బ్రెగ్జిట్‌కు కొత్త డీల్‌ | EU announces Brexit deal has been agreed with Boris Johnson | Sakshi
Sakshi News home page

బ్రెగ్జిట్‌కు కొత్త డీల్‌

Published Fri, Oct 18 2019 3:02 AM | Last Updated on Fri, Oct 18 2019 4:46 AM

EU announces Brexit deal has been agreed with Boris Johnson - Sakshi

లండన్‌: యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) నుంచి బ్రిటన్‌ విడిపోవడానికి (బ్రెగ్జిట్‌) ఉద్దేశించిన నూతన ఒప్పందంపై ఒక అంగీకారానికి వచ్చినట్లు బ్రిటన్, ఈయూ గురువారం ప్రకటించాయి. ఈ కొత్త ఒప్పందం అద్భుతంగా ఉన్నట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్, ఈయూ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జంకర్‌ పేర్కొన్నారు. ఇది న్యాయంగా, సమతూకంతో ఉందన్న జంకర్‌.. దీన్ని ఆమోదించాల్సిందిగా ఈయూ సభ్య దేశాలను అభ్యర్థించారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ప్రస్తుతం ఈయూ సభ్యదేశాల సదస్సు జరుగుతోంది.

బ్రెగ్జిట్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకిదే సరైన సమయమని యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్‌కు జంకర్‌ ఒక లేఖ రాశారు. బ్రెగ్జిట్‌ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ  ఒప్పందం కూడా శనివారం బ్రిటన్‌ పార్లమెంటు ముందు వస్తుంది. బోరిస్‌ జాన్సన్‌కు చెందిన కన్సర్వేటివ్‌ పార్టీ ప్రభుత్వానికి హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌లో  మద్దతిస్తున్న డెమొక్రాటిక్‌ యూనియనిస్ట్‌ పార్టీ (డీయూపీ) ఇటీవలే బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పింది. 2017 ఎన్నికల్లో కన్సర్వేటివ్‌ పార్టీకి మెజారిటీ వచ్చినప్పటికీ.. కొందరు ఎంపీల రాజీనామా, దాదపు 20 ఎంపీల బహిష్కరణ నేపథ్యంలో ఆ పార్టీకి మెజారిటీ తగ్గి, ప్రస్తుతం డీయూపీ మద్దతుపై ఆధారపడింది.

ఇదీ ఒప్పందం...
ప్రస్తుత ఒప్పందం.. గతంలో బ్రిటన్‌ మాజీ ప్రధాని థెరెసా మే హయాంలో రూపొందించిన ఒప్పందం దాదాపు ఒకలాగే ఉన్నాయి. అయితే, బ్రెగ్జిట్‌ తరవాత కూడా కొన్ని విషయాల్లో ఈయూ నిబంధనలు కొనసాగుతాయన్న మునుపటి నిబంధన తాజా ఒప్పందలో లేదు.

తాజా ఒప్పందం ఇదీ...
బ్రెగ్జిట్‌ తరవాత ఐర్లాండ్‌కు, యూకేలో భాగంగా ఉండే ఉత్తర ఐర్లాండ్‌కు మధ్య మరీ కఠినతరమైన సరిహద్దు ఉండకూడదని అన్ని పక్షాలూ భావిస్తున్నాయి. తాజా ఒప్పందాన్ని కూడా దీన్ని పరిష్కరించటంలో భాగంగానే తీసుకొచ్చారు.

► యూరోపియన్‌ కస్టమ్స్‌ యూనియన్‌ నుంచి యూకే పూర్తిగా బయటకు వెళ్లిపోతుంది. దీంతో భవిష్యత్తులో ఇతర దేశాలతో యూకే స్వతంత్రంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోగలుగుతుంది.  

► ఐర్లాండ్‌కు– ఉత్తర ఐర్లాండ్‌కు మధ్య చట్టబద్ధమైన కస్టమ్స్‌ సరిహద్దు ఉంటుంది. కానీ ఆచరణలో అది ఐర్లాండ్‌– యూకే సరిహద్దుగా ఉంటుంది. ఉత్తర ఐర్లాండ్‌లోకి ప్రవేశించే చోట సరుకుల తనిఖీలుంటాయి.  

► బ్రిటన్‌ నుంచి ఉత్తర ఐర్లాండ్‌కు వచ్చే సరుకులపై ఆటోమేటిగ్గా సుంకాలు చెల్లించటమనేది ఉండదు. కానీ ఈయూలో భాగమైన ఐర్లాండ్‌కు వచ్చే సరుకుల్ని గనక ఇబ్బందికరమైనవిగా పరిగణిస్తే... వాటిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  

► అయితే ఈ ‘ఇబ్బందికరమైన’ సరుకులు ఏంటనేది యూకే– ఈయూ ప్రతినిధుల ఉమ్మడి కమిటీ ఒకటి నిర్ణయిస్తుంది.  

► ఈ సరిహద్దుల మధ్య వ్యక్తులు పంపించుకునే సరుకులపై పన్నులు విధించకపోవటం... ఉత్తర ఐర్లాండ్‌ రైతులకివ్వాల్సిన సాయం... సరుకుల నియంత్రణకు సంబంధించి ఈయూ సింగిల్‌ మార్కెట్‌ నిబంధనల్ని ఉత్తర ఐర్లాండ్‌ పాటించటం...  సరిహద్దులో యూకే అధికారులతో పాటు ఈయూ అధికారులూ ఉండటం... సేవలకు మినహాయించి సరుకులకు మాత్రం ఉత్తర ఐర్లాండ్‌లో ఈయూ చట్టాలే అమలుకావటం... ఈయూలోని యూకే పౌరులు– యూకేలోని ఈయూ పౌరులు ఇకపైనా తమ నివాస, సోషల్‌ సెక్యూరిటీ హక్కుల్ని యథాతథంగా పొందగలగటం... ఇలాంటివన్నీ తాజా ఒప్పందంలో ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement