బ్రెగ్జిట్‌ డీల్‌.. జోష్‌! | Brexit deal helps Sensex climb 39K | Sakshi
Sakshi News home page

బ్రెగ్జిట్‌ డీల్‌.. జోష్‌!

Published Fri, Oct 18 2019 5:55 AM | Last Updated on Fri, Oct 18 2019 5:55 AM

Brexit deal helps Sensex climb 39K - Sakshi

గత కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొన్న బ్రెగ్జిట్‌ డీల్‌ ఎట్టకేలకు సాకారం కావడంతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల్లో ముగిసింది. మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకుంటామని, మన దేశంలో మదుపు చేయాల్సిందిగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కోరడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 39,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,500 పాయింట్లపైకి ఎగిశాయి. స్వల్పంగానైనా, ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 24 పైసలు పెరిగి 71.19కు చేరడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడటం ఇది వరుసగా ఐదో రోజు. సెన్సెక్స్‌ 453 పాయింట్లు లాభపడి 39,052 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 11,586 పాయింట్ల వద్ద ముగిశాయి. బీఎస్‌ఈ అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. ఇక నిఫ్టీ సూచీల్లో ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాల్లోనే ముగిశాయి.   

‘రికవరీ’ ఆశలు...: ఉద్దీపన చర్యలు, పండుగల డిమాండ్, మంచి వర్షాలు కురియడం, వడ్డీరేట్లు తక్కువగా ఉండటం... ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశలను పెంచుతున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎనలిస్ట్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఫలితంగా నష్ట భయం భరించైనా సరే ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనే ఉద్దేశం పెరిగిందని, కొనుగోళ్లు జోరుగా సాగాయని వివరించారు.  

మరిన్ని విశేషాలు...
యస్‌ బ్యాంక్‌ షేర్‌ 15% లాభంతో రూ.47.4 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. భారతీ ఎయిర్‌టెల్‌ సునీల్‌ మిట్టల్, సునీల్‌ ముంజాల్‌లు ఈ బ్యాంక్‌లో వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారన్న వార్తలు ఈ లాభాలకు కారణం.  
బ్రెగ్జిట్‌ డీల్‌పై అనిశ్చితి తొలగిపోవడంతో టాటా మోటార్స్‌ షేర్‌ జోరుగా పెరిగింది. టాటా మోటార్స్‌ లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ప్లాంట్‌ ఇంగ్లాండ్‌లోనే ఉండటంతో తాజా బ్రెగ్జిట్‌ డీల్‌  ఈ కంపెనీకి ప్రయోజనకరమన్న అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. టాటా మోటార్స్‌ షేర్‌ 10 శాతం లాభంతో రూ.138 వద్ద ముగిసింది.


లాభాలు ఎందుకంటే....
► బ్రెగ్జిట్‌ డీల్‌  
బ్రెగ్జిట్‌ డీల్‌ ఎట్టకేలకు సాకారమైంది. దీంతో యూరోపియన్‌ యూనియన్‌తో ఉన్న 46 ఏళ్ల అనుబంధానికి బ్రిటన్‌ వీడ్కోలు పలకనున్నది. సూత్రప్రాయంగా కుదిరిన ఈ ఒప్పందానికి బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలపాల్సి ఉంది.  

►సుంకాల పోరుకు స్వస్తి !  
సుంకాల పోరుకు వీలైనంత త్వరగా ముగింపు పలకాలని, దీనికనుగుణంగా సంప్రదింపులు వేగవంతం చేయాలని అమెరికాను చైనా కోరడం సానుకూల ప్రభావం చూపించింది.  

►మరిన్ని ఉద్దీపన చర్యలు  
ఆర్థిక వ్యవస్థలో జోష్‌ను పెంచడానికి మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని నిర్మలా సీతారామన్‌ తాజాగా పేర్కొన్నారు.  

► వాహన స్క్రాప్‌ పాలసీ ముసాయిదా  
భారత్‌లో వాహన స్క్రాప్‌ పరిశ్రమను చట్టబద్ధం చే యడంలో భాగంగా రవాణా మంత్రిత్వ శాఖ వాహ న స్క్రాప్‌ పాలసీకి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పాలసీ అమల్లోకి వస్తే, అమ్మకాలు మరింతగా పుంజుకోగలవన్న అంచనాలతో వాహన షేర్లు లాభపడ్డాయి.  

►జోరుగా విదేశీ కొనుగోళ్లు
ఈ నెల తొలి 2 వారాల్లో నికర అమ్మకాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు గత 4 ట్రేడింగ్‌ సెషన్లలో రూ.2,000 కోట్ల మేర నికర  కొనుగోళ్లు జరిపారు.  
రూ.1.59 లక్షల కోట్లు

పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.59 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.1.59 లక్షల కోట్లు పెరిగి రూ.147.90 లక్షల కోట్లకు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement