యూత్ కలిసుందామని.. పెద్దలు విడిపోదామని..
లండన్: చరిత్రాత్మక బ్రెగ్జిట్ నిర్ణయంతో బ్రిటిషర్లు తమ దేశ భవిష్యత్తును కొత్త మార్గంలోకి తీసుకెళ్లారు. కష్టనష్టాలతో కూడుకున్న ఆ దారిలో బ్రిటన్ సంతోషతీరాలకు చేరుతుందా? దుఃఖసాగరంలోనే ఎదురీదుతుందా? అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇంతకీ ఇంతటి కీలకమైన బ్రెగ్జిట్ రెఫరెండం ఓటింగ్ ఎలా జరిగింది? ఏయే వర్గాలు అనుకూలంగా, ఏయే వర్గాలు ప్రతికూలంగా ఓటు వేశాయి? మహిళల పాత్ర ఏమిటి? బ్రెగ్జిట్ తో బ్రిటన్ బాధలు తీరిపోతాయా? అనే అంశాలపై పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు గ్రాఫిక్ తో కూడిన నివేదికలు వెల్లడించాయి.
ఆ నివేదికల్లోని చాలా అంశాలు షాక్ కు గురిచేసేలా ఉన్నాయి. ఉదాహరణకు యువకుల్లో అత్యధికులు బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలని ఓటువేయగా, 50 ఏళ్ల పైబడినవారు మాత్రం బ్రెగ్జిట్ కు మద్దతు పలికారు. కంపెనీల మేనేజర్లు నో చెప్పగా, కార్మికులు మాత్రం బ్రెగ్జిట్ కు జై కొట్టారు. బ్రెగ్జిట్ తో బ్రిటన్ కు మరిన్ని కష్టాలు తప్పవని 51 శాతం మంది అభిప్రాయపడ్డారు. రెఫరెండం సందర్భంగా బ్రిటన్ లో ఏం జరిగిందో ఈ గ్రాఫిక్స్ ను చూస్తే మీకే అర్థం అవుతుంది..
పిల్లలు కలిసుందామని.. పెద్దలు విడిపోదామని..
ఓటు హక్కు పొందేందుకు ప్రాథమిక వయసైన 18 ఏళ్ల నుంచి 24 వయసున్న యువకుల్లో అత్యధికులు బ్రిటన్ ఈయూలో కొనసాగాలని ఓటేయగా, 50 ఏళ్ల పైబడినవారిలో చాలా మంది బ్రెగ్జిట్ కు మద్దతు పలికారు.
మేనేజర్లు నై.. లేబరర్లు జై..
బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న పలు కంపెనీల మేనేజర్లు తమ దేశం ఈయూలో కొనసాగాలని ఓటువేయగా, కార్మికులు, మాజీ కార్మికులు, వితంతువులు మాత్రం బ్రెగ్జిట్ కు ఓటేశారు.
డోలాయమానంలో మహిళలు
చాలా విషయాల్లో కచ్చితత్వాన్ని ప్రదర్శించే బ్రిటిష్ మహిళలు బ్రెగ్జిట్ ఓటింగ్ లో మాత్రం తడబాటుకు గురయ్యారు. ఓటు వేసిన వారిలో ఏకంగా 16 శాతం మంది 'ఏమీ తెలియదు'అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పురుషుల్లో 46 శాతం మంది బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా, 43 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు.
బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ఓటేసిన లండన్ నగరం
గ్రేట్ బ్రిటన్ లోని ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్ లాండ్ రీజియన్లలో బ్రెగ్జిట్ అనుకూల, వ్యతిరేక ఓటింగ్ ఇలా సాగింది. లండన్ ప్రజల్లో 51 శాతం మంది బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలని కోరుకున్నారు.
అన్ని ప్రధాన పార్టీల్లో చీలికలు
బ్రెగ్జిట్ రెఫరెండంపై ఒక్క యూకే ఇండిపెండెండ్ పార్టీలో తప్ప అన్ని ప్రధాన పార్టీల్లో చీలిక ఏర్పడింది. అధికార కంజర్వేటివ్ పార్టీలో 55 శాతం మంది బ్రెగ్జిట్ కు అనుకూలంగా, 38 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఆర్థికంగా దెబ్బే!
ఈయూ నుంచి విడిపోవడం ద్వారా బ్రిటన్ ఆర్థికంగా దెబ్బతినడం ఖాయమని 45 శాతం మంది భావిస్తోండగా, లేదు.. లాభపడుతుందని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు.
శరణార్థుల వలసలు ఆగినట్లే!
ఈయూ సభ్యురాలిగా బ్రిటన్ మొన్నటివరకు.. సిరియా సహా ఇతర మధ్య ఆసియా దేశాల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించింది. బ్రెగ్జిట్ రెఫరెండంకు ప్రధాన కారణమైన శరణార్థి సంక్షోభం నుంచి బ్రిటన్ బయటపడుతుందని, యూకేకు వలసలు తగ్గుతాయని 49 శాతం మంది నమ్ముతున్నారు.