
ముడిచమురు మునిగింది..!
♦ బ్యారెల్ ధర 46.75 డాలర్లకు
♦ ఒకేరోజు 6.6 శాతం పతనం
న్యూయార్క్: బ్రెగ్జిట్ దెబ్బకు ముడి చమురు (క్రూడ్) రేట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి మరింత పెరిగిపోనుందనే ఆందోళనలు తలెత్తటంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ధరలు దిగజారాయి. ప్రపంచవ్యాప్తంగా డాలరు మారకం విలువ వివిధ కరెన్సీలతో దూసుకెళ్లడం కూడా క్రూడ్ పతనానికి కారణమయింది. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్(నెమైక్స్)లో శుక్రవారం లైట్ స్వీట్ క్రూడ్ ధర ఏకంగా 6.6 శాతం క్షీణించి బ్యారెల్‌కు 46.75 డాలర్ల స్థాయికి క్రాష్ అయింది.
ప్రస్తుతం ఇది 5 శాతం మేర నష్టంతో 47.8 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక బ్రెంట్ క్రూడ్ ధర కూడా ఒకానొక దశలో 6.5 శాతం క్షీణించి బ్యారెల్‌కు 47.55 డాలర్లకు పడిపోయింది. కడపటి సమాచారం ప్రకారం 4.5 శాతం నష్టంతో 48.7 డాలర్ల వద్ద కదలాడుతోంది. ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో ఎంసీఎక్స్‌లో కూడా క్రూడ్ రేటు భారీగా దిగజారింది. శుక్రవారం ఒకొనొక దశలో(ఇంట్రాడే) జూలై కాంట్రాక్టు ధర 4.4% దిగజారి ఒక్కో బ్యారెల్‌కు రూ.3,207 కనిష్టాన్ని తాకింది.