దేశీ సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్.. యూఎస్ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం వ్యాన్‌గార్డ్ నుంచి భారీ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు తెలుస్తోంది. డీల్ విలువ 1.5 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,500 కోట్లు)గా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పదేళ్ల కాలంవరకూ సర్వీసులను పొడిగించే వీలున్నట్లు తెలియజేశాయి. తద్వారా 2 బిలియన్ డాలర్లకు కాంట్రాక్ట్ విలువ చేరనున్నట్లు వెల్లడించాయి. ఇన్ఫోసిస్ ఇటీవలే క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలను విడుదల చేసింది. క్యూ1లో 1.7 బిలియన్ డాలర్ల డీల్స్‌ను కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. అయితే వ్యాన్‌గార్డ్ డీల్ వీటిలో లేదని విశ్లేషకులు తెలియజేశారు.
పోటీ అధికమే
వ్యాన్‌గార్డ్‌తో కుదుర్చుకున్న డీల్ ఇన్ఫోసిస్ చరిత్రలో అతిపెద్ద కాంట్రాక్టుగా నిపుణులు భావిస్తున్నారు. తొలుత బిలియన్ డాలర్లుగా అంచనా వేసినట్లు తెలియజేశారు. గత వారం షేరు దూకుడుకు ఈ డీల్‌పై అంచనాలు కొంత కారణమైనట్లు చెబుతున్నారు. అయితే కంపెనీ ఈ అంశంపై స్పందించకపోవడం గమనార్హం! కాగా.. వ్యాన్‌గార్డ్ డీల్ కోసం ఐటీ దిగ్గజాలు టీసీఎస్, యాక్సెంచర్, విప్రోలతో ఇన్ఫోసిస్ పోటీపడినట్లు తెలుస్తోంది. డీల్‌లో భాగంగా బీపీఎం సర్వీసులతోపాటు డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ సేవలను ఇన్ఫోసిస్ అందించనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాన్‌గార్డ్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్వహించే రికార్డ్ కీపింగ్ సర్వీసులకు మద్దతివ్వనున్నట్లు వివరించారు.
ఎలక్ట్రానిక్ సిటీలో
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో 3,000 మందితో పనిచేయగల యూనిట్‌ను వ్యాన్‌గార్డ్ డీల్ కోసం ఇన్ఫోసిస్ ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తొలుత 300-400 మంది సిబ్బందితో సేవలు ప్రారంభించి తదుపరి దశలో డీల్‌కు అనుగుణంగా పెంచే యోచనలో ఉన్నట్లు తెలియజేశాయి. కాగా.. వివిధ ఫండ్స్ ద్వారా ఇన్ఫోసిస్‌లో 3 శాతం వాటాను వ్యాన్‌గార్డ్ కలిగి ఉంది. రిటైర్‌మెంట్ సర్వీసుల విభాగంలో ఇన్ఫోసిస్‌కు మంచి పట్టున్నదని, యూఎస్‌లో ఇలాంటి టాప్ -20 కంపెనీలలో సగంవరకూ సేవలను అందిస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫోసిస్ షేరు 2 శాతం ఎగసి రూ. 920 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 924ను అధిగమించింది. గత గురువారం రూ. 955ను అధిగమించడం ద్వారా ఇన్ఫోసిస్ షేరు 52 వారాల గరిష్టానికి చేరిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment