L and T Company
-
'తాత చేసిన పనికి కోటీశ్వరురాలైన మనవరాలు'
కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. చాలామంది జీవితాలను తలకిందులు చేసిన కరోనా లాక్డౌన్ ఓ మహిళను మాత్రం కోటీశ్వరురాలిని చేసింది. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది, ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.బెంగళూరులో నివాసముంటున్న ప్రియా శర్మ 2020 కరోనా సమయంలో ముంబై వెళ్లిపోయింది. ఆ సమయంలో చాలా రోజులు ఇంట్లోనే కాలం గడపాల్సి వచ్చింది. ముంబైలో వ్యాపారవేత్తగా ఉన్న ఆమె తాత ఇష్టాలను, ఇతర విషయాలను తెలుసుకోవడం ప్రారంభించింది. సరిగ్గా అలాంటి సమయంలోనే.. ఆమె తాత 2014లో లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీలో 500 షేర్లు కొనుగోలు చేసినట్లు, ఆ పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు ఆమె కంటపడ్డాయి.ఇదీ చదవండి: ఒకేసారి 10 రోజుల సెలవు.. ఆనందంలో 50వేల ఉద్యోగులుప్రియా శర్మకు దొరికిన ఆ పత్రాలే ఆమెను కోటీశ్వరురాలిని చేశాయి. 16 సంవత్సరాల వ్యవధిలో ఈ షేర్లు 4,500కి పెరిగాయి. వాటి విలువ ఏకంగా రూ. 1.72 కోట్లకు పెరిగింది. అయితే ఈ డబ్బును పొందటం చాలా కష్టంతో కూడుకున్న పని అయిపోయింది. చాలారోజులు పట్టించుకోకుండా వదిలేసినా ఈ స్టాక్స్ కోసం ప్రియా.. లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీని లేఖ రాసింది. ఆ తరువాత చాలా నిబంధనలను దాటుకుంటూ ముందుకు వెల్లాల్సి వచ్చింది. మొత్తం మీద తాత చేసిన పని మనవరాలిని కోటీశ్వరురాలిని చేసింది. -
శ్రీరామ మందిరం వెయ్యేళ్లు చెక్కుచెదరకుండా..నిపుణులు ఏమంటున్నారు?
#Ayodhya Ram Mandir అయోధ్య శ్రీరాముని మందిరి ఆధునిక ఇంజినీరింగ్‌లో ఒక అద్భుతమని, ఇది కేవలం బలమైన భూకంపాలు ,అత్యంత తీవ్రమైన వరదలను తట్టుకునేలా తయారు చేసినట్టు, అయోధ్య రామమందిరాన్ని నిర్మిస్తున్న దేశీయ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రకటించింది. దీంతో అయోధ్య రామ మందిర నిర్మాణ శైలి చర్చల్లో నిలిచింది. నిజంగానే ఇది వెయ్యేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటుందా? దీనికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలున్నాయి లాంటి ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో బిల్డింగ్ రీసెర్చ్ సంస్థలు, నిపుణులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నూతనంగా నిర్మించిన రామమందిరంలో నేడు(జనవరి 22న) అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్న 12:29:08 సెకన్లకు బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాని మోదీ చేతులు మీదుగా అత్యంత ఘనంగా నిర్వహించారు. జనవరి 24 నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. ఐఐటీ చెన్నై ఇంజనీర్లు, నిపుణుల సలహాలు సూచనలతో, అయోధ్యలో ఎల్ అండ్ టీ సంస్థ నిర్మిస్తున్న శ్రీరామ దేవాలయం కేవలం ప్రార్థనా స్థలంగానే కాకుండా ప్రాచీన విశ్వాసం , ఆధునిక విజ్ఞాన సమ్మేళనంగా నిలవబోతోంది. ఇదీ చదవండి: సుదృఢ నిర్మాణం... సుందర రూపం.. రామాలయం! ఈ ఆలయ నిర్మాణ విశేషాలు ► టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్వహణతో లార్సెన్ అండ్ టూబ్రో ఖచ్చితమైన ప్రణాళిక, వినూత్న నిర్మాణ సాంకేతికతలతో నిర్మస్తోంది. సంప్రదాయ నగారా శైలి, వాస్తు శిల్పం ఆధారంగా ఆ ఆలయాన్ని రూపొందించారు. సిమెంట్ , ఇనుముతో కాకుండా పూర్తిగా రాతితో నిర్మించారు. ఇతర పదార్థాలతో పోలిస్తే రాయికి ఎక్కువ జీవితకాలం, మంచి మన్నిక ఉండటంతోపాటు, భూకంపాలను కూడా తట్టుకుంటుందని భావిస్తున్నారు. ఇది 6.5 తీవ్రతతో కూడిన భూకంపాన్ని కూడా తట్టుకోగలదు. ఈ ఆలయానికి1,000 సంవత్సరాల వరకు మరమ్మతులు అవసరం లేదని అంచనా. ఈ ప్రాంతంలోని వరద రికార్డులను కూడా పరిశీలించిన ఇంజనీర్లు, భవిష్యత్తులో ఎలాంటి వరదలు రాకుండా సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. #WATCH | Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.#RamMandirPranPrathistha pic.twitter.com/kKivThGh67 — ANI (@ANI) January 22, 2024 ► ఆలయ నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణలలో ఒకటి దీని పునాది. ఫ్లై యాష్, దుమ్ము రసాయనాలతో తయారు చేయబడిన 56 పొరల కాంపాక్ట్ కాంక్రీటు మిశ్రమంతో 15 మీటర్ల మందపాటి రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీటుపై దీన్ని ఏర్పాటు చేశారు. ► 21 అడుగుల మందపాటి గ్రానైట్ పునాదితో దీన్ని మరింత పటిష్టం చేశారు. ఇది ఆలయాన్ని తేమ నుండి రక్షిస్తుంది. నిర్మాణ ప్రక్రియలో ప్రత్యేకమైన సవాళ్లు ముఖ్యంగా సెల్ఫ్-కాంపాక్ట్ కాంక్రీటు ఉష్ణోగ్రతను 18 డిగ్రీల కంటే తక్కువ పరిసర ఉష్ణోగ్రత వద్ద నిర్వహించడం. ఇందుకోసం ఆన్-సైట్ ఐస్ క్రషింగ్ ప్లాంట్లతో బయటి ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించడానికి పునాదిని రాత్రిపూట మాత్రమే నిర్మించారు. ► 150 మంది ఇంజనీర్లు, వేలాది మంది నిపుణులైన కార్మికులు ఇందుకు కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారు. 360 స్తంభాలతో నిర్మించిన రామ మందిర సముదాయం 380 అడుగుల పొడవు(తూర్పు-పశ్చిమ దిశ), 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది ► చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సలహా మేరకు ఇంజనీర్లు 15 మీటర్ల మేర మట్టిని తవ్వి పైమట్టిని తొలగించారు. ఆ తర్వాత రీ-ఇంజినీరింగ్ చేసిన మట్టితో నింపారు. రీ-ఇంజనీరింగ్ మట్టి 14 రోజులలో రాయిగా ఘనీభవిస్తుంది. ఇలా మొత్తం 47 పొరలు జాగ్రత్తగా వేశారు. ►ఆలయ నిర్మాణంలో రాయిని ఉపయోగించడంపై రూర్కీలోని CISR-సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CBRI) డైరెక్టర్ ప్రశంసించారు. ఇది ఇతర పదార్థాల కంటే ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే నిర్మాణంలో ఇనుము తుప్పు పడుతుందనే ఆందోళన కూడా ఉండదని పేర్కొన్నారు. One of my friends working with L&T posted at Ayodhya RAM mandir site sent this video of temple from inside. Absolutely amazing. Stunningly beautiful. Absolutely Divine. A symphony in stone. 👍👏🙏👍🙏🏻🙏🏻 pic.twitter.com/8Ge45FrRkn — Jandial Naresh (@JandialNaresh) January 21, 2024 మరో విశిష్టత, శ్రీరామనవమికి అద్భుత దృశ్యం ఈ ఆలయంలో CBRI రూపొందించిన ప్రత్యేకమైన నూన్ రిఫ్లెక్షన్ మరింత ఆశ్యర్యంగా నిలుస్తోంది. శ్రీరామ నవమి సమయంలో మధ్యాహ్న సమయంలో ఈ మందిరంలోని విగ్రహాల నుదుటిని సూర్యకిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పెంచుతుందని కంపెనీ చెబుతోంది. -
మేడిగడ్డపై అంత నిర్లక్ష్యమా.. మంత్రి ఉత్తమ్ సీరియస్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మేడిగడ్డ పనులపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే, మేడిగట్ట బ్యారేజ్ పనులు చేసిన ఎల్ అండ్ టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వీ దేశాయ్, ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సమీక్షలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్..‘అంత పెద్ద ప్రాజెక్ట్‌లో ఎలా నాసిరకం పనులు చేసారు. ఇంత నాణ్యత లేకుండా ఎలా చేసారని నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృథా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తపించుకోవాలని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. -
కుంగిన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ పై స్పందించిన L అండ్ T కంపెనీ
-
నష్టాల్లో హైదరాబాద్ ‘మెట్రో’ సాయం చేయండి..
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా మెట్రో రవాణా నష్టాల్లో నడుస్తోందని, ఈ పరిస్థితుల్లో తమకు సహకారం అందించాలని ఎల్అండ్ టీ ప్రతినిధులు సీఎం కె.చంద్రశేఖర్‌రావును కోరారు. కరోనా నేపథ్యంలో మెట్రో రైలు రవాణా అంశంపై చర్చించేందుకు శుక్రవారం ప్రగతి భవన్లో ఎల్అండ్టీ సంస్థ సీఈవో, ఎండీ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యం సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వారి అభ్య ర్థనపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఎల్అండ్టీ సంస్థకు ఏ మేరకు సహాయం చేయవచ్చో పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ అంశంపై నివేదికను సమర్పించాలని ఆదేశించారు. -
మౌనిక కుటుంబానికి రూ.20 లక్షలు
గాంధీఆస్పత్రి: మౌనిక కుటుంబాన్ని ఆదుకోవడానికి మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ అంగీకరించింది. అమీర్‌పేట మెట్రోస్టేషన్లో పిల్లర్ పెచ్చులూడి తలపై పడటంతో కేపీహెచ్‌బీకి చెందిన మౌనిక(24) మృతి చెందిన విషయం విదితమే. బాధితురాలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ఎల్ అండ్‌టీ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. అంతకుముందు అఖిలపక్ష నేతలు ప్రొఫెసర్ కోదండరాం, సుధాకర్, ఇందిర తదితరులు సోమవారం ఉదయం గాంధీ ఆసుపత్రికి వచ్చి మౌనిక కుటుంబసభ్యులను పరామర్శించారు. ఘటన జరిగి రోజున్నర గడిచినా మెట్రో అధికారుల నుంచి స్పందన లేకపోవడం, ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రకటన చేయకపోవడం దారుణమని విచారం వ్యక్తం చేశారు. వారు నిరసనకు దిగుతున్నట్లు సమాచారం తెలుసుకొని మధ్యాహ్నం ముగ్గురు ఎల్ అండ్ టీ అధికారులు ఆసుపత్రి మార్చురీ వద్దకు వచ్చారు. సికింద్రాబాద్ ఎల్ అండ్‌టీ కార్యాలయంలో మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులతో ఎల్ అండ్ టీ అధికారులు చర్చలు జరిపారు. గాంధీ ఆస్పత్రిలో విషాదం మౌనిక బంధువులు, కుటుంబసభ్యుల రోదనలతో గాంధీ ఆసుపత్రిలో విషాద వాతావరణం నెలకొంది. పెద్దపల్లి జిల్లా ఓదేలు మండలం గోపరపల్లి నుంచి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, మంచిర్యాల నుంచి అత్తింటివారు, బంధువులు పెద్దసంఖ్యలో సోమవారం ఉదయం ఆసుపత్రికి వచ్చారు.విగతజీవిగా పడి ఉన్న మౌనికను చూసి బోరున విలపించారు. తన భార్య మృతికి మెట్రో అధికారులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని మౌనిక భర్త హరికాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తాను, మౌనిక అమీర్‌పేట మెట్రోస్టేషన్లో దిగి కిందికి వచ్చి వర్షం కారణంగా కాసేపు నిల్చున్నామని, అంతలోనే సిమెంట్ పెచ్చులు పడి మౌనిక తలకు తీవ్ర గాయాలయ్యాయని, మెట్రోసిబ్బంది నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదని నిఖిత వివరించింది. ఎల్ అండ్ టీపై కేసు నమోదు అమీర్‌పేట: ఎల్ అండ్‌టీ సంస్థపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మౌనిక భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరిపారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే మౌనిక దుర్మరణం చెందినట్లు నిర్ధారించారు. కాగా అమీర్‌పేట మెట్రోస్టేషన్లో పిల్లర్ పెచ్చులూడి పడిన ప్రాంతాన్ని మెట్రో ఉన్నతాధికారులు పరిశీలించారు. -
ఎల్అండ్టీ భళా..!
ముంబై: ఇంజనీరింగ్, నిర్మాణ దిగ్గజం లార్సన్ అండ్ టోబ్రో (ఎల్అండ్టీ) జూన్ త్రైమాసికానికి సంబంధించి ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ (అన్ని విభాగాలు కలసి) లాభం ఏకంగా 43 శాతం పెరిగి రూ.1,472 కోట్లకు చేరింది. ఆదాయం కూడా 17 శాతం వృద్ధితో రూ.28,527 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,028 కోట్లు, ఆదాయం రూ.24,355 కోట్లుగా ఉన్నాయి. ఎన్నో అంశాల్లో కంపెనీ పనితీరు మెరుగుపడడమే ఫలితాల వృద్ధికి కారణమని కంపెనీ సీఎఫ్‌వో ఆర్ శంకర్ రామన్ పేర్కొన్నారు. ‘‘2017 జూన్ 30 వరకు ఆదాయంలో కస్టమర్ల నుంచి వసూలు చేసిన ఎక్సైజ్ డ్యూటీ కూడా కలసి ఉండేది. కానీ, 2017 జూలై 1 నుంచి ఆదాయంలో జీఎస్టీ కలవడం లేదు’’ అని రామన్ వివరించారు. నూతన ఆర్డర్లలో చక్కని వృద్ధి జూన్ త్రైమాసికంలో కంపెనీ కొత్తగా రూ.36,142 కోట్ల విలువైన ఆర్డర్లను సొంతం చేసుకుంది. ఆర్డర్లలో 37 శాతం వృద్ధి నెలకొంది. ముఖ్యంగా దేశీయ ఆర్డర్ల పరంగా చక్కని వృద్ధి ఉన్నట్టు కంపెనీ తెలిపింది. అంతర్జాతీయ ఆర్డర్ల విలువ రూ.9,404 కోట్లుగా ఉంది. అంటే మొత్తం ఆర్డర్లలో 26% అంతర్జాతీయ ఆర్డర్లు కాగా, మిగిలిన 74% దేశీయ ఆర్డర్ల వాటాయే. కన్సాలిడేటెడ్‌గా చూస్తే కంపెనీ మొత్తం ఆర్డర్ల విలువ జూన్ నాటికి రూ.2,71,732 కోట్లు. ఇందులో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 23%. ఇన్ఫ్రా, హైడ్రోకార్బన్, హెవీ ఇంజనీరింగ్ వ్యాపారాలు ఆర్డర్ల వృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించినట్టు రామన్ వివరించారు. ప్రభుత్వరంగ ఆర్డర్లలో టెండర్ల పరంగా బలమైన స్థానంలో ఉన్నట్టు చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాల కోసం స్పాన్సర్లు ఎదురు చూస్తున్నారని, పరిశ్రమకు, ఎల్అండ్టీకి బలమైన ఆర్డర్ల రాక పరంగా ఇది మంచి సానుకూల పరిణామంగా రామన్ పేర్కొన్నారు. విభాగాల వారీగా... ►ఇన్ఫ్రా వ్యాపారం నుంచి రికార్డు స్థాయిలో రూ.12,135 కోట్ల ఆదాయం సమకూరింది. ►విద్యుత్ విభాగం ఆదాయం 1,080 కోట్లు. ►హెవీ ఇంజనీరింగ్ వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయం రూ.334 కోట్లు. ►డిఫెన్స్ ఇంజనీరింగ్ పేరుతో నూతన వెర్టికల్‌ను కంపెనీ ఏర్పాటు చేసింది. ఇందులో డిఫెన్స్, ఏరోస్పేస్, షిప్ బిల్డింగ్ వ్యాపారాలు ఉంటాయి. ఈ విభాగం నుంచి ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.727 కోట్లకు చేరుకుంది. ►ఎలక్ట్రికల్, ఆటోమేషన్ విభాగం ఆదాయం 6% పెరిగి రూ.1,279 కోట్లుగా నమోదైంది. ►హైడ్రోకార్బన్ వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం రూ.3,511 కోట్లు. ►ఐటీ, టెక్నాలజీ సేవల ద్వారా వచ్చిన ఆదాయం రూ.3,324 కోట్లు. ► ఆర్థిక సేవల ఆదాయం రూ.3,058 కోట్లు. రుణాల జారీ పెరగడం, గ్రామీణ గృహ నిర్మాణ విభాగంలో వృద్ధి కలిసొచ్చింది. -
మ్యాన్ హోల్లోకి దిగి ఊపిరాడక ఇద్దరు కూలీల మృతి
-
ఉప్పల్ స్టేడియం వద్ద విషాదం
సాక్షి, హైదరాబాద్: భావి విశ్వనగరం.. భాగ్యనగరం మరో ఇద్దరు పారిశుధ్య కార్మికులను పొట్టనపెట్టుకుంది. నగరంలోని ఉప్పల్ స్టేడియం గేట్ నంబర్ 1 వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. మ్యాన్ హోల్ లోపలికి దిగిన కార్మికులు ఊపిరి ఆడకపోవడంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మ్యాన్‌హోల్ నుంచి మృతదేహాలను బయటికి తీశారు. మృతులు సంతోష్(28), విజయ్(25)లు హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సంస్థలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారని, వీరి స్వస్థలం ఒడిశా అని పోలీసులు తెలిపారు. జలమండలి వాటర్ పైప్ లైన్ నిర్మాణం నిమిత్తం సెంట్రింగ్ కర్రలు తొలగించే క్రమంలో దిగిన కార్మికులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తప్పు ఎవరిది?: రెండేళ్ల కిందట హైటెక్ సిటీ సమీపంలో మ్యాన్ హోల్ లో పడి నలుగురు కార్మికులు మృతి చెందడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పెద్ద ఎత్తున మినీ ఎయిర్‌టెక్ మిషన్లను అందుబాటులోకి తెచ్చిన సందర్భంలో ‘‘ఇక నుంచి కార్మికులు మ్యాన్ హోల్స్‌లో దిగే పరిస్థితి ఉండదు’’ అని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కాగా, బుధవారం ఉప్పల్ స్టేడియం వద్ద చోటుచేసుకున్న ఘటనలో తప్పు జలమండలిదా, ఎల్ అండ్ టీ సంస్థదా అన్నది తేలాల్సిఉంది. తోటి కార్మికుల మరణవార్త ఆ సంస్థలో పనిచేస్తోన్న మిగతావారిని కలవరపాటుకు గురిచేసంది. -
అనుకున్న సమయానికే తాత్కాలిక సచివాలయం
మంత్రి నారాయణ వెల్లడి తుళ్లూరు : ఎల్అండ్టీ సంస్థ, షాపోజీ పల్లోంజి సంస్థలు నిర్విరామంగా శ్రమిస్తూ తాత్కాలిక సచివాలయాన్ని నిర్మిస్తున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. వెలగపూడిలో జరుగుతున్న సచివాలయ నిర్మాణ పనులను శుక్రవారం నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలిసి ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ అత్యవసరంగా నిర్మించేందుకు గానూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. మూడు నెలల్లో సచివాలయం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ఒప్పందం ప్రకారం అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి పనులు పూర్తిచేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఇప్పటికే కొన్ని రోజుల వ్యవధిలోనే భూమి లోపల నిర్మాణాలు పూర్తిచేశారని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంస్థలు పనులను పరిశీలించేందుకు రెండు, మూడురోజులకోసారి వచ్చి వెళ్తున్నాయని, ముఖ్యమంత్రి రావాల్సి ఉండగా, అత్యవసర కారణాలతో రాలేకపోయారన్నారు. మంత్రి వెంట మాజీమంత్రి గల్లా అరుణకుమారి, గ్రంథి చిరంజీవి, బెజవాడ నరేంద్ర, దండమూడి మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో నుంచి ఎల్ అండ్ టీని తప్పించేందుకు కుట్ర
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జి బాలరాజులు ఆదివారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. మెట్రో ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి పదే పదే అబద్దాలు చెప్పి... వాటిని నిజాలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. దమ్ముంటే మెట్రో రైలు ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలని రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. ఎల్ అండ్ టీ సంస్థకి ఆంధ్ర రాజధానిని ఎరవేసి... ఇక్కడి మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ సంస్థను తప్పించి ఆంధ్ర రాజధానికి పంపించాలని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు విక్రయించిన భూములపై చర్చకు సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిలాంటి నాయకుల వల్లే తెలంగాణలో యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జి బాలరాజు అన్నారు. -
అలైన్మెంట్ మార్పు లేనట్టే!
* మెట్రో సమీక్షలో సీఎంకు స్పష్టం చేసిన ఎల్అండ్టీ * ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే పనులు * రెండో దశపై చిగురిస్తున్న నగరవాసుల ఆశలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్, మొజంజాహీ మార్కెట్, అసెంబ్లీ వంటి చారిత్రక ప్రదేశాల్లో భూగర్భ మార్గంలో మెట్రో పనులు చేపట్టేది లేదని, ముందుగా ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకే ముందుకు సాగుతామని ఎల్అండ్టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బుధవారం సచివాలయంలో మెట్రో పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగిన సమీక్షాసమావేశంలో ఎల్అండ్టీ సంస్థ ఉన్నతాధికారులు ఈ విషయమై సీఎంతో చర్చించినట్లు సమాచారం. ముందుగా కుదుర్చుకున్న ఒప్పం దం మేరకే నాగోల్-శిల్పారామం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా ఎలివేటెడ్(ఆకాశమార్గం) రూట్లో 72 కి లోమీటర్ల మేర పనులు చేపడతామని సీఎంకు వివరించారని, దానికి ఆయన నుంచి అభ్యంతరమేమీ వ్యక్తం కాలేదని తెలిసింది. గతంలో చారిత్రక ప్రదేశాల్లో భూగర్భ మెట్రో మార్గం ఏర్పాటుపై నిపుణుల ఆధ్వర్యంలో పరిశీలించాలని కేసీఆర్ ఎల్అండ్ టీ, హెచ్ఎంఆర్లను కోరిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం, ఎల్అండ్టీ వర్గాల మధ్య తొలిసారి సానుకూలంగా చర్చలు జరగడం విశేషం. దీంతో మెట్రో పనులకు ఎదురైన తాత్కాలిక అడ్డంకులు అన్నీ తొలగినట్లైంది. కొనసాగిన టెస్ట్ రన్.. గత రెండు రోజులుగా నిలిచిన నాగోల్-ఎన్జీఆర్ఐ(ఉప్పల్)మార్గంలో ఎలివేటెడ్ మెట్రోరైలు ప్రయోగ పరుగు బుధవారం సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు కొనసాగింది. ఇదే విషయమై ‘సాక్షి’ఎల్అండ్టీ వర్గాలను వివరణ కోరగా ఉప్పల్ మెట్రో డిపోలో ఉన్న నాలుగు రైళ్లకు 18 అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మెట్రో టెస్ట్న్క్రు అవసరమైన విద్యుత్ సరఫరాలో గత మూడురోజులుగా ఎలాంటి అంతరాయం కలగలేదని చెప్పారు. గురువారం మరోమారు టెస్ట్న్ ్రనిర్వహించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రెండోదశపై చిగురిస్తున్న ఆశలు! సీఎం కేసీఆర్ తాజా సమీక్షలో మెట్రో పరిధిని సమీప భవిష్యత్‌లో 200 కి.మీ.కి విస్తరించాలని సూచించడడంతో నగరంలో మెట్రో రెండోదశపై ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత మూడు రూట్లకు అదనంగా మహానగరం పరిధిలో మరో 15 రూట్లలో మెట్రో రైలు ప్రాజె క్టు చేపట్టాలన్న డిమాండ్లు ప్రజాప్రతినిధులు, స్థానికుల నుంచి ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు గతంలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లీ అసోసియేట్స్ సంస్థ నిర్వహించిన సమగ్ర రవాణా రంగ అధ్యయనం(సీటీఎస్)లోనూ సముచిత స్థానం కల్పించారు. అయితే ఈ ప్రతిపాదనల్లో వేటికి ఆమోదముద్ర పడుతుందో అన్న అంశం.. సమగ్ర సర్వే, ప్రభుత్వ నిర్ణయం మేరకే తేలుతుందని హెచ్ఎంఆర్ వర్గాలు స్పష్టం చేశాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆయా మార్గాల్లో త్వరలో మెట్రో రైలు మార్గం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సర్వే జరగనున్నట్లు తెలిసింది. గతంలో సీటీఎస్ అధ్యయనంలో చోటు కల్పించిన మెట్రో మార్గాలివీ.. 1.తార్నాక-కీసర ఓఆర్ఆర్ (18.23 కి.మీ.) 2.ఉప్పల్-ఘట్కేసర్ (14.06) 3.భరత్‌నగర్-దుండిగల్ ఓఆర్ఆర్(18.48) 4.జూబ్లీబస్‌స్టేషన్-శామీర్‌పేట్ (19.19) 5. హైటెక్‌సిటీ-శంషాబాద్ (36.59) 6.నాగోల్-బండ్లగూడ (26.26) 7.గోపన్‌పల్లి-బొల్లారం (31.76) 8.లక్డీకాపూల్-ఇస్నాపూర్ (36.26) 9.బొల్లారం-నారపల్లి (21.05) 10.హైటెక్‌సిటీ-కాజిపల్లి (13.07) 11.మలక్‌పేట్-కొంగర ఓఆర్ఆర్ (21.11) 12.నారపల్లి-శంషాబాద్ (28.89) 13.షేక్‌పేట్-కొల్లూరు ఓఆర్ఆర్ (20.85) 14.బీహెచ్ఈఎల్-అబ్దుల్లాపూర్‌మెట్ (19.19) 15.జూబ్లీ బస్టాండ్-శంషాబాద్ (14.12) -
మెట్రోపై ముందడుగు!
* ‘మెట్రో’ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష * ప్రత్యామ్నాయాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం * ప్రాజెక్టుకు పూర్తిగా సహకరిస్తామంటూ హామీ! సాక్షి, హైదరాబాద్: ‘మెట్రో’ ప్రతిష్టంభన వీడుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. చారిత్రక ప్రదేశాల్లో భూగర్భ మార్గం వేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడం, అది సాధ్యపడదని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ చెబుతుండటంతో ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కొంతకాలంగా నీలినీడలు కమ్ముకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నగరంలోని చారిత్రక ప్రదేశాల్లో భూగర్భ మెట్రో మార్గం ఏర్పాటుతో పాటు ఇతరత్రా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించాల్సిందిగా హైదరాబాద్ మెట్రో రైలు అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీనిపై నిపుణుల ఆధ్వర్యంలో సమగ్ర అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా తనకు నివేదిక సమర్పించాలని నిర్దేశించారు. మెట్రో పనులపై ఆయన మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా సుల్తాన్‌బజార్, మొజంజాహీ మార్కెట్, అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రాంతాల్లో భూగర్భ మెట్రో మార్గం నిర్మాణం సాధ్యాసాధ్యాలు, ఎదురయ్యే సమస్యలు, ఇతర ప్రత్యామ్నాయాలను సమగ్రంగా నివేదించాలని సీఎం ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించబోదని, గడువులోగా పనులను పూర్తి చేసేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు కూడా సమాచారం. అలాగే ఈ సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు లీక్ చేయరాదని అధికారులను ఆయన గట్టిగా ఆదేశించినట్టు తెలిసింది. ఈ విషయమై మెట్రో నిర్మాణం చేపట్టిన ఎల్అండ్టీ మెట్రో రైలు సంస్థ మేనేజింగ్ డెరైక్టర్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా తాను అమెరికాలో ఉన్నానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అధికారుల సమావేశం విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. వివాదం పూర్వాపరాలివీ... నగరంలో రూ.15 వేల కోట్ల అంచనా వ్యయంతో 72 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గం పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. చారిత్రక ప్రదేశాల్లో భూగర్భ మార్గం వేయాలన్న సూచనపై విముఖత వ్యక్తం చేస్తూ సర్కారుకు ఎల్అండ్టీ రాసిన లేఖ కలకలం సృష్టించింది. 2010లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రంలో పేర్కొన్న పనులనే చేపడతామని, ఎల్అండ్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పాయి. నాటి ఒప్పందంలో భూగర్భ మెట్రో అంశం లేదని గుర్తు చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే హెచ్ఎంఆర్ అధికారులతో మంగళవారం సీఎం నేరుగా సమావేశమయ్యారు. నగర చరిత్ర, సంస్కృతులకు భంగం కలిగించని రీతిలో మెట్రో మార్గాన్ని నిర్మించాలని తాము భావిస్తున్నట్టు అధికారులతో పేర్కొన్నారు. బలవంతంగా భూగర్భ మెట్రో పనులు చేపట్టాల్సిందేనని తాము ఆదేశించడం లేదన్నారు. ప్రత్యామ్నాయాలను నిశితంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని, ఆ తర్వాతే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీఎం చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది.