Infosys Technologies
-
నిలకడగా ఇన్ఫోసిస్ వృద్ధి
న్యూఢిల్లీ: ఎల్లప్పుడూ పటిష్టంగా నిలవడంతోపాటు.. నిలకడగా కొనసాగే కంపెనీగా ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌ను సంస్థ సీఈవో సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం కంపెనీ వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య వివాదాలు తలెత్తిన సమయంలో సలీల్ కంపెనీ పగ్గాలు అందుకున్నారు. 2018 జనవరిలో అప్పటి సీఈవో విశాల్ సిక్కా నుంచి ఇన్ఫోసిస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాక కంపెనీ కార్యకలాపాలలో నిలకడను తీసుకురావడమేకాకుండా వృద్ధి బాటను కొనసాగించారు. ఈ కాలంలో కంపెనీకి ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడంతోపాటు.. కార్యకలాపాలను వేగవంతం చేశారు. ఇన్ఫోసిస్‌ను వ్యవస్థాపకులు అద్భుతమైన సంస్థగా తీర్చిదిద్దినట్లు ఒక ఇంటర్వ్యూలో పరేఖ్ ప్రశంసించారు. దీంతో కంపెనీ ఎల్లప్పుడూ పటిష్టంగా నిలుస్తూనే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇకపైన కూడా ఇదే బాటలో కొనసాగనున్నట్లు తెలియజేశారు. 2022–23లో 16 శాతం వరకు వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఆదాయంలో కంపెనీ 14–16 శాతం వృద్ధిని సాధించే వీలున్నట్లు అంచనా వేశారు. ఇందుకు పటిష్ట డీల్ పైప్‌లైన్ దోహదపడనున్నట్లు తెలియజేశారు. గత ఐదేళ్లలో ఇన్ఫోసిస్ ఆదాయం రూ. 73,715 కోట్ల నుంచి రూ. 1,23,936 కోట్లకు ఎగసింది. 2018 నుంచి 2022 మార్చి మధ్య కన్సాలిడేటెడ్ నికర లాభాలు సైతం రూ. 16,029 కోట్ల నుంచి రూ. 22,110 కోట్లకు జంప్ చేశాయి. -
ఆస్గ్రిడ్ కోసం ఇన్ఫీ, మైక్రోసాఫ్ట్ జత
న్యూఢిల్లీ: క్లౌడ్ ట్రాన్స్ఫార్మేషన్ సేవలు అందించేందుకు తాజాగా ఐటీ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ చేతులు కలిపాయి. తద్వారా ఆ్రస్టేలియా తూర్పుతీర ప్రాంతంలోని విద్యుత్ పంపిణీ దిగ్గజం ఆస్గ్రిడ్కు కొన్నేళ్లపాటు సేవలు అందించనున్నాయి. ఇందుకు వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తాము సమకూర్చనున్న సరీ్వసుల మద్దతుతో ఆస్గ్రిడ్ కస్టమర్లకు అందుబాటులో నమ్మకమైన నిరంతర సరీ్వసులను అందించేందుకు వీలుంటుందని ఇన్ఫోసిస్ పేర్కొంది. 40 లక్షలమంది ఆస్ట్రేలియన్లకు ప్రతిరోజూ అత్యున్నత ప్రమాణాలతో అందిస్తున్న అత్యవసర సేవలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దవలసి ఉన్నట్లు ఆస్గ్రిడ్ సీఐవో నిక్ క్రోవ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో నెట్‌వర్క్‌ను మరింత నమ్మదగిన స్థాయిలో మెరుగుపరుస్తామని, తద్వారా విద్యుత్ ధరలు తగ్గేందుకు వీలుంటుందన్నారు. కొత్త సరీ్వసులను మార్కెట్లో చౌక గా, వేగవంతంగా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. వెరసి క్లౌడ్ ప్రోగ్రామ్ ద్వారా ఆస్గ్రిడ్ వ్యయాల అదుపుతోపాటు.. ఐటీ వ్యవస్థ పనితీరు బలపడనున్నట్లు పేర్కొన్నారు. ఎంటర్ప్రైజ్ ఆధారిత క్లౌడ్ సరీ్వసుల వినియోగం పెరుగుతున్నట్లు మైక్రోసాఫ్ట్ ఆ్రస్టేలియా ప్రధాన అధికారి రాచెల్ బాండీ అన్నారు. పలు బిజినెస్‌ల వృద్ధికి కీలకంగా నిలుస్తున్నట్లు చెప్పారు. ఇన్ఫోసిస్, ఆస్గ్రిడ్లతో జట్టుకట్టడం ద్వారా మైక్రోసాఫ్ట్ అజూర్ శక్తిని వినియోగించుకోనున్నట్లు తెలిపారు. -
ఇన్ఫీ లాభం రూ. 5,076 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ గతేడాది చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 17.5 శాతం పెరిగి రూ. 5,076 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,321 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 13 శాతంపైగా ఎగసి రూ. 26,311 కోట్లకు చేరింది. గత క్యూ4లో రూ. 23,267 కోట్ల టర్నోవర్ సాధించింది. డాలర్ల రూపేణా ఆదాయం 13 శాతం వృద్ధితో 361.3 కోట్ల డాలర్లుగా నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 15 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాది(2020–21)లో ఇన్ఫోసిస్ నికర లాభం 16.6 శాతం పురోగమించి రూ. 19,351 కోట్లకు చేరింది. ఇక మొత్తం ఆదాయం దాదాపు 11 శాతం పుంజుకుని రూ. 1,00,472 కోట్లను తాకింది. కాగా.. ఇప్పటికే చెల్లించిన రూ. 12తో కలిపి గతేడాదికి 54 శాతం అధికంగా రూ. 27 డివిడెండ్‌ను చెల్లించినట్లయ్యింది. బైబ్యాక్‌కు రెడీ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలుకి ఇన్ఫోసిస్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో షేరుకీ రూ. 1,750 ధర మించకుండా 5.25 కోట్లకుపైగా షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు వెల్లడించింది. 1.23 శాతం వాటాకు సమానమైన వీటి కొనుగోలుకి రూ. 9,200 కోట్ల వరకూ వెచ్చించనుంది. ఫలితాలపై అంచనాల నేపథ్యంలో మంగళవారం ఇన్ఫోసిస్ షేరు ఎన్ఎస్ఈలో 1.6% క్షీణించి రూ. 1,403 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే బైబ్యాక్‌కు 25 శాతం ప్రీమియంను ప్రకటించడం గమనార్హం! ఇన్ఫీ అంతక్రితం 2019 ఆగస్ట్‌లో 11.05 కోట్ల ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ. 8,260 కోట్లు వెచ్చించింది. 2017 డిసెంబర్లో తొలిసారి షేరుకి రూ. 1,150 ధరలో బైబ్యాక్‌ను చేపట్టింది. తద్వారా 11.3 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. గైడెన్స్ భేష్..: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం 12–14 శాతం స్థాయిలో బలపడే వీలున్నట్లు ఇన్ఫోసిస్ తాజాగా అంచనా వేసింది. ఇది స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఇచ్చిన గైడెన్స్‌కాగా.. డివిడెండ్(రూ. 6,400 కోట్లు), బైబ్యాక్‌తో కలిపి వాటాదారులకు రూ. 15,600 కోట్లను తిరిగి చెల్లించనున్నట్లు తెలియజేసింది. తద్వారా వాటాదారులకు క్యాష్‌ఫ్లోలలో 85 శాతం వరకూ చెల్లించే విధానాలను పాటిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ వివరించారు. ఆర్డర్ బుక్ రికార్డు 2020–21లో భారీ డీల్స్ ఆర్డర్ల విలువ 57 శాతం జంప్‌చేసి 14.1 బిలియన్ డాలర్లను తాకినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. వీటిలో 66 శాతం డీల్స్‌ను కొత్తగా కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డిసెంబర్లో కొత్త రికార్డును నెలకొల్పుతూ దైమ్లర్ ఏజీ నుంచి 3.2 బిలియన్ డాలర్ల(అంచనా) ఆర్డర్‌ను పొందింది. గతేడాది ఆగస్ట్‌లో వ్యాన్‌గార్డ్ నుంచి సంపాదించిన 1.5 బిలియన్ డాలర్ల కాంట్రాక్టుతో పోలిస్తే ఇది రెట్టింపు విలువకావడం విశేషం! క్యూ4లో సైతం 2.1 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులు కుదుర్చుకుంది. 25,000 మంది ఫ్రెషర్స్‌కు చాన్స్ గతేడాదిలో 36,500 మందిని ఇన్ఫోసిస్ కొత్తగా నియమించు కుంది. వీరిలో క్యాంపస్ నియామకాల ద్వారా 21,000 మందికి ఉపాధి కల్పించినట్లు సీవోవో యూబీ ప్రవీణ్ రావు పేర్కొన్నారు. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25,000 మంది ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు తెలియజేశారు. వీరిలో 1,000 మందిని విదేశీ క్యాంపస్‌ల ద్వారా నియమించుకోనున్నట్లు వివరించారు. క్యూ3లో 10.1 శాతంగా నమోదైన ఉద్యోగ వలస రేటు క్యూ4లో 15.2 శాతానికి ఎగసింది. మార్చికల్లా కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 2,59,619కు చేరింది. రూ. లక్ష కోట్లకు.. గతేడాది ఆదాయంలో రూ. లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాం. క్లయింట్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. కోబాల్ట్ టీఎం తదితర నైపుణ్యాల ద్వారా డిజిటల్ పోర్ట్‌ఫోలియోను పెంచుకుంటున్నాం. ఉద్యోగులకు అధికారాలు ఇవ్వడం ద్వారా గ్లోబల్ స్థాయిలో క్లయింట్లను ఆకట్టుకుంటున్నాం. భాగస్వామి ఎంపికలో క్లయింట్ల నుంచి ప్రాధాన్యతను సాధిస్తున్నాం. – ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ -
ఇన్ఫోసిస్.. జోష్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసికంలో ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం దాదాపు 17 శాతం పెరిగి రూ. 5,197 కోట్లను తాకింది. వార్షిక ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో మొత్తం ఆదాయం సైతం 12% పైగా పుంజుకుని రూ. 25,927 కోట్లకు చేరింది. క్యూ3లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 7.13 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌ను కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో స్థిరకరెన్సీ ప్రాతిపదికన పూర్తి ఏడాదికి(2020–21) ఆదాయం 4.5–5% స్థాయిలో వృద్ధి చెందే వీలున్నట్లు తాజా అంచనాలు(గైడెన్స్) ప్రకటించింది. వెరసి ఇంతక్రితం వేసిన 2–3% ఆదాయ అంచనాలను ఎగువముఖంగా సవరించింది. అత్యుత్తమ పనితీరు కంపెనీ మరోసారి అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. క్లయింట్లకు అవసరమైన వ్యూహాలను అమలుచేయడం, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా కంపెనీ వేగవంత వృద్ధిని సాధించినట్లు తెలియజేశారు. దీంతో క్యూ3లో ఐటీ పరిశ్రమలోనే రికార్డ్ స్థాయిలో డీల్స్ కుదుర్చుకోగలిగినట్లు అభిప్రాయపడ్డారు. గత తొమ్మిది నెలల్లో కంపెనీ మొత్తం 12 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌ను సాధించినట్లు తెలియజేశారు. వీటిలో 8 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులను కొత్తగా కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. తద్వారా కంపెనీ పటిష్ట వృద్ధి బాటలో సాగుతున్నట్లు తెలియజేశారు. వేన్‌గార్డ్, దైల్మర్, రోల్స్‌రాయిస్ తదితర దిగ్గజాలతో కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు ద్వారా డిజిటల్, క్లౌడ్ విభాగాలలో కంపెనీకున్న పట్టు ప్రతిఫలిస్తున్నట్లు పేర్కొన్నారు. 2.49 లక్షల మంది 2020 డిసెంబర్‌కల్లా ఇన్ఫోసిస్ సిబ్బంది సంఖ్య 2.49 లక్షలకుపైగా చేరింది. కోవిడ్–19 కాలంలో 97 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే బాధ్యతలు నిర్వహించినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ ఏడాది 17,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించనుండగా.. వచ్చే ఏడాది(2021–22) మరో 24,000 క్యాంపస్ ఉద్యోగాలకు వీలున్నట్లు తెలియజేసింది. సీఈవో సలీల్‌కు రూ. 3.25 కోట్ల విలువైన కంపెనీ రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్(ఆర్ఎస్యూ) జారీకి కంపెనీ రెమ్యునరేషన్ కమిటీ చేసిన ప్రతిపాదనను బోర్డు అనుమతించినట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. కాగా.. స్వతంత్ర డైరెక్టర్ పునీత కుమార్ సిన్హా పదవీ కాలం పూర్తికావడంతో జనవరి 13న పదవీ విరమణ చేసినట్లు వెల్లడించింది. కార్టర్ డిజిటల్ ఆస్ట్రేలియన్ ఎక్స్పీరియన్స్ డిజైన్ సంస్థ కార్టర్ డిజిటల్‌ను కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ తాజాగా వెల్లడించింది. కంపెనీ ఆస్తులు, ఉద్యోగులను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. తద్వారా కంపెనీ గ్లోబల్ డిజైన్, ఎక్స్పీరియన్స్ సేవలలో మరింత పటిష్టంకానున్నట్లు పేర్కొంది. గ్లోబల్ డిజిటల్ సొల్యూషన్స్‌లో మరింత విస్తరించనున్నట్లు వివరించింది. ఆస్ట్రేలియన్ మార్కెట్లో కంపెనీ బ్రాండు వాంగ్డూడీ ద్వారా మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలు చిక్కనున్నట్లు పేర్కొంది. మార్చిలోగా కొనుగోలు పూర్తికావచ్చని అంచనా వేసింది. డిజిటల్ కామర్స్ విభాగంలో సీఎంవోలు, బిజినెస్‌లకు కార్టర్ కొనుగోలుతో వాంగ్డూడీ సేవలు మరింత బలపడనున్నట్లు అభిప్రాయపడింది. కంపెనీ మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు బీఎస్ఈలో 1.2 శాతం బలపడి రూ.1,388 సమీపంలో ముగిసింది. -
ఇన్ఫోసిస్‌కు వ్యాన్‌గార్డ్.. భారీ డీల్!
దేశీ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్.. యూఎస్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం వ్యాన్‌గార్డ్ నుంచి భారీ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు తెలుస్తోంది. డీల్ విలువ 1.5 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,500 కోట్లు)గా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పదేళ్ల కాలంవరకూ సర్వీసులను పొడిగించే వీలున్నట్లు తెలియజేశాయి. తద్వారా 2 బిలియన్ డాలర్లకు కాంట్రాక్ట్ విలువ చేరనున్నట్లు వెల్లడించాయి. ఇన్ఫోసిస్ ఇటీవలే క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలను విడుదల చేసింది. క్యూ1లో 1.7 బిలియన్ డాలర్ల డీల్స్‌ను కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. అయితే వ్యాన్‌గార్డ్ డీల్ వీటిలో లేదని విశ్లేషకులు తెలియజేశారు. పోటీ అధికమే వ్యాన్గార్డ్తో కుదుర్చుకున్న డీల్ ఇన్ఫోసిస్ చరిత్రలో అతిపెద్ద కాంట్రాక్టుగా నిపుణులు భావిస్తున్నారు. తొలుత బిలియన్ డాలర్లుగా అంచనా వేసినట్లు తెలియజేశారు. గత వారం షేరు దూకుడుకు ఈ డీల్‌పై అంచనాలు కొంత కారణమైనట్లు చెబుతున్నారు. అయితే కంపెనీ ఈ అంశంపై స్పందించకపోవడం గమనార్హం! కాగా.. వ్యాన్‌గార్డ్ డీల్ కోసం ఐటీ దిగ్గజాలు టీసీఎస్, యాక్సెంచర్, విప్రోలతో ఇన్ఫోసిస్ పోటీపడినట్లు తెలుస్తోంది. డీల్‌లో భాగంగా బీపీఎం సర్వీసులతోపాటు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సేవలను ఇన్ఫోసిస్ అందించనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాన్‌గార్డ్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్వహించే రికార్డ్ కీపింగ్ సర్వీసులకు మద్దతివ్వనున్నట్లు వివరించారు. ఎలక్ట్రానిక్ సిటీలో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో 3,000 మందితో పనిచేయగల యూనిట్‌ను వ్యాన్‌గార్డ్ డీల్ కోసం ఇన్ఫోసిస్ ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తొలుత 300-400 మంది సిబ్బందితో సేవలు ప్రారంభించి తదుపరి దశలో డీల్‌కు అనుగుణంగా పెంచే యోచనలో ఉన్నట్లు తెలియజేశాయి. కాగా.. వివిధ ఫండ్స్ ద్వారా ఇన్ఫోసిస్‌లో 3 శాతం వాటాను వ్యాన్‌గార్డ్ కలిగి ఉంది. రిటైర్మెంట్ సర్వీసుల విభాగంలో ఇన్ఫోసిస్‌కు మంచి పట్టున్నదని, యూఎస్‌లో ఇలాంటి టాప్ -20 కంపెనీలలో సగంవరకూ సేవలను అందిస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్ షేరు 2 శాతం ఎగసి రూ. 920 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 924ను అధిగమించింది. గత గురువారం రూ. 955ను అధిగమించడం ద్వారా ఇన్ఫోసిస్ షేరు 52 వారాల గరిష్టానికి చేరిన విషయం విదితమే. -
క్యూ1 బూస్ట్- ఇన్ఫోసిస్ ధూమ్‌ధామ్
సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిపుణుల అంచనాలను మించుతూ సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. దీంతో ఈ కౌంటర్లో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. వెరసి మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నప్పటికీ ఇన్ఫోసిస్ షేరు హైజంప్ చేసింది. ఎన్ఎస్ఈలో తొలుత 15 శాతంపైగా దూసుకెళ్లింది.రూ. 955ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. తదుపరి స్వల్పంగా వెనకడుగు వేసింది. ప్రస్తుతం 11 శాతం లాభంతో రూ. 919 వద్ద ట్రేడవుతోంది. ఫలితాలు ఓకే ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఇన్ఫోసిస్ వార్షిక ప్రాతిపదికన 12 శాతం అధికంగా రూ. 4,233 కోట్ల నికర లాభం ఆర్జించింది. విశ్లేషకులు రూ. 3,950 కోట్లను అంచనా వేశారు. ఇక మొత్తం ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 1.7 శాతం పెరిగి రూ. 23,665 కోట్లను తాకింది. ఈ కాలంలో తాజాగా 1.7 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. డాలర్ల రూపేణా ఆదాయం 2.4 శాతం నీరసించి 3121 మిలియన్ డాలర్లకు చేరింది. డిజిటల్ విభాగం నుంచి 1389 మిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. తద్వారా మొత్తం ఆదాయంలో 44 శాతంపైగా వాటాను ఆక్రమించుకుంది. కాగా.. 2020-21 పూర్తి కాలానికి ఆదాయం 0-2 శాతం మధ్య పుంజుకోగలదని ఇన్ఫోసిస్ అంచనా(గైడెన్స్) వేసింది. నిర్వహణ లాభ మార్జిన్లు 21-23 శాతం స్థాయిలో నమోదుకాగలవని ఆశిస్తోంది. 10 మిలియన్ డాలర్ల స్థాయిలో ఇద్దరు క్లయింట్లను సంపాదించగా.. 1 మిలియన్ స్థాయిలో 11 డీల్స్ కుదుర్చుకుంది. అయితే 10 కోట్ల డాలర్ల స్థాయిలో ముగ్గురు కస్టమర్లను, 5 కోట్ల డాలర్ల స్థాయిలో ఒక క్లయింట్నూ కోల్పోయినట్లు కంపెనీ తెలియజేసింది. ఇబిట్ గుడ్ క్యూ1లో త్రైమాసిక ప్రాతిపదికన నిర్వహణ లాభం(ఇబిట్) 9 శాతం బలపడి రూ. 5365 కోట్లను తాకినట్లు ఇన్ఫోసిస్ తెలియజేసింది. మార్జిన్లు 1.5 శాతం మెరుగుపడి 22.7 శాతానికి చేరినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలో 2.4 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ పూర్తి రుణ రహితమే కాకుండా 3.6 బిలియన్ డాలర్ల నగదు నిల్వలను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. కాగా..క్యూ1లో ఇన్ఫోసిస్ షేరు 22 శాతం లాభపడటం గమనార్హం! -
ఐటీ షేర్ల దెబ్బ.. ర్యాలీకి బ్రేక్
28,000 స్థాయి నుంచి తగ్గిన సెన్సెక్స్ ముంబై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ భవిష్యత్ ఆదాయ వృద్ధి అంచనాల్ని తగ్గించడంతో నాలుగు రోజుల మార్కెట్ ర్యాలీకి శుక్రవారం బ్రేక్‌పడింది. ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడికాకముందు, ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 28,049 పాయింట్ల గరిష్టస్థాయిని తాకింది. ఒక్కసారి ఫలితాలు వెల్లడికాగానే ఇన్ఫోసిస్‌తో పాటు ఇతర ఐటీ షేర్లు కూడా క్షీణించడంతో చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 106 పాయింట్ల నష్టంతో 27,836 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 8,595 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి క్షీణించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 8,541 పాయింట్ల వద్ద ముగిసింది. ఇతర ఐటీ షేర్లపై ఇన్ఫోసిస్ ప్రభావం... రానున్న క్వార్టర్లలో తమ వ్యాపారంలో ఒడుదుడుకులు వుండవచ్చంటూ ఇన్ఫోసిస్ యాజమాన్యం ప్రకటించడంతో దాదాపు ప్రధాన ఐటీ షేర్లన్నీ తగ్గాయి. ఇన్ఫోసిస్ 8.7 శాతం క్షీణించి 1,072 వద్ద ముగిసింది. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన టీసీఎస్ ఫలితాలు అంచనాల్ని మించినప్పటికీ, ఈ షేరు కూడా 2.8 శాతం తగ్గి 2,445 వద్ద క్లోజయ్యింది. విప్రో 2.81 శాతం, టెక్ మహింద్రా 2.5 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 5.35 శాతం పతనమయ్యింది. పెరిగిన రిలయన్స్.. క్వార్టర్లీ ఫలితాలు బావుంటాయన్న అంచనాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు స్వల్పంగా 0.6 శాతం పెరిగి రూ. 1,012 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ కంపెనీ వెల్లడించిన ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని మించాయి. -
సెన్సెక్స్ మద్దతు శ్రేణి 27,700-27,800
కార్పొరేట్ ఫలితాల సీజన్ దాదాపు ముగిసింది. ఒక్క ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ మినహా మార్కెట్ అంచనాలకు మించిన ఫలితాలు వెల్లడించిన కంపెనీ ఏదీ లేదు. అలాగే మార్కెట్‌ను తీవ్ర నిరుత్సాహానికి లోనుచేసిన కంపెనీ కూడా లేదు. అందుకే ఆర్థిక ఫలితాల ప్రభావం గత ఆరువారాల నుంచి సూచీలపై పెద్దగా పడలేదు. అంతర్జాతీయంగా కొనసాగుతున్న పాజిటివ్ ట్రెండ్, క్రూడ్ ధరల తగ్గుదల వంటి అంశాలు భారత్ సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. కానీ గత శుక్రవారం నాటకీయంగా ముడిచమురు, బంగారం హఠాత్తుగా కనిష్టస్థాయి నుంచి పెద్ద ర్యాలీ జరిపాయి. ఇదేరోజున డాలరుతో రూపాయి మారకపు విలువ నెలరోజుల కనిష్టస్థాయికి పడిపోయింది. ఒకవైపు కమోడిటీ ధరలు పెరగడం, మరోవైపు రూపాయి క్షీణించడం భారత్ స్టాక్ మార్కెట్‌ను ఆందోళనపర్చే అంశం. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... నవంబర్14తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గుల కు లోనై చివరకు 28,000 పాయింట్ల శిఖరంపైన స్థిరపడగలిగింది. 28,126 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 178 పాయింట్ల లాభంతో 28,047 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం 28,000 స్థాయిపైన నిలదొక్కుకుంటే, క్రమేపీ కొద్దివారాల్లో 28,500-28,600 స్థాయిని అందుకోవొచ్చు. ఈ శ్రేణిని అందుకునే ముందు, 28,150-28,250 పాయింట్ల శ్రేణి అవరోధాన్ని కల్పించవచ్చు. వచ్చే కొద్దిరోజుల్లో సెన్సెక్స్‌కు 27,700-27,800 మద్దతుశ్రేణి కీలకం. గత రెండు వారాల నుంచి ఈ మద్దతు సహకరాంతో పలుదఫాలు సూచీ బౌన్స్ అయినందున, ఈ శ్రేణిని కోల్పోతే అక్టోబర్ 31నాటి గ్యాప్అప్స్థాయి 27,440-27,390 శ్రేణి వద్దకు క్షీణించవచ్చు. ఈ మద్దతు శ్రేణి దిగువన ముగిస్తే 27,100-26,900 శ్రేణి వద్దకు తగ్గవచ్చు. నిఫ్టీ మద్దతు శ్రేణి 8,290-8,320 ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,360 పాయింట్ల అవరోధస్థాయిపైన ముగిసిన వెంటనే 8,415 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 53 పాయింట్ల లాభంతో 8,390 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ 8,360 స్థాయిని పరిరక్షించుకోగలిగితే, 8,440-8,470 శ్రేణి వద్దకు ర్యాలీ జరపవచ్చు. అటుతర్వాత రానున్న వారాల్లో 8,500-8,550 శ్రేణిని చేరవచ్చు. 8,360 స్థాయి దిగువన రెండు వారాల నుంచి మద్దతు కల్పిస్తున్న 8,290-8,320 పాయింట్ల శ్రేణి నిఫ్టీకి కీలకం. ఈ మద్దతు శ్రేణిని నష్టపోతే మార్కెట్ కరెక్షన్ బాటలోకి మళ్లవొచ్చు. ఆ లోపున క్రమేపీ 8,200-8,180 పాయింట్ల శ్రేణి వద్దకు క్షీణించవచ్చు. - పి. సత్యప్రసాద్ -
నాస్డాక్లో ఇన్ఫీ ఏడీఆర్ పతనం
హైదరాబాద్: అమెరికా టెక్నాలజీ ఎక్స్ఛేంజ్ ‘నాస్డాక్’లో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ షేరు (ఏడీఆర్...అమెరికన్ డిపాజిటరీ రిసీట్) నిలువునా పతనమైంది. బుధవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి ఈ ఏడీఆర్ భారీ ట్రేడింగ్ పరిమాణంతో 8 శాతానికి పైగా క్షీణించి 54.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ధర భారత్‌లో రూ. 3,330తో సమానం. అయితే బుధవారం దేశీ స్టాక్ మార్కెట్లలో ఈ షేరు రూ.3,671 వద్ద ముగియటం గమనార్హం. దేశీ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిశాక భారత కాలమానం ప్రకారం రాత్రి అమెరికాలో ట్రేడింగ్ మొదలవుతుంది కనక ఆ ప్రభావం దేశీ మార్కెట్లపై ఉండే అవకాశాలెక్కువ. దీంతో గురువారం భారత్ ఎక్స్ఛేంజీల్లో ఇన్ఫోసిస్ రూ. 300 వరకూ తగ్గే అవకాశం ఉందన్నది నిపుణుల మాట. తాము ముందుగా ప్రకటించిన ఆర్థిక అంచనాల్ని చేరడం కష్టమని కంపెనీ యాజమాన్యం ఒక ఇన్వెస్టర్ల సమావేశంలో బాంబు పేల్చడంతో ఈ పతనం సంభవించింది. గత రెండేళ్లుగా కంపెనీ పనితీరు పట్ల తాను అసంతృప్తి చెందుతున్నానని, కంపెనీ టర్న్ ఎరౌండ్ కావడానికి చాలాకాలమే పట్టవచ్చని ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణమూర్తి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి (2013-14) ఆదాయ వృద్ధి 11.5-12 శాతం వుండవొచ్చని గతంలో కంపెనీ ప్రకటించింది. అయితే తమ క్లయింట్ల వ్యయం ఈ క్వార్టర్లో బలహీనంగా వుందని, ఈ కారణంగా గెడైన్స్‌లో దిగువ శ్రేణిని మాత్రమే చేరవచ్చునని కంపెనీ సీఈఓ శిబూలాల్ తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కూడా వ్యాపారం మందకొడిగా వుంటుం దని ఆయన మరో బాంబు పేల్చారు. కంపెనీ ఛైర్మన్‌గా నారాయణమూర్తి తిరిగి బాధ్యతలు చేపట్టాక వ్యాపారం పుంజుకుందని చెప్పిన విశ్లేషకులు కంపెనీ తాజా ప్రకటనతో ఖిన్నులయ్యారు.