బ్రెగ్జిట్తో నష్టం తక్కువే..! | India will meet GDP growth forecast despite Brexit concerns: CEA Arvind Subramanian | Sakshi
Sakshi News home page

బ్రెగ్జిట్తో నష్టం తక్కువే..!

Published Thu, Jun 30 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

బ్రెగ్జిట్తో నష్టం తక్కువే..!

బ్రెగ్జిట్తో నష్టం తక్కువే..!

ఇతర దేశాలతో పోలిస్తే మనం మెరుగైన స్థితిలో ఉన్నాం
ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి
యూకేకు మరిన్ని వస్తు, సేవల అమ్మకాలకు అవకాశం
ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్

 సాక్షి, హైదరాబాద్: యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలన్న బ్రిటన్ నిర్ణయంతో భారత్‌కు జరిగే నష్టం తక్కువేనని భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే బ్రెగ్జిట్ ఒక చారిత్రాత్మక ఘట్టమని  ఆయన బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పదవ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. సి.ఆర్.రావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమ్యాటిక్స్, స్టాటస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో అరవింద్ సుబ్రమణియన్ కీలకోపన్యాసం చేస్తూ భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లతోపాటు అనేక అంశాలపై విసృ్తతంగా మాట్లాడారు.

బ్రెగ్జిట్ తదనంతరం రెండు రోజుల పాటు తాము అంతర్జాతీయ ఆర్థిక రంగాన్ని, కరెన్సీ ఒడిదుడుకులను నిశితంగా పరిశీలించిన తరువాత మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ సురక్షిత స్థానంలో ఉందన్న అంచనాకు వచ్చామని అన్నారు. కాకపోతే బ్రెగ్జిట్ కారణంగా ప్రపంచ ఆర్థిక రంగం కొంచెం నెమ్మదించవచ్చునని చెప్పారు. మౌలికాంశాల పునాదులు దృఢంగా ఉన్నందున భారత్‌కు నష్టం తక్కువేనని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రెగ్జిట్ కారణంగా భారత్ యునెటైడ్ కింగ్‌డమ్‌కు మరిన్ని వస్తు, సేవల అమ్మకాలు జరిపే అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు.

 కొత్త అంకెలపై అనుమానాలొద్దు..
స్థూల జాతీయోత్పత్తితోపాటు ఆర్థిక రంగానికి సంబంధించిన కొత్త ప్రమాణాలపై ఎవరూ అనుమానాలు పెట్టుకోనవసరం లేదని, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థలు, నిపుణులు ఈ కొత్త గణాంకాలను తయారు చేశారని ఆయన అన్నారు. జీడీపీ వంటి అంశాల్లో రాజకీయ పార్టీలు, నేతల ప్రమేయం ఉందన్నది అహేతుకమైందని స్పష్టం చేశారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆర్థిక శాఖకు సమాచార లభ్యత ఎంతో పెరగిందని, దాదాపు 6 లక్షల కంపెనీల వివరాలను తాము సేకరించగలుగుతున్నామన్నారు.

 1 శాతం లోపునకు క్యాడ్...
కనిష్ట చమురు ధరల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు (క్యాడ్) 1 శాతంలోపునకు దిగివస్తుందని సుబ్రమణియన్ చెప్పారు. విదేశీ కరెన్సీ రాక, పోక మధ్య వ్యత్యాసాన్నే క్యాడ్‌గా వ్యవహరిస్తారు. బంగారం ధర పెరుగుతున్నప్పటికీ, ఇది క్యాడ్‌పై ప్రభావం చూపదని, చమురు దిగుమతి బిల్లుతో పోలిస్తే బంగారం దిగుమతి బిల్లు సగానికంటే తగ్గిపోయినందున నికరంగా క్యాడ్ సానుకూలంగానే వుంటుందని ఆయన వివరించారు. బ్యాంకుల మొండి బకాయిల్ని ఆయన ప్రస్తావిస్తూ చైనాలో బ్యాంకులు కార్పొరేట్లకు ఇచ్చిన రుణాలు జీడీపీలో 165 శాతం వున్నాయని, ఇదే ఇండియాలో 35 శాతమేనని చెప్పారు. ఈ సమస్య పరిష్కరించుకోలేనంత సవాలేమీ కాదన్నారు. మొండి బకాయిల సమస్య టైమ్‌బాంబ్‌లా మారకుండా రిజర్వుబ్యాంక్, ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు.  పన్నుల సేకరణ విషయంలో మనం పాశ్చాత్యదేశాలతో పోలిస్తే చాలా దిగువన ఉన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు.

జీఎస్‌టీతో పేద రాష్ట్రాలకు మేలు...
వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమల్లోకి వస్తే దేశంలోని ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ వంటి పేద రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని సుబ్రమణియన్ తెలిపారు. మేకిన్ ఇండియా కావాలంటే... దేశం మొత్తాన్ని ఒకటిగా (పన్నుల విషయంలో) చేయాలని, జీఎస్‌టీ ఇందుకు ఉపయోగపడుతుం దన్నారు. అంతేకాకుండా జీఎస్‌టీతో పన్నులు ఎగ్గొట్టే వారు తగ్గుతారని, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను పొందేందుకైనా వర్తకులు తాము కొనుగోలు చేసే ముడివస్తువులకు తగిన రసీదులు పొందుతారన్నది దీంట్లోని తర్కమని వివరించారు. కార్యక్రమంలో సి.ఆర్.రావు ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్, నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.సారస్వత్, కాగ్నిజెంట్ ఐటీ కన్సల్టింగ్ సంస్థ వైస్ ఛైర్మన్ లక్ష్మీ నారాయణన్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి.అప్పారావు, వాక్సెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.ఆర్.రావు తదితరులు పాల్గొన్నారు. పదవ జాతీయ గణాంక దినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాటస్టిక్స్ ఒలింపియాడ్ విజేతలను కూడా ఈ సమావేశంలో ప్రకటించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement