ముంబై: మార్చి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్ ముగింపు, స్థూల ఆర్థిక అంశాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల(ఎఫ్‌ఐఐ) నిర్ణయాలు ప్రధానంగా ఈవారంలో దేశీ స్టాక్ మార్కెట్ దిశను నిర్దేశించనున్నట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ‘ఆర్థిక సంవత్సరం ముగింపు నెల అయినందున రుణ మార్కెట్ల నుండి ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) తగ్గేందుకు అవకాశం ఉంది. ఇదే సమయంలో రిడెంప్షన్ ఒత్తిడికి ఆస్కారం ఉండడం వల్ల దేశీ సంస్థలు (డీఐఐ)లు కూడా భారీ స్థాయిలో అమ్మకాలకు పాల్పడే అవకాశం కనిపిస్తోంది.
ఈ తాజా పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో ఈవారంలో ఒడిదుడుకులకు ఆస్కారం ఉంది’ అని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. ‘కొంత దిద్దుబాటు జరిగిన తరువాత నిఫ్టీ కన్సాలిడేట్ అయ్యేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నాం. ప్రస్తుతం అంతర్జాతీయ సంకేతాలు కూడా పురోగతికి ప్రతిబంధకంగా మారాయి. మరోవైపు స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు లార్జ్‌క్యాప్ ఇండీసెస్‌ను అవుట్‌పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఎంపికచేసిన షేర్లలో మాత్రమే పెట్టుబడులు పెట్టడం మంచిదని సూచన’ అని ఎడిల్‌వీస్ వెల్త్ మేనేజ్‌మెంట్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ విశ్లేషించారు.
స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి..
ద్రవ్య లోటు, మౌలిక సదుపాయాల ఉత్పత్తి డేటా శుక్రవారం (29న) విడుదల కానుండగా.. విదేశీ రుణ గణాంకాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. ఇవి ఏమాత్రం ప్రతికూలంగా ఉన్నా నిఫ్టీ 11,380 వరకు వెళ్లే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. ఇక్కడ కీలక మద్దతు లభించకపోతే మరింత దిద్దుబాటుకు ఆస్కారం ఉందన్నారు. మార్కెట్ పెరిగితే 11,572 కీలక నిరోధంగా పనిచేయనుందని విశ్లేషించారు.
అమెరికా–చైనాలు బీజింగ్‌లో భేటీ: వాణిజ్య యుద్ధ అంశంపై అమెరికా–చైనాల మధ్య గురువారం బీజింగ్‌లో ఇరుదేశాల ఉన్నతస్థాయి అధికారుల మధ్య చర్చలు పునర్‌ప్రారంభంకానున్నాయి. ఇక్కడ నుంచి వెలువడే కీలక అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ఆలస్యం అవుతున్న ఈ అంశం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూలత చూపుతుందన్నారు. ఈసారి ఏమైనా పురోగతి ఉంటే మాత్రం సూచీలకు సానుకూలం అవుతుందన్నారాయన.
మరోవైపు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ మరింత జాప్యం కానుందని రాయిటర్స్ భావిస్తోంది. ఇప్పటికే పలుమార్లు పార్లమెంట్ తిరస్కరణకు గురైన బ్రెగ్జిట్ ఒప్పందంపై త్వరలోనే మరోసారి ఓటింగ్ ఉండే అవకాశాలున్నాయని అంచనా వేసింది. బ్రెగ్జిట్ అంశంపై కొత్త ప్రజాభిప్రాయ సేకరణను డిమాండ్ చేస్తూ శనివారం లండన్‌లో దాదాపు 10లక్షల మంది పౌరులు మార్చ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై సైతం ఇన్వెస్టర్లు దృష్టిసారించారు. ఇక బ్యాంక్ ఆఫ్ జపాన్ ఈనెల 14–15న జరిగిన పాలసీ మీటింగ్‌కు సంబంధించిన తన బోర్డ్ సభ్యుల అభిప్రాయ సారాంశాన్ని సోమవారం ప్రకటించనుంది.
రూపాయికి 68.30 వద్ద మద్దతు..
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ శుక్రవారం ఒక్కసారిగా 2 శాతం పతనమైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందనే ఆందోళనలు, తగ్గిన డిమాండ్ నేపథ్యంలో ముడిచమురు ధరలు దిగివచ్చి డాలరుతో రూపాయి మారకం విలువకు బలాన్నిచేకూర్చాయి. వరుసగా ఆరోవారంలోనూ బలపడిన రూపాయి.. గతవారంలో 15 పైసలు బలపడి 68.95 వద్ద ముగిసింది. రూపాయికి కీలక నిరోధం 69.50 వద్ద ఉండగా, సమీపకాల మద్దతు 68.30 వద్ద ఉందని ఐసీఐసీఐ డైరెక్ట్ విశ్లేషకులు అమిత్ గుప్తా అన్నారు.
విదేశీ నిధుల వెల్లువ..
విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం జోరుగా కొనసాగుతోంది. ఎఫ్‌ఐఐలు భారత స్టాక్ మార్కెట్లలో రెట్టించిన ఉత్సాహంతో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. మార్చి 1–22 కాలంలో వీరు ఏకంగా రూ.38,211 కోట్ల పెట్టుబడులను పెట్టారు. రూ.27,424 కోట్లను ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసిన వీరు.. రూ.10,787 కోట్లను డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. సాధారణ ఎన్నికల్లో సానుకూలత ఉండవచ్చనే ప్రధాన అంశం కారణంగా వీరి పెట్టుబడి గణనీయంగా పెరిగిందని వినోద్ నాయర్ అన్నారు. ఇక నుంచి నిధుల ప్రవాహం ఏవిధంగా ఉండనుంది.. రూపాయి కదలికల ఆధారంగా మార్కెట్ గమనం ఉండనుందని ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్, ఎండీ డీకే అగర్వాల్ విశ్లేషించారు.
Comments
Please login to add a commentAdd a comment