బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే | British new PM Theresa May | Sakshi
Sakshi News home page

బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే

Published Tue, Jul 12 2016 2:04 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే

బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే

రేపు ప్రమాణ స్వీకారం:  కామరాన్ ప్రకటన

 లండన్ : బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా థెరిసా మే బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రస్తుత ప్రధాని డేవిడ్ కామెరాన్ సోమవారం ప్రకటించారు. థెరిసా (59) ప్రస్తుతం దేశ హోంమంత్రిగా ఉన్నారు. ఉక్కు మహిళగా పేరుపడ్డ మార్గరెట్ థాచర్ అనంతరం బ్రిటన్ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న మహిళా నేత థెరిసాయే. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ (బ్రెగ్జిట్) జూన్ 23న నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో తీర్పు వెల్లడవటంతో.. బ్రెగ్జిట్‌ను బలంగా వ్యతిరేకించిన కామెరాన్ తాను ప్రధాని పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈయూతో బ్రెక్జిట్ చర్చలను ముందుకు తీసుకెళ్లే అంశాన్ని కొత్త ప్రధాని చూస్తారని ఆయన అప్పుడు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కామెరాన్ తర్వాత ప్రధాని పదవి కోసం అధికార కన్సర్వేటివ్ పార్టీలో.. హోంమంత్రి థెరిసా మే, ఇంధనశాఖ మంత్రి ఆంద్రియా లీడ్సమ్‌ల (53) మధ్య పోటీ నెలకొంది. అయితే నాటకీయంగా సోమవారం ఉదయం ఆంద్రియా తాను పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు థెరిసా బలమైన నాయకురాలంటూ ఆమెకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. దీంతో.. థెరిసా ఒక్కరే బరిలో మిగిలారు. ఈ నేపథ్యంలో కన్సర్వేటివ్ పార్టీ బోర్డు సభ్యులు 22 మంది సోమవారం నాడే అత్యవసరంగా సమావేశమై.. పోటీ లేనందున ఇక ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదంటూ.. థెరిసా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

ఈ నేపథ్యంలో కామెరాన్ సోమవారం తన అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద మీడియాతో మాట్లాడారు. థెరిసా బుధవారం ప్రధానిగా బాధ్యతలు చేపడతారన్నారు. తాను మంగళవారం తన చివరి మంత్రివర్గ భేటీకి హాజరవుతానని, బుధవారం ప్రధానిగా తన చివరి ప్రశ్నల కోసం హౌస్ ఆఫ్ కామన్స్‌కు హాజరవుతానని.. ఆ తర్వాత నబకింగ్‌హామ్ పాలస్‌కు వెళ్లి రెండో ఎలిజబెత్ రాణికి రాజీనామా సమర్పిస్తానన్నారు. ‘థెరిసా బలమైన నాయకురాలు. రానున్న సంవత్సరాల్లో మన దేశానికి అవసరమైన నాయకత్వాన్ని అందించటంలో ఆమె చాలా సమర్థులు’ అని కితాబునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement