
టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్‌కు భారీ షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో (ఉప్పల్ స్టేడియం) నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరును తొలగించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతూ ఈ మేరకు తీర్పునిచ్చారు.
అజారుద్దీన్ హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉన్న కాలంలో నార్త్ స్టాండ్‌కు తన పేరును పెట్టుకున్నాడు. ఈ నిర్ణయం చెల్లదని జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టం చేశారు. ఈ నిర్ణయంలో విరుద్ధ ప్రయోజనాలున్నాయని తెలిపారు. వెంటనే నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగించాలని హెచ్‌సీఏను ఆదేశించారు. టికెట్లపై ఇక నుంచి అజారుద్దీన్ పేరును ముద్రించరాదని తేల్చి చెప్పారు.
కాగా, 2019లో అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉండగా.. ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు తన పేరును పెట్టుకున్నాడు. ఆ ఏడాది డిసెంబర్ 7న భారత దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ స్టాండ్‌ను ప్రారంభించారు. అజారుద్దీన్ భారత్ తరఫున 99 టెస్ట్‌లు, 334 వన్డేలు ఆడి మొత్తంగా 29 సెంచరీలు చేశాడు.