ఫుడ్‌పార్క్‌పై ఎగసిన నిరసన
తుందుర్రు (భీమవరం అర్బన్): భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు, కంసాల బేతపూడి గ్రామాల్లో జనావాసాల మధ్య నిర్మిస్తున్న గోదావరి మెగా ఫుడ్‌పార్కు నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేయాలని ఫుడ్‌పార్కు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు గళమెత్తారు. ఫుడ్‌పార్కు పనులు నిలుపుదల చేయాలంటూ భీమవరం మండలం తుందుర్రులో మూడు గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పోరాట కమిటీ నాయకులు సముద్రాల వెంకటేశ్వరరావు, నన్నేటి నాగరాజు, తాడి దానియేలు, ఆరేటి వాసు, జవ్వాది సత్యనారాయణ మాట్లాడుతూ రెండున్నర ఏళ్లుగా ఫుడ్‌పార్కును నిర్మించవద్దంటూ పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి ఫుడ్‌పార్క్ యాజమాన్యానికి అనుకూలంగా పాలకులు మాట్లాడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయినా సరే ఫ్యాక్టరీని అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలుపుదల చేయకపోతే మరో బార్డోలిని తలపించేలా ఉద్యమం చేస్తామన్నారు. బెల్లపు సత్తిబాబు, యర్రంశెట్టి అబ్బులు, కొత్తపల్లి విశ్వనాథం, జడ్డు రాము, చీడే సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.