
సాక్షి, జనగామ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ ప్రాంతంలో దశాబ్దాల కాలం నుంచి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి మీద ఉన్న పట్టణం కావడంతో పాటు.. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉంది. ఉన్నత విద్యాసంస్థలు ఉన్నప్పటికీ మెడిసిన్ చదువు మాత్రం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. వైద్యం చేయించుకోవడానికి హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలకు పోవాల్సి వస్తుంది. దీంతో ఇక్కడే మెడికల్ కాలేజీ నిర్మిస్తే అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. జిల్లా ఏర్పాటు తరువాత మెడికల్ కాలేజీ కావాలనే కోరికను ప్రబలంగా విన్పిస్తున్నారు.
కేసీఆర్ హామీతో తెరపైకి..
మెడికల్ కాలేజీ కోసం ప్రజల్లో డిమాండ్ ఉన్నప్పటికీ పాలకుల నుంచి మాత్రం స్పందన లేదు. 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రానికి సీఎం కేసీఆర్ వచ్చారు. ఎన్నికల బహిరంగ సభలో జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రకటనతో ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది. తాజాగా భువనగిరి లోక్‌సభ ఎన్నికల బహిరంగ సభలో మెడికల్ కాలేజీ గురించి మరోసారి ప్రస్తావించి ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. కేసీఆర్ ప్రకటనతో మెడికల్ కాలేజీ ఏర్పాటుపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
వస్తే లాభాలు ఇవి..
ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఉన్న ఏరియా ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయడంతో 250 పడకల ఆస్పత్రిగా మారింది. మెడికల్ కాలేజీ మంజూరైతే 600 పడకల ఆస్పత్రిగా మారుతుంది. అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. 13 రకాల ప్రత్యేక వైద్య విభాగాలు ఏర్పాటవుతాయి. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా మారుతాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ వస్తుంది. ఐసీయూ, ట్రామా సెంటర్ వస్తాయి. వీటితోపాటుగా ప్రజలకు ప్రభుత్వపరంగా నాణ్యమైన వైద్యసదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment