సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఎప్పటినుంచో వెస్ట్‌జోన్‌కే ఎంతో డిమాండ్ ఉంది. పలు ఐటీ సంస్థలతోపాటు అక్కడి సదుపాయాల వల్ల ప్రజలు అటువైపే స్థిరనివాసాలకు మొగ్గుచూపేవారు. అయితే గత రెండేళ్లుగా మధ్యతరగతి ప్రజలు ఈస్ట్‌జోన్‌లో ఇళ్లు కట్టుకొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ జోన్‌కు దగ్గర్లో పలు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నందున పిల్లల చదువుల కోసం నగరానికి వచ్చేవారు, దాదాపు రెండు గంటల ప్రయాణ సమయం పట్టే ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, ఈస్ట్‌జోన్‌లోని సంస్థల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకుంటున్నారు.
ఏడాదికాలంలో జీహెచ్‌ఎంసీ జారీ చేసిన భవన నిర్మాణ అనుమతులు సైతం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. వెస్ట్‌జోన్‌తో పోలిస్తే భూముల ధరలు తక్కువ ఉండటమే ప్రధాన కారణం. అలాగే ఇటీవల పలు ఫ్లైఓవర్లు అందుబాటులోకి రావడంతోపాటు యాదాద్రి, వరంగల్, నల్లగొండ, విజయవాడలకు వెళ్లే హైవేలు, మెట్రో సదుపాయం ఉండటంతో నివాస గృహాలకు ఎక్కువ మంది ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ లుక్ ఈస్ట్.. నినాదం కూడా పలువురిని ఆకట్టుకుంటోంది.
ఏడాది కాలంలో జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్లలో 11 వేల భవన నిర్మాణాలకు అనుమతులివ్వగా ఈస్ట్‌జోన్‌లోని హయత్‌నగర్ సర్కిల్‌లోనే అత్యధికంగా 1,722 ఉన్నాయి. ఈ జోన్‌లోని ఉప్పల్, కాప్రా సర్కిళ్లలో అత్యధిక భవనాలకు అనుమతులిచ్చారు. ఐదంతస్తుల వరకు నివాస భవనాల్లోనూ దాదాపు 2 వేల భవనాలకు అనుమతులివ్వగా ఈస్ట్ జోన్‌లోనే అత్యధికంగా 600 వరకు ఉన్నాయి.
అందుబాటులో ధరలు..
ఈస్ట్‌జోన్‌లో భూముల ధరలు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్నాయి. హైక్లాస్ భవనాలైనా ఎస్‌ఎఫ్‌టీకి రూ. 5వేల లోపే లభిస్తున్నాయి.
– శ్రీనివాస్‌రెడ్డి, బిల్డర్, ఉప్పల్
సదుపాయాలు బాగున్నాయి
ఇళ్లు నివాసయోగ్యంగా ఉండటంతోపాటు ఇక్కడి నుంచి ఏ ప్రాంతంవైపు వెళ్లాలన్నా సౌకర్యాలు బాగుండటంతో ఇటీవలే ఇల్లు కట్టుకున్నాం.
– బాలచందర్, ఉప్పల్
రవాణా సౌకర్యాలున్నాయి
ఎల్బీనగర్ ప్రాంతం తెలంగాణలోని పలు జిల్లాలతోపాటు ఏపీవాసులకు ముఖద్వారంగా ఉంది. మెట్రో అనుసంధానంతోపాటు ఫ్లైఓవర్ల వల్ల ట్రాఫిక్ సమస్యల్లేవు. రాబోయే రోజుల్లో ఎల్బీనగర్ మరో గచ్చిబౌలిలా మారొచ్చు.
– స్వప్నారెడ్డి, గృహిణి, సహారా ఎస్టేట్స్ కాలనీ, మన్సూరాబాద్
చదవండి: అంటువ్యాధులు, మహమ్మారుల సన్నద్ధతపై ప్రత్యేక కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment