సెంట్రల్ లండన్‌లోని పార్లమెంటు స్క్వేర్‌లో బ్రెగ్జిట్‌కు మద్దతుగా జెండాలను ఊపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్న పౌరులు
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో బ్రిటన్ తన 47 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంది. ఈ చారిత్రక సందర్భం బ్రెగ్జిట్‌ను పురస్కరించుకుని బ్రిటన్ వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం బ్రెగ్జిట్ శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. బ్రెగ్జిట్ మరో కొత్త శకానికి నాంది అని ఈ సందర్భంగా ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఆయన ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోలో.. ‘చీకట్లు తొలగిపోతున్న వేళ ఘనమైన మన జాతి కొత్త పాత్ర ఆవిష్కృతం కానుంది.
బ్రస్సెల్స్‌లోని ఈయూ ప్రధాన కార్యాలయం వద్ద బ్రిటన్ జెండాను తీసేస్తున్న అధికారులు
ప్రతి ప్రాంత వాసుల కలలు సాకారం కానున్నాయి. బ్రెగ్జిట్ కేవలం న్యాయపరమైన చర్య కాదు. జాతి పరివర్తన, పునరుత్తేజం పొందే క్షణం’అని పేర్కొన్నారు. ‘ఈయూ నుంచి విడిపోవడంతో మన విధానాలను స్వేచ్ఛగా అమలు చేసే అవకాశం వచ్చింది. భారత్ సహా 13 దేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటాం’అనిఅన్నారు. దేశ చరిత్రలో ఇది గొప్ప ఘటన అని బ్రెగ్జిట్ అనుకూల నేత నిగెల్ ఫరాజ్ వ్యాఖ్యానించారు.
సంబరాలు.. నిరసనలు
ఈ ప్రత్యేక సందర్భంలో లండన్‌లోని పార్లమెంట్ స్వే్వర్‌తోపాటు డౌనింగ్ స్ట్రీట్ వద్ద బ్రెగ్జిట్ కౌంట్‌డౌన్ తెలుపుతూ భారీ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పబ్బులు, క్లబ్బుల్లో ప్రజలు బ్రెగ్జిట్ విందులు చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ ‘అన్ని దేశాలకు శాంతి, శ్రేయస్సు, స్నేహం’నినాదంతో కూడిన 50 పెన్స్(అరపౌండ్) నాణేన్ని విడుదల చేసింది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన అన్ని సంస్థలపైనా బ్రిటన్ యూనియన్ జాక్ జెండాను తొలగించారు.
కాగా, ఈయూలోనే కొనసాగాలంటూ కొన్ని చోట్ల బ్రెగ్జిట్ వ్యతిరేక ర్యాలీలు కూడా జరిగాయి. బ్రిటన్‌తోపాటు తమను కూడా ఈయూ నుంచి వేరు చేయడాన్ని నిరసిస్తూ స్కాట్లాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టారు. మరోసారి బ్రెగ్జిట్‌పై రెఫరెండం పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, బ్రెగ్జిట్‌తో బ్రిటన్, ఈయూ మధ్య ఒక్కసారిగా ఎలాంటి మార్పులు రావు. ఒప్పందం ప్రకారం.. శనివారం నుంచి ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో బ్రెగ్జిట్ అమలుకానుంది.
మిశ్రమ స్పందన
బ్రెగ్జిట్‌పై బ్రిటన్ పత్రికల్లో మిశ్రమ స్పందన కనిపించింది. డైలీ ఎక్స్‌ప్రెస్, ది సన్ వంటి పత్రికలు బ్రిటన్ శక్తివంతమవుతుందని వ్యాఖ్యానించగా, ముందున్నది గతులకు బాట అంటూ స్టాండర్డ్ పత్రిక, ది గార్డియన్ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈయూను వీడిన బ్రిటన్ అంటూ బీబీసీ ప్రసారం చేసిన కథనంపై ప్రశంసలతోపాటు విమర్శలు కూడా వచ్చాయి. కాగా, బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చే సమయంలోనే.. శుక్రవారం అర్ధరాత్రి ఫ్రాన్సులోని కలైస్ పోర్టు నుంచి బ్రిటన్‌లోని డోవర్‌కు బయలుదేరిన ఓడలో మాత్రం ఎలాంటి సందడి కనిపించలేదు.
ఆ ఓడ బయలుదేరిన సమయానికి ఈయూలో 28 సభ్యుదేశాలుండగా బ్రిటన్‌లోకి అడుగిడే సమయానికి ఈయూ 27 దేశాల సమాఖ్యగా మారనుంది. కాగా, కోట్ డెస్ డ్యూన్స్ అనే ఆ ఓడలో ప్రయాణీకుల్లో చాలామంది అప్పటికే నిద్రలోకి జారుకున్నారు. ఆడ్రే సెంటినెల్లా అనే మహిళ మాత్రం..‘ఇది విచారకరమైన రోజు. ఈ రోజుతో ఒక శకం ముగియనుంది. ఏం జరుగుతుందో తెలియని భవిష్యత్తులోకి వెళ్తున్నాం. ఎన్ని లోటుపాట్లున్నా ఈయూతోనే బ్రిటన్ ముందుకు సాగితే బాగుండేది’అని పేర్కొన్నారు.
ఈమె స్విట్జర్లాండ్‌లో ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ బ్రిటన్‌లో నివాసం ఉంటున్నారు. రేపటి నుంచి ఫెర్రీ క్యాంటిన్‌లో బ్రిటిష్ ఫిష్, చిప్స్ తినే వారు కనిపించరని ఓడ కెప్టెన్ ఆంటోయిన్ పకెట్ అన్నారు. బ్రెగ్జిట్ కారణంగా బ్రిటన్‌కు, ఈయూకు నిత్యం రాకపోకలు సాగించడం పెద్ద తలనొప్పిగా మారబోతోందని మరో ప్రయాణికుడు అలెస్సో బార్టన్ అన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా 27 దేశాల్లో తిరగగలిగే అవకాశాన్ని చాలా మంది కోల్పోనుండటం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దులు చెరిగిపోవాల్సిన సమయంలో పెరుగుతున్నాయని పేర్కొన్నారు. బ్రెగ్జిట్ పరిణామం భవిష్యత్తుకు మంచిది కాదని జర్మనీకి చెందిన మొహమ్మద్ మజోకా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment