బ్రెగ్జిట్తో వృద్ధికి ఢోకా ఉండదు: క్రిసిల్
♦ 7.9% అంచనాలు కొనసాగింపు
♦ ఐటీ సహా పలు రంగాలపై ఒత్తిళ్లు
ముంబై: బ్రెగ్జిట్ వల్ల కొన్ని రంగాలపై ప్రభావం ఉంటుందని, అయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధిపై చెప్పుకోతగ్గ ప్రభావం ఏమీ ఉండదని రేటింగ్ సంస్థ క్రిసిల్ వెల్లడించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి 7.9 శాతంగా ఉంటుందన్న తమ అంచనాలను కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. వృద్ధికి వ్యవసాయం చోదకంగా నిలుస్తుందని, వృద్ధి సాధించడంలో జూలై, ఆగస్టులో కురిసే వర్షాలు కీలకమని పేర్కొంది. డిమాండ్ తగ్గుదల, కమోడిటీల ధరల్లో ఒడిదుడుకులతో భారతీయ కంపెనీలపై ప్రభావం ఉంటుందని క్రిసిల్ తన తాజా నివేదికలో తెలిపింది. ముఖ్యంగా ఐటీ, ఆటో, టెక్స్‌టైల్స్, ఫార్మా, లెదర్, మెటల్స్ రంగాలు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటాయని అంచనా వేసింది. యూకే, యూరోప్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలపై కూడా ప్రభావం ఉంటుందని, హెడ్జింగ్ లేని విదేశీ రుణాల రూపంలో బ్యాలన్స్ షీట్లపై ఒత్తిడి పడుతుందని పేర్కొంది.
ఐటీ రంగం... రూపాయి: దేశ ఎగుమతుల్లో అధిక భాగం ఐటీ రంగం నుంచే ఉంటున్నాయి. భారతీయ మొత్తం ఐటీ ఎగుమతుల్లో 17% బ్రిటన్‌కే వెళుతున్నాయి. యూరప్ వాటా 29%. బ్రెగ్జిట్ వల్ల ఇప్పుడు ఐటీ కంపెనీలపై ఒకేసారి పలు కష్టాలు వచ్చి పడ్డాయి. అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అధిక కేటాయింపులు చేయడంతోపాటు... యూకే నుంచి యూరోప్‌కు ఉద్యోగుల తరలింపు కారణంగా పరిపాలనా ఖర్చులు పెరిగిపోతాయి. రూపాయిపై కూడా గణనీయమైన ప్రభావం పడుతుంది. 2017 మార్చి నాటికి డాలర్‌తో పోలిస్తే 66.50 స్థాయిలో ఉంటుంది. భారత్ నుంచి బ్రిటన్‌కు సరుకుల ఎగుమతులు కేవలం 3 శాతంగానే ఉండడంతో ఎగుమతులపై భారీగా ప్రభావం ఉండదని అంచనా వేసింది. పోటీ కరెన్సీల గమనం భారత్‌కు కీలకమని పేర్కొంది. అయితే, మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు తగ్గుతాయి.