ఏఎస్సై కేసులో డీల్ కుదిరింది!
► పెట్టుబడిదారులకు రూ.120 కోట్లు చెల్లింపు!
► కీలకంగా వ్యవహరించిన ఓ పోలీసు అధికారి
► వారి నుంచి డబ్బు ముట్టినట్లు సంతకాలు
► కరీంనగర్‌లో 20 రోజుల మకాం
► స్థానిక నేతలకు ముడుపులు!
► సీఐడీ దర్యాప్తుపైనా అనుమానాలు
కరీంనగర్: ఏఎస్సై మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ ఉదంతానికి తెరదించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లోని కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత రామగిరి ప్రసాదరావు ఆత్మహత్య కేసులో అరెస్టై జైలుపాలైన మోహన్‌రెడ్డికి అక్రమ ఫైనాన్స్ దందాతో దాదాపు రూ.500 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కాగా, జైలులోనే ఉన్న మోహన్‌రెడ్డి అక్కడి నుంచే తన వ్యాపారానికి సంబంధించి సెటిల్‌మెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడిదారులకు సొమ్మును చెల్లించడంతోపాటు బాధితులతో రాజీకి సిద్ధపడినట్లు తెలిసింది. తన ప్రైవేట్ పైనాన్స్‌లో పెట్టుబడి పెట్టిన వారికి ఠంఛన్‌గా వడ్డీలు చెల్లించడంతోపాటు 20 రోజుల క్రితం అసలు మొత్తాన్ని కూడా చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. హైదారాబాద్‌లో పని చేస్తున్న ఓ పోలీ సు ఉన్నతాధికారి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది.
రూ.120 కోట్ల చెల్లింపులు..!
మోహన్‌రెడ్డి శాఖాపరంగా మంచిపేరున్న కొంతమంది పోలీసుల పేర్లను ఉద్దేశపూర్వకంగా ఇరికించి వ్యవహరాన్ని జఠిలం చేశారని ఆరోపణలొచ్చాయి. దీంతో వ్యవహరాన్ని చక్కదిద్దడానికి హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఓ పోలీస్ ఉన్నతాధికారి రంగంలోకి దిగినట్లు తెలిసింది. మోహన్‌రెడ్డి ఫైనాన్స్ పెట్టుబడుదారుల జాబితాతో ఇటీవల కరీంనగర్ అలకాపురిలోని అధికారికి చెందిన ఇంట్లో ఆయన సుమారు 20 రోజులు పాటు మకాం వేసినట్లు తెలిసింది. ఆ జాబితాలోని వారందరినీ ఒకరికి తెలియకుండా మరొకరిని పిలిచి వారు పెట్టుబడి మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లించినట్లు సమాచారం. విశ్వనీయమైన సమాచారం మేరకు మొత్తంగా రూ.120 కోట్లు పెట్టుబడుదారులకు వడ్డీతో సహా చెల్లించినట్లు తెలిసింది. పెట్టుబడిదారుల నుంచి డబ్బులు ముట్టినట్లుగా సంతకాలు సైతం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది
పెట్టుబడిదారులకు చెల్లించడానికి రూ.120 కోట్లకు పైగా నగదు ఎక్కడి నుంచి తెచ్చారనేది చర్చనీయాంశమైంది. నిజామాబాద్, మంచిర్యాల, హైదరాబాద్‌లకు చెందిన ముగ్గురు ఎన్‌ఆర్‌ఐలు ఆ డబ్బును సర్దుబాటు చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన సదరు పోలీస్ అధికారి ఆ ముగ్గురి ఇళ్లకు వెళ్లి తన సొంత వాహనంలో డబ్బులను కరీంనగర్ తీసుకుని వచ్చారని సమాచారం. ఎన్‌ఆర్‌ఐల నుంచి మొత్తం రూ.150 కోట్లు తీసుకొచ్చారని, అందులో పెట్టుబడిదారులకు రూ.120 కోట్లు చెల్లించారని తెలిసింది. మిగిలిన మొత్తాన్ని ఈ కేసు గురించి మాట్లాడకుండా ఉండేందుకు అధికార, విపక్షాలకు చెందిన కొందరు నేతలకు రూ. కోటి చొప్పున పంపకాలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.