమత్తు, ఇటుకల తయారీ, తదితర నిర్మాణరంగ పనులను చేయకూడదు. -
హైదరాబాద్‌లో ఆగిన నిర్మాణాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గడువులోగా గృహ నిర్మాణాలు పూర్తి కావట్లేదు. 2014, అంతకంటే ముందు ప్రారంభమై నేటికీ పూర్తికాకుండా కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలో ఇప్పటివరకు రూ.11,810 కోట్ల విలువ చేసే 17,960 గృహా నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయి. వీటిలో ఏడేళ్ల క్రితం ప్రారంభమైనవి 4,150 గృహాలున్నాయి. వీటి విలువ రూ.2,727 కోట్లని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది. నిధుల కొరత, న్యాయపరమైన సమస్యలు, కరోనా వ్యాప్తి వంటివి నిర్మాణ ఆటంకాలకు ప్రధాన కారణాలని పేర్కొంది. హైదరాబాద్‌లో నిలిచిపోయిన గృహాలలో 36 శాతం ప్రీమియం విభాగంలోనివి కాగా.. 20 శాతం లగ్జరీ సెగ్మెంట్, 22 శాతం అందుబాటు గృహాలు. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో రూ.5.05 లక్షల కోట్ల విలువ చేసే 6.29 లక్షల గృహా నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. వీటిలో 2014, అంతకంటే ముందు ప్రారంభమైన గృహాలు 1.74 లక్షల యూనిట్లున్నాయి. వీటి విలువ రూ.1.40 లక్షల కోట్లు. ఇప్పటివరకు ఆగిపోయిన గృహాలలో 39 శాతం అంటే 2,47,930 యూనిట్లు రూ.40–80 లక్షల మధ్య ధర ఉండే మిడ్‌రేంజ్ విభాగంలోనివి. 32 శాతం (2,01,350 యూనిట్లు) రూ.40 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలు, 18 శాతం (1,11,050 యూనిట్లు) రూ.80–1.5 కోట్ల ధర ఉండే ప్రీమియం విభాగంలోనివి, 68,300 యూనిట్లు రూ.1.5 కోట్లకు పైగా ధర ఉండే లగ్జరీ విభాగంలోనివి. అత్యధికంగా ఎన్సీఆర్లో 1,13,860 గృహా నిర్మాణాలు నిలిచిపోయాయి. వీటి విలువ రూ.86,463 కోట్లు. -
ఫుడ్‌పార్క్‌పై ఎగసిన నిరసన
తుందుర్రు (భీమవరం అర్బన్): భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు, కంసాల బేతపూడి గ్రామాల్లో జనావాసాల మధ్య నిర్మిస్తున్న గోదావరి మెగా ఫుడ్‌పార్కు నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేయాలని ఫుడ్‌పార్కు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు గళమెత్తారు. ఫుడ్‌పార్కు పనులు నిలుపుదల చేయాలంటూ భీమవరం మండలం తుందుర్రులో మూడు గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పోరాట కమిటీ నాయకులు సముద్రాల వెంకటేశ్వరరావు, నన్నేటి నాగరాజు, తాడి దానియేలు, ఆరేటి వాసు, జవ్వాది సత్యనారాయణ మాట్లాడుతూ రెండున్నర ఏళ్లుగా ఫుడ్‌పార్కును నిర్మించవద్దంటూ పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి ఫుడ్‌పార్క్ యాజమాన్యానికి అనుకూలంగా పాలకులు మాట్లాడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయినా సరే ఫ్యాక్టరీని అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలుపుదల చేయకపోతే మరో బార్డోలిని తలపించేలా ఉద్యమం చేస్తామన్నారు. బెల్లపు సత్తిబాబు, యర్రంశెట్టి అబ్బులు, కొత్తపల్లి విశ్వనాథం, జడ్డు రాము, చీడే సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.