ఐటీ రంగాన్ని ముంచేసిన బ్రెగ్జిట్
ముంబై: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఐటి షేర్లను తీవ్ర నష్టాల్టోకి నెట్టేసింది. డాలర్ కు వ్యతిరేకంగా బ్రిటిష్ పౌండ్ విలువ భారీగా పతనంకావడంతో శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఐటి ఇండెక్స్ 4 శాతానికి పైగా నష్టపోయింది. అయితే ఈ ప్రభావం స్వల్ప కాలం మాత్రమేని ఐటి నిపుణులు వ్యాఖ్యానించారు.
టెక్ మహీంద్రా దాదాపు 7 శాతం, హెచ్ సీఎల్ టెక్ ఎక్కువ 6 శాతం క్షీణించగా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో 3 నుంచి 6 శాతం మేర పతనమయ్యాయి. అలాగే యూకే నుంచి టీసీఎస్ 13 శాతం, హెచ్ సీఎల్ టెక్ 14 శాతం భారీ ఆదాయాన్ని పొందుతుండగా, ఇన్ఫోసిస్ , విప్రో లు కూడా దాదాపు 7 నుంచి11 శాతం ఆదాయాన్ని పౌండ్లలో పొందుతున్నాయని విశ్లేషకులు చెప్పారు. బ్రెగ్జిట్ నిర్ణయం మూలంగా పౌండ్ విలువ 31 సంవత్సరాల కనిష్ఠానికి కూలిపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుందని తెలిపారు.
బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ) వైదొలగుతున్న ప్రభావం ఐటి పరిశ్రమ పై స్వల్పకాలికమేనని పరిశ్రమ పెద్దలు అభిప్రాయ పడ్డారు. ఈ అనిశ్చిత వాతావరణంలో భారీ హెచ్చుతగ్గులు, ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు. బ్రెగ్జిట్ ప్రభావంతో మారకపు అనిశ్చితి కారణంగా ప్రతికూల ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు.
కాగా బ్రిటన్ గురువారం జరిగిన ఒక చరిత్రాత్మక ప్రజాభిప్రాయ సేకరణలో 43 సంవత్సరాల తర్వాత ఈయూని వీడింది. ఈ పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.