ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. ఈ సంస్థలో పని చేయాలని చాలా మంది కలలు కంటారు. కానీ అక్కడ ఉద్యోగం పొందడం అంత సులభం కాదు. గూగుల్ జాబ్ కోసం ఏటా 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేస్తుంటారు. హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు సాధించడం కంటే గూగుల్‌లో జాబ్ కొట్టడం చాలా కష్టమని భావిస్తుంటారు.
గూగుల్ జాబ్ కోసం తీవ్రమైన పోటీతో పాటు నియామక ప్రక్రియ కూడా అంత ఆషామాషి కాదు. జాబ్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల రెజ్యూమ్‌లోని ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో గూగుల్ కంపెనీ రిక్రూటింగ్ విభాగంలో పనిచేసిన ఓ మాజీ ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులకు కొన్ని కిటుకులను తెలియజేశారు.
ఈ రెండు తప్పులు చేయొద్దు..
బిజినెస్ ఇన్‌సైడర్ రిపోర్ట్ ప్రకారం.. నోలన్ చర్చ్ 2012 నుంచి 2015 వరకు గూగుల్ రిక్రూటర్‌గా పనిచేశారు. గూగుల్‌లో ఉద్యోగం ఆశిస్తున్న అభ్యర్థులకు ఆయన కీలక సూచనలు చేశారు. రెజ్యూమ్‌లో నివారించాల్సిన రెండు పెద్ద తప్పులను తెలియజేశారు. కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశాలను ఇవి దెబ్బతీస్తున్నాయని చెప్పారు.
వీటిలో మొదటిది సూటిగా లేని సమాచారం. అంటే మీ సామర్థ్యం, నైపుణ్యాల గురించి అర్థం కాకుండా పేరాలు పేరాలు రాయడం. మీ రెజ్యూమ్ ఇలా కనిపిస్తే నియామక ప్రక్రియలో ముందుకు వెళ్లే అవకాశం ఉండదని ఆయన చెప్పారు.వ
ఇదీ చదవండి ➤ Advice to Job seekers: ఇలా చేస్తే జాబ్ పక్కా! ఐఐటీయన్, స్టార్టప్ ఫౌండర్ సూచన..
ఇక రెండవది స్పష్టత లేకపోవడం. అంటే మీరు మీ నైపుణ్యాలు, సామర్థ్యాల గురించి స్పష్టంగా, క్లుప్తంగా వ్యక్తీకరించాలి. మీరు మీ రెజ్యూమ్‌లో అలా చేయలేకపోతే, ఆఫీస్‌లో మీరు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయలేరని ఇది సూచిస్తుంది. వీటిని అధిగమించడానికి చాట్‌జీపీటీ, గ్రామర్లీ వంటి ఏఐ సాధనాలను ఉపయోగించుకోవచ్చని చర్చ్ సూచించారు.
కాగా వ్యయ నివారణలో భాగంగా గూగుల్ ఇటీవల 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఈ నేపథ్యంలో నియామకాల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపిక ప్రక్రియలో మరింత కఠినంగా ఉంటుంది. కాబట్టి మీ రెజ్యూమ్‌ను ప్రత్యేకంగా, తప్పులు లేకుండా చూసుకోవడం చాలా అవసరం.
Comments
Please login to add a commentAdd a comment