people demand
-
చిగురిస్తున్న ఆశలు
సాక్షి, జనగామ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ ప్రాంతంలో దశాబ్దాల కాలం నుంచి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి మీద ఉన్న పట్టణం కావడంతో పాటు.. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉంది. ఉన్నత విద్యాసంస్థలు ఉన్నప్పటికీ మెడిసిన్ చదువు మాత్రం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. వైద్యం చేయించుకోవడానికి హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలకు పోవాల్సి వస్తుంది. దీంతో ఇక్కడే మెడికల్ కాలేజీ నిర్మిస్తే అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. జిల్లా ఏర్పాటు తరువాత మెడికల్ కాలేజీ కావాలనే కోరికను ప్రబలంగా విన్పిస్తున్నారు. కేసీఆర్ హామీతో తెరపైకి.. మెడికల్ కాలేజీ కోసం ప్రజల్లో డిమాండ్ ఉన్నప్పటికీ పాలకుల నుంచి మాత్రం స్పందన లేదు. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రానికి సీఎం కేసీఆర్ వచ్చారు. ఎన్నికల బహిరంగ సభలో జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రకటనతో ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది. తాజాగా భువనగిరి లోక్‌సభ ఎన్నికల బహిరంగ సభలో మెడికల్ కాలేజీ గురించి మరోసారి ప్రస్తావించి ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. కేసీఆర్ ప్రకటనతో మెడికల్ కాలేజీ ఏర్పాటుపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వస్తే లాభాలు ఇవి.. ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఉన్న ఏరియా ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయడంతో 250 పడకల ఆస్పత్రిగా మారింది. మెడికల్ కాలేజీ మంజూరైతే 600 పడకల ఆస్పత్రిగా మారుతుంది. అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. 13 రకాల ప్రత్యేక వైద్య విభాగాలు ఏర్పాటవుతాయి. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా మారుతాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ వస్తుంది. ఐసీయూ, ట్రామా సెంటర్ వస్తాయి. వీటితోపాటుగా ప్రజలకు ప్రభుత్వపరంగా నాణ్యమైన వైద్యసదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. -
ఫుడ్‌పార్క్‌పై ఎగసిన నిరసన
తుందుర్రు (భీమవరం అర్బన్): భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు, కంసాల బేతపూడి గ్రామాల్లో జనావాసాల మధ్య నిర్మిస్తున్న గోదావరి మెగా ఫుడ్‌పార్కు నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేయాలని ఫుడ్‌పార్కు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు గళమెత్తారు. ఫుడ్‌పార్కు పనులు నిలుపుదల చేయాలంటూ భీమవరం మండలం తుందుర్రులో మూడు గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పోరాట కమిటీ నాయకులు సముద్రాల వెంకటేశ్వరరావు, నన్నేటి నాగరాజు, తాడి దానియేలు, ఆరేటి వాసు, జవ్వాది సత్యనారాయణ మాట్లాడుతూ రెండున్నర ఏళ్లుగా ఫుడ్‌పార్కును నిర్మించవద్దంటూ పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి ఫుడ్‌పార్క్ యాజమాన్యానికి అనుకూలంగా పాలకులు మాట్లాడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయినా సరే ఫ్యాక్టరీని అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలుపుదల చేయకపోతే మరో బార్డోలిని తలపించేలా ఉద్యమం చేస్తామన్నారు. బెల్లపు సత్తిబాబు, యర్రంశెట్టి అబ్బులు, కొత్తపల్లి విశ్వనాథం, జడ్డు రాము, చీడే సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆక్వా పార్క్ వద్దంటూ మహిళల వినూత్న నిరసన
మొగల్తూరు : జీవనది లాంటి గొంతేరు డ్రెయిన్‌ను నాశనం చేసి తమ పొట్టలు కొట్టవద్దని మహిళలు గొంతెత్తి నినదించారు. మంగళవారం ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవులోని గొంతేరు డ్రెయిన్‌లో పడవలపై వెళ్లి నీటి మధ్యలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తమ తాత ముత్తాతల నుంచి ఈ యేరుపై ఆధారపడి బతుకుతున్నామన్నారు. తమ కళ్లెదుటే యనమదుర్రు డ్రెయిన్‌ను నాశనం చేసి మత్స్యకారుల పొట్టకొట్టారని, వేటే జీవనంగా సాగిస్తున్న తమ బతుకులను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుందుర్రులో ఏర్పాటు చేసే ఆక్వా పరిశ్రమను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. తిరుమాని నాగేశ్వరరావు, నాగిడి రాంబాబు, కొల్లాటి మంగమ్మ, వాటాల ధనలక్ష్మి, సొర్రా సూర్యావతి, బర్రిచల్లాలు, వాటాల సరస్వతి, తిరుమాని సుమంగళి, గాడి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.