భారీగా పెరుగనున్న ఆపిల్ ఉత్పత్తుల ధరలు
రాత్రికి రాత్రే టెక్ దిగ్గజం ఆపిల్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ కంపెనీ ఆఫర్ చేసే మ్యాక్ ప్రొ లాంటి కొన్ని ఉత్పత్తుల ధరలు 20 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా స్వీడన్ ఎలక్ట్రోలక్స్ కూడా తమ గృహోపకరణాలపై ధరలను 10 శాతం పెంచుతున్నట్టు తెలిపింది. ఈ సడెన్ నిర్ణయాలకు వెనుక కారణం బ్రెగ్జిట్ బాటలో యూకే వేగవంతంగా పయనిస్తుందనే వార్తలేనని తెలుస్తోంది. గత రెండేళ్లలో ఈ ఏడాది ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుందని, మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా పౌండ్ క్షీణిస్తుండటంతో, ఈ ప్రభావం దిగుమతులపై పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ధరల పెరుగుదల మరింత ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
గతవారం 2,499 పౌండ్లకు(రూ.2,03,504) లభించిన ఆపిల్ డెస్క్టాప్ మిషన్ మ్యాక్ ప్రొపై కంపెనీ ప్రస్తుతం 2,999 పౌండ్ల(రూ.2,44,221) ధర పలుకుతోంది. మ్యాక్ మినీ ధర కూడా 399 పౌండ్ల(రూ.32,492) నుంచి 479 పౌండ్ల(రూ.39,007)కు పెరిగింది. అయితే అమెరికన్ మార్కెట్లో మాత్రం మ్యాక్ మినీ, మ్యాక్ ప్రొ ధరల్లో మార్పులు లేనట్టు ఆపిల్ తెలిపింది. కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్, స్థానిక దిగుమతి చట్టాలు, వ్యాపార పద్దతులు, పన్నులు, వ్యాపార ఖర్చులు వంటి ప్రభావంతో అంతర్జాతీయంగా ఆపిల్ ఉత్పత్తుల ధరలు పెంచినట్టు కంపెనీ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో చెప్పారు. అయితే ఈ కారణాలు అన్ని దేశాల్లో ఒకేవిధంగా ఉండవని, ప్రాంతానికి ప్రాంతానికి మారుతూ ఉంటాయని పేర్కొన్నారు.
అంతర్జాతీయ ధరలను, అమెరికా రిటైల్ ధరలతో పోల్చిచూడదని తెలిపారు. పౌండ్ క్షీణిస్తుండటంతో, ఆ నష్టాన్ని భర్తీచేసుకోవడానికి ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్ల ధరలు పెంచుతున్నట్టు ఎలక్ట్రోలక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోనస్ సామ్యూల్సన్ చెప్పారు. బ్రెగ్జిట్కు మొగ్గుచూపుతూ యూకే తీసుకున్న సంచలన నిర్ణయంతో డాలర్తో పోలిస్తే పౌండ్ విలువ 18 శాతం మేర కుదేలైంది. ఈ ఏడాదిలో అత్యధికంగా క్షీణించిన కరెన్సీ పౌండే. ఈ పతనంతో దిగుమతి ధరలు పెరుగుతున్నాయని, దీంతో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం 3 శాతానికి పెరుగుతుందని అక్కడి విశ్లేషకులు అంచనావేస్తున్నారు.