మ్యాన్‌హోల్ నుంచి వెలికితీసిన సంతోష్, విజయ్‌ల మృతదేహాలు
సాక్షి, హైదరాబాద్: భావి విశ్వనగరం.. భాగ్యనగరం మరో ఇద్దరు పారిశుధ్య కార్మికులను పొట్టనపెట్టుకుంది. నగరంలోని ఉప్పల్ స్టేడియం గేట్ నంబర్ 1 వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. మ్యాన్ హోల్ లోపలికి దిగిన కార్మికులు ఊపిరి ఆడకపోవడంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మ్యాన్‌హోల్ నుంచి మృతదేహాలను బయటికి తీశారు. మృతులు సంతోష్(28), విజయ్(25)లు హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సంస్థలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారని, వీరి స్వస్థలం ఒడిశా అని పోలీసులు తెలిపారు. జలమండలి వాటర్ పైప్ లైన్ నిర్మాణం నిమిత్తం సెంట్రింగ్ కర్రలు తొలగించే క్రమంలో
దిగిన కార్మికులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
తప్పు ఎవరిది?: రెండేళ్ల కిందట హైటెక్ సిటీ సమీపంలో మ్యాన్ హోల్ లో పడి నలుగురు కార్మికులు మృతి చెందడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పెద్ద ఎత్తున మినీ ఎయిర్‌టెక్ మిషన్లను అందుబాటులోకి తెచ్చిన సందర్భంలో ‘‘ఇక నుంచి కార్మికులు మ్యాన్ హోల్స్‌లో దిగే పరిస్థితి ఉండదు’’ అని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కాగా, బుధవారం ఉప్పల్ స్టేడియం వద్ద చోటుచేసుకున్న ఘటనలో తప్పు జలమండలిదా, ఎల్ అండ్ టీ సంస్థదా అన్నది తేలాల్సిఉంది. తోటి కార్మికుల మరణవార్త ఆ సంస్థలో పనిచేస్తోన్న మిగతావారిని కలవరపాటుకు గురిచేసంది.
Comments
Please login to add a commentAdd a comment