పేటీఎం ( Paytm )యాజమాన్య ఫిన్‌టెక్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు గురువారం (ఫిబ్రవరి 15) 5 శాతం పడిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ. 325.30 వద్ద సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని ఉపయోగించే సంస్థలు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) ను ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి పేటీఎం బ్యాంక్ ప్రతినిధులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ప్రశ్నించిన ఘటన తర్వాత వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు పడిపోయాయి.ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిషేధం విధించినప్పటి నుంచి 11 రోజులలో పేటీఎం ఇన్వెస్టర్లు సుమారు రూ. 27,000 కోట్లు నష్టపోయారు. ఇది దాని విలువలో 57 శాతం.
ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలతో వ్యాపారాన్ని నిర్వహించిన కస్టమర్‌లకు సంబంధించిన సమాచారం, పత్రాలు, వివరాల ఈడీ నుంచి నోటీసులు, అభ్యర్థనలు వస్తున్నట్లు ఇటీవలి ఫైలింగ్‌లో వన్97 కమ్యూనికేషన్స్ అంగీకరించింది. అయితే తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ విదేశీ రెమిటెన్స్‌లలో పాల్గొనదని కంపెనీ స్పష్టం చేసింది.
నివేదికల ప్రకారం.. ఈడీ అధికారులు కోరిన సమాచారం, పత్రాలను పేటీఎం ఇప్పటికే అందించినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలోగా మరిన్ని వివరాలు అందజేయాలని ఈడీ ఆదేశించినట్లుగా సమాచారం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి సేకరించిన సమాచారం, డాక్యుమెంట్‌లు ఈ దశలో ఫెమా ఉల్లంఘనలను సూచించడం లేదని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ద్వారా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment