ముంబై: గడిచిన క్యాలండర్ ఏడాది(2023)లో విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్‌ఏ) లావాదేవీలు 51 శాతం క్షీణించాయి. 83.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్ల గణాంకాల సంస్థ ఎల్‌ఎస్‌ఈజీ డీల్స్ ఇంటెలిజెన్స్(గతంలో రెఫినిటివ్) వివరాల ప్రకారం గతేడాది డీల్స్ భారీగా నీరసించాయి. ప్రయివేట్ రంగ ఫైనాన్షియల్ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం మధ్య నమోదైన భారీ డీల్ గణాంకాలకు కొంతమేర మద్దతిచ్చినట్లు ఎల్‌ఎస్‌ఈజీ నివేదిక తెలియజేసింది. నిజానికి 60.4 బిలియన్ డాలర్ల ఈ డీల్‌ను మినహాయిస్తే వార్షికంగా మరో 23 శాతం అదనపు క్షీణత నమోదయ్యేదని పేర్కొంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా లావాదేవీల వాతావరణం మందగించడంతో భారీ డీల్స్ నీరసించినట్లు తెలియజేసింది.
ఒకే ఒక్క డీల్
అంతక్రితం ఏడాది(2022)తో పోలిస్తే 3 బిలియన్ డాలర్లకు ఎగువన హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం లావాదేవీ మాత్రమే నమోదైంది. 2022లో 5 భారీ డీల్స్‌కు తెరలేవగా.. పరిమాణంరీత్యా గతేడాది 1.7 శాతం క్షీణతే నమోదైనట్లు ఎల్‌ఎస్‌ఈజీ డీల్స్ సీనియర్ మేనేజర్ ఇలేన్ టాన్ పేర్కొన్నారు. వెరసి మధ్యస్థాయి మార్కెట్ లావాదేవీల హవా కొనసాగినట్లు తెలియజేశారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం భారీగా నీరసించడంతో వడ్డీ రేట్లు దిగివచ్చే వీలుంది. ఫలితంగా 2024లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు దారి ఏర్పడనుంది. తద్వారా చౌకగా పెట్టుబడులు సమకూర్చుకునేందుకు వీలు చిక్కనున్నట్లు టాన్ వివరించారు. ఈ నేపథ్యంలో దేశీయంగా సార్వత్రిక ఎన్నికల తదుపరి ఎంఅండ్‌ఏ డీల్స్ ఊపందుకునే అవకాశమున్నట్లు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా సైతం ఈ ట్రెండ్‌కు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. రష్యా–ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో 2022 మార్చిలో ఫండింగ్ వింటర్(పెట్టుబడులు తగ్గిపోవడం) ప్రారంభమైనట్లు తెలియజేశారు. అంతేకాకుండా అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి దీనికి కారణమైనట్లు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంఅండ్‌ఏ డీల్స్ 17 శాతం క్షీణించి దశాబ్ద కనిష్టం 2.9 ట్రిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
ఈక్విటీలు జూమ్
ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ 60 శాతం ఎగసి 31.2 బిలియన్ డాలర్లమేర బలపడింది. 2021 తదుపరి వార్షికంగా గరిష్టస్థాయిలో నమోదైంది. ఫాలోఆన్ ఆఫర్లు రెట్టింపై 24.4 బిలియన్ డాలర్లను తాకాయి. మరోవైపు 1996 తదుపరి కొత్త ఈక్విటీ జారీ ఐపీవోలు 56 శాతం జంప్‌చేశాయి. కనీసం 236 ఎస్‌ఎంఈలు లిస్టింగ్ ద్వారా 6.8 బిలియన్ డాలర్లు అందుకున్నాయి. అయితే 2022తో పోలిస్తే ఇవి 11 శాతం తక్కువే!
Comments
Please login to add a commentAdd a comment