deal finalized
-
రిలయన్స్, వాల్ట్ డిస్నీ డీల్‌కు ఆమోదం.. షరతులివే..
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీల మీడియా అసెట్స్ విలీన ప్రతిపాదనకు దాదాపు రెండు నెలల తర్వాత కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం కొన్ని షరతులు విధిస్తూ మంగళవారం 48 పేజీల ఉత్తర్వులను జారీ చేసింది.సీసీఐ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇరు సంస్థలు ఏడు టీవీ చానళ్లను విక్రయించాలి. వీటిలో స్టార్ జల్సా మూవీస్, కలర్స్ మరాఠీ, హంగామా మొదలైనవి ఉన్నాయి. అలాగే క్రికెట్ ఈవెంట్ల ప్రసారాల అడ్వర్టైజ్మెంట్ స్లాట్లకు సంబంధించి బండిల్డ్ విధానంలో వసూలు చేయకూడదు. ఐపీఎల్, ఐసీసీ, బీసీసీఐ వంటి కీలక క్రికెట్ మ్యాచ్‌ల ఫీడ్‌ను ప్రసార భారతితో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, ఇరు సంస్థల ఓటీటీ ప్లాట్‌ఫాంలు (స్టార్‌కి చెందిన డిస్నీప్లస్‌హాట్‌స్టార్, రిలయన్స్‌లో భాగమైన వయాకామ్18కి చెందిన జియోసినిమా) వేర్వేరుగా కొనసాగుతాయి.ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా.. -
వైజాగ్ స్టీల్‌కు జేఎస్పీఎల్ నిధులు
విశాఖపట్టణం: ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్ ప్లాంట్) తాజాగా ప్రయివేట్ రంగ కంపెనీ జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్)తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం రూ. 900 కోట్లు సమకూర్చుకునేందుకు చేతులు కలిపింది. ఈ నిధులతో అమ్మకాల ఆదాయం, నెలవారీ టర్నోవర్ పెంచుకోవడంతోపాటు.. నష్టాలను తగ్గించుకోవాలని ప్రణాళికలు వేసింది. సమయానుగుణ డీల్ కారణంగా ముడిసరుకులను సమకూర్చుకోవడం, నిర్ధారిత గడువు(డిసెంబర్ 30)లోగా నిలకడైన బ్లాస్ట్ ఫర్నేస్(బీఎఫ్)–3 కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలు కలగనుంది. తద్వారా నెలకు 2 లక్షల టన్నుల హాట్ మెటల్ సామర్థ్యానికి తెరతీయనుంది. రూ. 800–900 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్, బీఎఫ్–3 నిర్వహణకు అవసరమైన ముడిసరుకుల అందజేతకు జేఎస్పీఎల్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వైజాగ్ స్టీల్ వెల్లడించింది. దీనిలో భాగంగా స్టీల్ మెలి్టంగ్ షాప్–2 నుంచి ప్రతీ నెలా 90,000 టన్నుల క్యాస్ట్ బ్లూమ్స్‌ను జేఎస్‌పీఎల్‌కు సరఫరా చేయనున్నట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చైర్మన్, ఎండీ అతుల్ భట్ పేర్కొన్నారు. అంతేకాకుండా లక్ష టన్నుల అదనపు అమ్మకాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు జేఎస్పీఎల్తో అంగీకారానికి వచ్చినట్లు ట్రేడ్ యూనియన్లతో సమావేశం సందర్భంగా భట్ వెల్లడించారు. ఈ ప్రభావంతో నెలకు రూ. 500 కోట్లమేర అమ్మకాల టర్నోవర్‌ను సాధించనున్నట్లు తెలియజేశారు. ఇది నెలకు రూ. 100 కోట్లు చొప్పున నష్టాలకు చెక్ పడే వీలున్నట్లు వివరించారు. ఈ డీల్ నేపథ్యంలో ఉత్పత్తి పెంపునకు సహకరించాలని, ఇదే విధంగా వృద్ధి, లాభదాయకతలను నిలుపుకునేందుకు దోహదం చేయాలని ట్రేడ్ యూనియన్లకు భట్ విజ్ఞప్తి చేశారు. యూనియన్లు లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిలకడకు, లాభదాయకతకు అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు హామీనిచ్చారు. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు బీఎఫ్–3 నిర్వహణ వ్యూహాత్మక కార్యాచరణగా పేర్కొన్నారు. ఇది స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు దోహదం చేయనున్నట్లు అభిప్రాయపడ్డారు. -
ఈరిస్కు.. రెడ్డీస్ డెర్మటాలజీ బ్రాండ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగంలో ఉన్న ఈరిస్ లైఫ్‌సైన్సెస్ తాజాగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నుంచి తొమ్మిది రకాల డెర్మటాలజీ బ్రాండ్స్‌ను దక్కించుకుంది. డీల్ విలువ రూ.275 కోట్లు. చర్మ వ్యాధుల సంబంధ ఔషధ రంగంలో డీల్ తదనంతరం ఈరిస్ 7 శాతం వాటాతో మార్కె ట్లో మూడవ స్థానానికి ఎగబాకనుంది. 2022 మే నెలలో రూ.650 కోట్లతో ఓక్నెట్ హెల్త్‌కేర్‌ను చేజిక్కించుకోవడం ద్వారా డెర్మటాలజీ విభాగంలోకి ఈరిస్ ప్రవేశించింది. 2023 జనవరిలో గ్లెన్‌మార్క్ నుంచి తొమ్మిది డెర్మటాలజీ బ్రాండ్స్‌ను రూ.340 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. చర్మ వ్యాధుల సంబంధ ఔషధ విభాగాన్ని పటిష్టం చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొనుగోళ్లకు రూ.1,265 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. -
డిస్నీ–స్టార్‌తో సీఏ ఒప్పందం
మెల్బోర్న్: భారత ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ ‘డిస్నీ–స్టార్’తో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సుదీర్ఘ ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే క్రికెట్ మ్యాచ్‌ల్ని భారత్‌లో ఏడేళ్లపాటు ప్రసారం చేసే ఒప్పందాన్ని డిస్నీ స్టార్‌తో కుదుర్చుకుంది. వచ్చే సీజన్ (2023–24) నుంచి ఒప్పందంలో భాగంగా ఆసీస్‌లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్), మహిళల బీబీఎల్ టోర్నమెంట్లను భారత్‌లో డిస్నీ–స్టార్ నెట్వర్క్ ప్రసారం చేస్తుంది. ప్రస్తుతం సోనీ నెట్వర్క్ వద్ద సీఏ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులున్నాయి. 2017–18 సీజన్ నుంచి సోనీ చానెళ్లు ఆస్ట్రేలియా మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్నాయి. క్రికెట్ క్రేజ్ ఉన్న భారత్‌లో తమ మ్యాచ్‌ల ఆదరణ మరింత పెరిగేందుకు స్టార్ నెట్‌వర్క్‌తో ఒప్పందం దోహదం చేస్తుందని సీఏ సీఈఓ నిక్ హాక్లీ తెలిపారు. -
విద్యుత్ రంగంలో అదానీ! ట్రాన్స్మిషన్ లైన్ల కోసం వేలకోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ దిగ్గజాలు అదానీ ట్రాన్స్మిషన్, ఎస్సార్ పవర్ లిమిటెడ్ మధ్య తాజాగా రూ. 1,913 కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. డీల్‌లో భాగంగా ఎస్సార్ పవర్‌కు చెందిన విద్యుత్ ప్రసార లైన్లను అదానీ ట్రాన్స్మిషన్ కొనుగోలు చేయనుంది. దేశీ కార్పొరేట్ చరిత్రలోనే భారీ రుణ భారాన్ని తగ్గించుకుంటున్న ఎస్సార్ ఈ వ్యూహంలో భాగంగానే తాజా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గత మూడేళ్లలో కంపెనీ రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ. 1.8 లక్షల కోట్లకుపైగా చెల్లించింది. కాగా.. రెండు ట్రాన్స్మిషన్ లైన్ అనుబంధ సంస్థలలో ఒక కంపెనీని అదానీ ట్రాన్స్మిషన్కు విక్రయించేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఎస్సార్ పవర్ వెల్లడించింది. మహన్ నుంచి సైపట్ పూలింగ్ సబ్‌స్టేషన్ వరకూ 465 కిలోమీటర్లమేర మూడు రాష్ట్రాలలో విస్తరించిన ఎస్సార్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీని అదానీ ట్రాన్స్మిషన్కు బదిలీ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో అదానీ పవర్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం పతనమై రూ. 285 వద్ద ముగిసింది. -
భారత్‌లో 7–లెవెన్ స్టోర్స్
న్యూఢిల్లీ: దేశీ రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్ తన సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన 7–లెవెన్ కనీ్వనియెన్స్ స్టోర్స్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెడుతోంది. ఇందుకు సంబంధించి 7–లెవెన్ (ఎస్ఈఐ)తో తమ అనుబంధ సంస్థ 7–ఇండియా కన్వీనియన్స్ రిటైల్ సంస్థ మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను వెల్లడించలేదు. మొదటి స్టోర్‌ను అక్టోబర్ 9న ముంబైలో ప్రారంభించనున్నట్లు ఆర్ఆర్వీఎల్ వివరించింది. ఆ తర్వాత వేగంగా మిగతా ప్రాంతాల్లో కూడా విస్తరించనున్నట్లు పేర్కొంది. ‘మా కస్టమర్లకు అత్యుత్తమమైనవి అందించాలన్నది మా లక్ష్యం. అందులో భాగంగా 7–లెవెన్‌ను ప్రవేశపెడుతుండటం మాకు గర్వకారణం. అంతర్జాతీయంగా అత్యుత్తమ బ్రాండ్లలో ఇది ఒకటి‘ అని సంస్థ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు. ‘భారత్ .. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశం. అలాగే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచంలోనే అతి పెద్ద కనీ్వనియెన్స్ రిటైలర్ సంస్థల్లో ఒకటైన మా కంపెనీ .. భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి ఇది సరైన సమయం‘ అని 7–లెవెన్ ప్రెసిడెంట్ జో డిపింటో తెలిపారు. స్నాక్స్, శీతల పానీయాలు, నిత్యావసరాలు మొదలైన ఉత్పత్తులు కొనుగోలు చేసే కస్టమర్లకు విశిష్టమైన షాపింగ్ అనుభూతిని అందించడం తమ స్టోర్స్ లక్ష్యమని పేర్కొన్నారు. 18 దేశాల్లో 77,000 స్టోర్స్ .. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం కేంద్రంగా పనిచేస్తున్న ఎస్ఈఐకి 18 దేశాలు.. ప్రాంతాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. స్వీయ నిర్వహణను, ఫ్రాంచైజీ/లైసెన్సుల రూపంలోను కలిపి 77,000 పైచిలుకు స్టోర్స్ ఉన్నాయి. ఉత్తర అమెరికాలోనే ఏకంగా 16,000 పైగా స్టోర్స్ నిర్వహిస్తోంది. 7–లెవెన్ స్టోర్స్‌తో పాటు స్పీడ్వే, స్ట్రైప్స్, లారెడో, టాకో కంపెనీ, రైజ్ ది రూస్ట్ వంటి ఫ్రాంచైజీలను కూడా ఎస్ఈఐ నిర్వహిస్తోంది. వాస్తవానికి 7–లెవెన్ స్టోర్స్‌ను దేశీ సూపర్‌మార్కెట్ దిగ్గజం ఫ్యూచర్ రిటైల్ .. భారత్‌లో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇందుకోసం 2019 ఫిబ్రవరిలో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. కానీ ఫ్యూచర్ రిటైల్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ఇరు సంస్థలు పరస్పర అంగీకారంతో ఒప్పందం రద్దు చేసుకున్నాయి. ఫ్యూచర్ గ్రూప్ తమ రిటైల్ వ్యాపారాన్ని రిలయన్స్‌కే విక్రయించేందుకు ప్రయతి్నస్తోంది. కానీ ఫ్యూచర్లో వాటాలు ఉన్న ఈ–కామర్స్ దిగ్గజం దీన్ని వ్యతిరేకిస్తుండటంతో డీల్ ముందుకు సాగడం లేదు. ఈ తరుణంలో 7–లెవెన్‌తో రిలయన్స్ రిటైల్ ఒప్పందం కుదుర్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్‌ఆర్‌వీఎల్‌కు దేశవ్యాప్తంగా ఇప్పటికే 13,000 పైగా స్టోర్స్ ఉన్నాయి. 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 1,57,629 కోట్ల టర్నోవరు (కన్సాలిడేటెడ్) నమోదు చేసింది. -
న్యుయాన్స్.. మైక్రోసాఫ్ట్ సొంతం
న్యూయార్క్: ఇటీవల ఇతర కంపెనీలను సొంతం చేసుకోవడం ద్వారా వేగవంత వృద్ధి సాధిస్తున్న గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా మరో భారీ డీల్‌కు తెరతీసింది. నాస్డాక్ లిస్టెడ్ స్పీచ్ రికగ్నిషన్ కంపెనీ న్యుయాన్స్ కమ్యూనికేషన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డీల్ విలువ 16 బిలియన్ డాలర్లు(రూ. 1,20,000 కోట్లు)కాగా.. ఒక్కో షేరుకీ 56 డాలర్ల చొప్పున చెల్లించనుంది. శుక్రవారం ముగింపు ధర 45.58 డాలర్లతో పోలిస్తే ఇది 23 శాతం ప్రీమియంకాగా.. తాజా వార్తలతో సోమవారం(12) ట్రేడింగ్‌లో న్యుయాన్స్ షేరు ప్రారంభంలోనే 16.6 శాతం జంప్‌చేసింది. 53.16 డాలర్లకు చేరింది. ఇక మైక్రోసాఫ్ట్ షేరు దాదాపు యథాతథంగా 256 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. లింక్డ్ఇన్ తర్వాత భారీ డీల్... రుణాలతో కలిపి న్యుయాన్స్ కమ్యూనికేషన్స్ విలువను 19.7 బిలియన్ డాలర్లుగా మైక్రోసాఫ్ట్ మదిం పు చేసింది. వెరసి ఐదేళ్ల తదుపరి భారీ డీల్‌ను కుదుర్చుకుంది. ఇంతక్రితం 2016లో లింక్డ్ఇన్ను 26 బిలియన్ డాలర్లకు మైక్రోసాఫ్ట్ కొనుగోలు చే సింది. ఈ బాటలో గతేడాది సెప్టెంబర్‌లో వీడియో గేమ్ తయారీ సంస్థ జెనీమ్యాక్స్ను 7.5 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 2019 నుంచీ... న్యుయాన్స్తో 2019లోనే మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. న్యుయాన్స్ కొనుగోలు ద్వారా హెల్త్‌కేర్ పరిశ్రమలో అందిస్తున్న సేవలు రెట్టింపు కానున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. న్యుయాన్స్ సీఈవోగా మార్క్ బెంజమిన్ కొనసాగనున్నట్లు తెలియజేసింది. గతేడాదిలో ప్రవేశపెట్టిన హెల్త్‌కేర్ క్లౌడ్ ప్రొడక్టులకు న్యుయాన్స్ సాంకేతికతను వినియోగించుకోనున్నట్లు వెల్లడించింది. -
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అనుబంధ సంస్థ విక్రయం
ముంబై: వ్యర్థాల నిర్వహణ(వేస్ట్ మేనేజ్మెంట్) అనుబంధ సంస్థను విక్రయించినట్లు దివాళాకు చేరిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తాజాగా వెల్లడించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్(ఐఈఐఎస్ఎల్)గా పిలిచే ఈ కంపెనీలో పూర్తి వాటాను పీఈ దిగ్గజం ఎవర్‌స్టోన్ గ్రూప్‌నకు అమ్మినట్లు పేర్కొంది. అనుబంధ సంస్థ ఎవర్‌ఎన్విరో రిసోర్స్ మేనేజ్మెంట్ ద్వారా వేస్ట్ మేనేజ్మెంట్ విభాగాన్ని ఎవర్‌స్టోన్ కొనుగోలు చేసినట్లు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తెలియజేసింది. డీల్ విలువను వెల్లడించనప్పటికీ ఈ విక్రయం ద్వారా రూ. 1,200 కోట్లమేర రుణభారాన్ని తగ్గించుకోను న్నట్లు తెలుస్తోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌పై దివాళా చట్టంలో భాగంగా ఎన్సీఎల్టీ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఐఈఐఎస్ఎల్ సమీకృత వేస్ట్‌మేనేజ్‌మెంట్ కంపెనీగా సేవలందిస్తోంది. ప్రధానంగా మునిసిపల్ వ్యర్థాలకు సంబంధించి నిర్మాణం, తొలగించడం, కలెక్షన్, రవాణా, ఇంధన తయారీ తదితర పలు విభాగాలలో సర్వీసులను సమకూర్చుతోంది. ప్రస్తుతం రోజుకి 8,400 టన్నుల వ్యర్థాల నిర్వహణను చేపడుతోంది. -
ఇన్ఫోసిస్‌కు వ్యాన్‌గార్డ్.. భారీ డీల్!
దేశీ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్.. యూఎస్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం వ్యాన్‌గార్డ్ నుంచి భారీ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు తెలుస్తోంది. డీల్ విలువ 1.5 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,500 కోట్లు)గా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పదేళ్ల కాలంవరకూ సర్వీసులను పొడిగించే వీలున్నట్లు తెలియజేశాయి. తద్వారా 2 బిలియన్ డాలర్లకు కాంట్రాక్ట్ విలువ చేరనున్నట్లు వెల్లడించాయి. ఇన్ఫోసిస్ ఇటీవలే క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలను విడుదల చేసింది. క్యూ1లో 1.7 బిలియన్ డాలర్ల డీల్స్‌ను కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. అయితే వ్యాన్‌గార్డ్ డీల్ వీటిలో లేదని విశ్లేషకులు తెలియజేశారు. పోటీ అధికమే వ్యాన్గార్డ్తో కుదుర్చుకున్న డీల్ ఇన్ఫోసిస్ చరిత్రలో అతిపెద్ద కాంట్రాక్టుగా నిపుణులు భావిస్తున్నారు. తొలుత బిలియన్ డాలర్లుగా అంచనా వేసినట్లు తెలియజేశారు. గత వారం షేరు దూకుడుకు ఈ డీల్‌పై అంచనాలు కొంత కారణమైనట్లు చెబుతున్నారు. అయితే కంపెనీ ఈ అంశంపై స్పందించకపోవడం గమనార్హం! కాగా.. వ్యాన్‌గార్డ్ డీల్ కోసం ఐటీ దిగ్గజాలు టీసీఎస్, యాక్సెంచర్, విప్రోలతో ఇన్ఫోసిస్ పోటీపడినట్లు తెలుస్తోంది. డీల్‌లో భాగంగా బీపీఎం సర్వీసులతోపాటు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సేవలను ఇన్ఫోసిస్ అందించనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాన్‌గార్డ్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్వహించే రికార్డ్ కీపింగ్ సర్వీసులకు మద్దతివ్వనున్నట్లు వివరించారు. ఎలక్ట్రానిక్ సిటీలో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో 3,000 మందితో పనిచేయగల యూనిట్‌ను వ్యాన్‌గార్డ్ డీల్ కోసం ఇన్ఫోసిస్ ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తొలుత 300-400 మంది సిబ్బందితో సేవలు ప్రారంభించి తదుపరి దశలో డీల్‌కు అనుగుణంగా పెంచే యోచనలో ఉన్నట్లు తెలియజేశాయి. కాగా.. వివిధ ఫండ్స్ ద్వారా ఇన్ఫోసిస్‌లో 3 శాతం వాటాను వ్యాన్‌గార్డ్ కలిగి ఉంది. రిటైర్మెంట్ సర్వీసుల విభాగంలో ఇన్ఫోసిస్‌కు మంచి పట్టున్నదని, యూఎస్‌లో ఇలాంటి టాప్ -20 కంపెనీలలో సగంవరకూ సేవలను అందిస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్ షేరు 2 శాతం ఎగసి రూ. 920 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 924ను అధిగమించింది. గత గురువారం రూ. 955ను అధిగమించడం ద్వారా ఇన్ఫోసిస్ షేరు 52 వారాల గరిష్టానికి చేరిన విషయం విదితమే. -
బ్రెగ్జిట్‌కు కొత్త డీల్
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోవడానికి (బ్రెగ్జిట్) ఉద్దేశించిన నూతన ఒప్పందంపై ఒక అంగీకారానికి వచ్చినట్లు బ్రిటన్, ఈయూ గురువారం ప్రకటించాయి. ఈ కొత్త ఒప్పందం అద్భుతంగా ఉన్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఈయూ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్ పేర్కొన్నారు. ఇది న్యాయంగా, సమతూకంతో ఉందన్న జంకర్.. దీన్ని ఆమోదించాల్సిందిగా ఈయూ సభ్య దేశాలను అభ్యర్థించారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ప్రస్తుతం ఈయూ సభ్యదేశాల సదస్సు జరుగుతోంది. బ్రెగ్జిట్ ప్రక్రియ సజావుగా సాగేందుకిదే సరైన సమయమని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్‌కు జంకర్ ఒక లేఖ రాశారు. బ్రెగ్జిట్ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ ఒప్పందం కూడా శనివారం బ్రిటన్ పార్లమెంటు ముందు వస్తుంది. బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్సర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి హౌజ్ ఆఫ్ కామన్స్‌లో మద్దతిస్తున్న డెమొక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ) ఇటీవలే బోరిస్ జాన్సన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పింది. 2017 ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీకి మెజారిటీ వచ్చినప్పటికీ.. కొందరు ఎంపీల రాజీనామా, దాదపు 20 ఎంపీల బహిష్కరణ నేపథ్యంలో ఆ పార్టీకి మెజారిటీ తగ్గి, ప్రస్తుతం డీయూపీ మద్దతుపై ఆధారపడింది. ఇదీ ఒప్పందం... ప్రస్తుత ఒప్పందం.. గతంలో బ్రిటన్ మాజీ ప్రధాని థెరెసా మే హయాంలో రూపొందించిన ఒప్పందం దాదాపు ఒకలాగే ఉన్నాయి. అయితే, బ్రెగ్జిట్ తరవాత కూడా కొన్ని విషయాల్లో ఈయూ నిబంధనలు కొనసాగుతాయన్న మునుపటి నిబంధన తాజా ఒప్పందలో లేదు. తాజా ఒప్పందం ఇదీ... బ్రెగ్జిట్ తరవాత ఐర్లాండ్‌కు, యూకేలో భాగంగా ఉండే ఉత్తర ఐర్లాండ్‌కు మధ్య మరీ కఠినతరమైన సరిహద్దు ఉండకూడదని అన్ని పక్షాలూ భావిస్తున్నాయి. తాజా ఒప్పందాన్ని కూడా దీన్ని పరిష్కరించటంలో భాగంగానే తీసుకొచ్చారు. ► యూరోపియన్ కస్టమ్స్ యూనియన్ నుంచి యూకే పూర్తిగా బయటకు వెళ్లిపోతుంది. దీంతో భవిష్యత్తులో ఇతర దేశాలతో యూకే స్వతంత్రంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోగలుగుతుంది. ► ఐర్లాండ్‌కు– ఉత్తర ఐర్లాండ్‌కు మధ్య చట్టబద్ధమైన కస్టమ్స్ సరిహద్దు ఉంటుంది. కానీ ఆచరణలో అది ఐర్లాండ్– యూకే సరిహద్దుగా ఉంటుంది. ఉత్తర ఐర్లాండ్‌లోకి ప్రవేశించే చోట సరుకుల తనిఖీలుంటాయి. ► బ్రిటన్ నుంచి ఉత్తర ఐర్లాండ్‌కు వచ్చే సరుకులపై ఆటోమేటిగ్గా సుంకాలు చెల్లించటమనేది ఉండదు. కానీ ఈయూలో భాగమైన ఐర్లాండ్‌కు వచ్చే సరుకుల్ని గనక ఇబ్బందికరమైనవిగా పరిగణిస్తే... వాటిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ► అయితే ఈ ‘ఇబ్బందికరమైన’ సరుకులు ఏంటనేది యూకే– ఈయూ ప్రతినిధుల ఉమ్మడి కమిటీ ఒకటి నిర్ణయిస్తుంది. ► ఈ సరిహద్దుల మధ్య వ్యక్తులు పంపించుకునే సరుకులపై పన్నులు విధించకపోవటం... ఉత్తర ఐర్లాండ్ రైతులకివ్వాల్సిన సాయం... సరుకుల నియంత్రణకు సంబంధించి ఈయూ సింగిల్ మార్కెట్ నిబంధనల్ని ఉత్తర ఐర్లాండ్ పాటించటం... సరిహద్దులో యూకే అధికారులతో పాటు ఈయూ అధికారులూ ఉండటం... సేవలకు మినహాయించి సరుకులకు మాత్రం ఉత్తర ఐర్లాండ్‌లో ఈయూ చట్టాలే అమలుకావటం... ఈయూలోని యూకే పౌరులు– యూకేలోని ఈయూ పౌరులు ఇకపైనా తమ నివాస, సోషల్ సెక్యూరిటీ హక్కుల్ని యథాతథంగా పొందగలగటం... ఇలాంటివన్నీ తాజా ఒప్పందంలో ఉన్నాయి. -
త్రీ డీల్ లేదు
హీరో– ప్రొడ్యూసర్ కాంబినేషన్ వరుసగా రిపీట్ కావాలంటే వరుస హిట్స్ అందించాలి. లేదంటే రెండు, మూడు సినిమాల డీల్ సైన్ చేయాలి. తమిళ స్టార్ హీరో అజిత్, బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ 3 సినిమాల డీల్ కుదుర్చుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ వాటిలో నిజం లేదని బోనీ కన్ఫర్మ్ చేశారు. ‘‘బయట ప్రచారం అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అజిత్‌తో ‘నేర్కొండ పార్వై’ సినిమా నిర్మిస్తున్నాను. ఆ తర్వాత ఓ యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్నాం. అజిత్‌తో ఓ హిందీ సినిమా చేయించాలనే ఆలోచన నాకుంది. కానీ అజిత్ ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు’’ అన్నారు. హిందీ చిత్రం ‘పింక్’కి రీమేక్‌గా రూపొందిన ‘నేర్కొండ పార్వై’ ఆగస్ట్‌లో రిలీజ్ కానుంది. -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ చేతికి జేపోర్ బ్రాండ్
ముంబై: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్) కంపెనీ ఎథ్నిక్ వేర్ బ్రాండ్స్– జేపోర్, టీజీ అప్పారెల్ అండ్ డెకార్లను కొనుగోలు చేస్తోంది. జేపోర్ బ్రాండ్‌ను రూ.110 కోట్లకు, టీజీ అప్పారెల్ అండ్ డెకార్ బ్రాండ్‌ను రూ.25 కోట్లకు కొనుగోలు చేయనున్నామని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ తెలిపింది. ఈ డీల్ 30– 45 రోజుల్లో పూర్తవ్వగలదని పేర్కొంది. ఎథ్నిక్ అప్పారెల్, యాక్సెసరీల విభాగంలో మరింత పటిష్టవంతం కావడానికి ఈ బ్రాండ్స్‌ను కొనుగోలు చేస్తున్నామని వివరించింది. 2012లో ఆరంభమైన జేపోర్ బ్రాండ్... చేతితో తయారు చేసిన దుస్తులను, ఆభరణాలను, హోమ్ టెక్స్‌టైల్స్‌ను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.39 కోట్ల ఆదాయం ఆర్జించింది. టీజీ అప్పారెల్ అండ్ డెకోర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.34 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. దేశవ్యాప్తంగా 2,714 బ్రాండ్ స్టోర్స్..... ఈ రెండు బ్రాండ్ల కొనుగోళ్లతో బ్రాండెడ్ ఫ్యాషన్ స్పేస్‌లో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని ఎబీఎఫ్ఆర్ఎల్ ఎమ్డీ,, అశీష్ దీక్షిత్ పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఏబీఎఫ్ఆర్ఎల్ దేశవ్యాప్తంగా 750 నగరాల్లో 2,714 బ్రాండ్ స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. లూయూ ఫిలప్, వాన్ హ్యూసెన్, అలెన్ సోలే, పీటర్ ఇంగ్లాండ్ వంటి బ్రాండ్ల దుస్తులను విక్రయిస్తోంది. పాంటలూన్స్ పేరుతో వేల్యూ ఫ్యాషన్ స్టోర్ బ్రాండ్‌ను కూడా నిర్వహిస్తోంది. ద కలెక్టివ్, టెడ్ బేకర్, రాల్ఫ్ లూరెన్, అమెరికన్ ఈగిల్, సిమన్ కార్టర్ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లను కూడా విక్రయిస్తోంది. బ్రాండ్ల కొనుగోళ్ల వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ షేర్ 0.3 శాతం లాభంతో రూ.219 వద్ద ముగిసింది. -
ఏఎస్సై కేసులో డీల్ కుదిరింది!
► పెట్టుబడిదారులకు రూ.120 కోట్లు చెల్లింపు! ► కీలకంగా వ్యవహరించిన ఓ పోలీసు అధికారి ► వారి నుంచి డబ్బు ముట్టినట్లు సంతకాలు ► కరీంనగర్లో 20 రోజుల మకాం ► స్థానిక నేతలకు ముడుపులు! ► సీఐడీ దర్యాప్తుపైనా అనుమానాలు కరీంనగర్: ఏఎస్సై మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ ఉదంతానికి తెరదించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లోని కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత రామగిరి ప్రసాదరావు ఆత్మహత్య కేసులో అరెస్టై జైలుపాలైన మోహన్‌రెడ్డికి అక్రమ ఫైనాన్స్ దందాతో దాదాపు రూ.500 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కాగా, జైలులోనే ఉన్న మోహన్‌రెడ్డి అక్కడి నుంచే తన వ్యాపారానికి సంబంధించి సెటిల్మెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడిదారులకు సొమ్మును చెల్లించడంతోపాటు బాధితులతో రాజీకి సిద్ధపడినట్లు తెలిసింది. తన ప్రైవేట్ పైనాన్స్‌లో పెట్టుబడి పెట్టిన వారికి ఠంఛన్‌గా వడ్డీలు చెల్లించడంతోపాటు 20 రోజుల క్రితం అసలు మొత్తాన్ని కూడా చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. హైదారాబాద్‌లో పని చేస్తున్న ఓ పోలీ సు ఉన్నతాధికారి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. రూ.120 కోట్ల చెల్లింపులు..! మోహన్‌రెడ్డి శాఖాపరంగా మంచిపేరున్న కొంతమంది పోలీసుల పేర్లను ఉద్దేశపూర్వకంగా ఇరికించి వ్యవహరాన్ని జఠిలం చేశారని ఆరోపణలొచ్చాయి. దీంతో వ్యవహరాన్ని చక్కదిద్దడానికి హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఓ పోలీస్ ఉన్నతాధికారి రంగంలోకి దిగినట్లు తెలిసింది. మోహన్‌రెడ్డి ఫైనాన్స్ పెట్టుబడుదారుల జాబితాతో ఇటీవల కరీంనగర్ అలకాపురిలోని అధికారికి చెందిన ఇంట్లో ఆయన సుమారు 20 రోజులు పాటు మకాం వేసినట్లు తెలిసింది. ఆ జాబితాలోని వారందరినీ ఒకరికి తెలియకుండా మరొకరిని పిలిచి వారు పెట్టుబడి మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లించినట్లు సమాచారం. విశ్వనీయమైన సమాచారం మేరకు మొత్తంగా రూ.120 కోట్లు పెట్టుబడుదారులకు వడ్డీతో సహా చెల్లించినట్లు తెలిసింది. పెట్టుబడిదారుల నుంచి డబ్బులు ముట్టినట్లుగా సంతకాలు సైతం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది పెట్టుబడిదారులకు చెల్లించడానికి రూ.120 కోట్లకు పైగా నగదు ఎక్కడి నుంచి తెచ్చారనేది చర్చనీయాంశమైంది. నిజామాబాద్, మంచిర్యాల, హైదరాబాద్‌లకు చెందిన ముగ్గురు ఎన్ఆర్ఐలు ఆ డబ్బును సర్దుబాటు చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన సదరు పోలీస్ అధికారి ఆ ముగ్గురి ఇళ్లకు వెళ్లి తన సొంత వాహనంలో డబ్బులను కరీంనగర్ తీసుకుని వచ్చారని సమాచారం. ఎన్ఆర్ఐల నుంచి మొత్తం రూ.150 కోట్లు తీసుకొచ్చారని, అందులో పెట్టుబడిదారులకు రూ.120 కోట్లు చెల్లించారని తెలిసింది. మిగిలిన మొత్తాన్ని ఈ కేసు గురించి మాట్లాడకుండా ఉండేందుకు అధికార, విపక్షాలకు చెందిన కొందరు నేతలకు రూ. కోటి చొప్పున పంపకాలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.