బ్రిటన్‌లో పెరుగుతున్న జాతి విద్వేష దాడులు
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకోవాలనే బ్రెగ్జిట్ కు అనుకూలంగా పౌరులు తీర్పు ఇచ్చిన తర్వాత బ్రిటన్‌లో జాతి విద్వేష దాడులు పెచ్చరిల్లుతున్నాయి. ఒక్క యూరోపియన్లకు వ్యతిరేకంగానే కాదు, భారతీయులకు వ్యతిరేకంగా కూడా దాడులు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఇంతవరకు నాలుగైదు కేసులే దాఖలైనప్పటికీ ఈ వారం రోజుల్లో వందకుపైగా జాతి విద్వేష దాడులు జరిగినట్లు సోషల్ మీడియా ద్వారా స్పష్టమవుతోంది.
ఈ దాడులు ప్రస్తుతానికి ఎక్కువ వరకు జాతివిద్వేష వ్యాఖ్యలకే పరిమితమవుతున్నాయని, అవి భౌతిక దాడులకు దారితీస్తే బ్రిటన్‌లో కొనసాగడం కష్టమని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమపై దాడులు జరుగుతాయన్న భయంతో లండన్ పౌరసత్వం కలిగి అక్కడే స్థిరపడిన విదేశీయులు తమ పాస్‌పోర్టులను ఎక్కడికెళ్లినా బహిరంగంగా బాటసారులకు చూపిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఇది, దేశానికి నిజంగా సిగ్గు చేటని, ఇక ఇలాంటి దాడులు ఏమాత్రం సహించమని, దోషుల పట్ల కఠినంగా వ్వవహరిస్తామని ప్రధాన మంత్రి డేవిడ్ కేమరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతున్న నిఖిల్ పాండే అనే భారతీయ విద్యార్థి ఇటీవల ఎయిర్‌పోర్టులో జాతి విద్వేష వ్యాఖ్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘ఓ వ్యక్తి నన్ను ఎయిర్ పోర్టులో ఏ దేశం నుంచి వచ్చావని అడిగారు. నేను భారత్ నుంచి వచ్చానని చెప్పాను. వెంటనే నా పాస్‌పోర్టు గుంజుకున్నారు. బ్రిటన్‌లో నా నివాసం ధ్రువపత్రాన్ని కూడా లాక్కున్నాడు.
పాస్‌పోర్టుపై నేను రెండేళ్ల క్రితం తీసుకున్న ఫొటో ఉంది. ఆ ఫొటోలో నాకు గడ్డం ఉంది. దాన్ని చూసి ఆయన నన్ను టైస్టులాగా ఉన్నావంటూ వ్యాఖ్యానించాడు. ఇలాంటి అవమానం నాకు బ్రిటన్‌లో ఎప్పుడూ జరగలేదు. నేను రెండేళ్ల నుంచి బ్రిటన్‌లో ఉంటున్నా నేనెప్పుడూ ఈ దేశం జాతి విద్వేష దేశమని ఎప్పుడూ భావించలేదు’ అని పాంగే తనకు జరిగిన అవమానాన్ని మీడియాకు వివరించారు. ఇలాంటి సంఘటనలపై తక్షణమే దర్యాప్తు జరపాలని లండన్ మేయర్ పాదిక్ ఖాన్ పోలీసులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనల గురించి పౌరులు కూడా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.