ముంబై: ఇంజనీరింగ్, నిర్మాణ దిగ్గజం లార్సన్ అండ్ టోబ్రో (ఎల్‌అండ్‌టీ) జూన్ త్రైమాసికానికి సంబంధించి ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ (అన్ని విభాగాలు కలసి) లాభం ఏకంగా 43 శాతం పెరిగి రూ.1,472 కోట్లకు చేరింది. ఆదాయం కూడా 17 శాతం వృద్ధితో రూ.28,527 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,028 కోట్లు, ఆదాయం రూ.24,355 కోట్లుగా ఉన్నాయి. ఎన్నో అంశాల్లో కంపెనీ పనితీరు మెరుగుపడడమే ఫలితాల వృద్ధికి కారణమని కంపెనీ సీఎఫ్‌వో ఆర్ శంకర్ రామన్ పేర్కొన్నారు. ‘‘2017 జూన్ 30 వరకు ఆదాయంలో కస్టమర్ల నుంచి వసూలు చేసిన ఎక్సైజ్ డ్యూటీ కూడా కలసి ఉండేది. కానీ, 2017 జూలై 1 నుంచి ఆదాయంలో జీఎస్టీ కలవడం లేదు’’ అని రామన్ వివరించారు.
నూతన ఆర్డర్లలో చక్కని వృద్ధి
జూన్ త్రైమాసికంలో కంపెనీ కొత్తగా రూ.36,142 కోట్ల విలువైన ఆర్డర్లను సొంతం చేసుకుంది. ఆర్డర్లలో 37 శాతం వృద్ధి నెలకొంది. ముఖ్యంగా దేశీయ ఆర్డర్ల పరంగా చక్కని వృద్ధి ఉన్నట్టు కంపెనీ తెలిపింది. అంతర్జాతీయ ఆర్డర్ల విలువ రూ.9,404 కోట్లుగా ఉంది. అంటే మొత్తం ఆర్డర్లలో 26% అంతర్జాతీయ ఆర్డర్లు కాగా, మిగిలిన 74% దేశీయ ఆర్డర్ల వాటాయే. కన్సాలిడేటెడ్‌గా చూస్తే కంపెనీ మొత్తం ఆర్డర్ల విలువ జూన్ నాటికి రూ.2,71,732 కోట్లు. ఇందులో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 23%. ఇన్‌ఫ్రా, హైడ్రోకార్బన్, హెవీ ఇంజనీరింగ్ వ్యాపారాలు ఆర్డర్ల వృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించినట్టు రామన్ వివరించారు. ప్రభుత్వరంగ ఆర్డర్లలో టెండర్ల పరంగా బలమైన స్థానంలో ఉన్నట్టు చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాల కోసం స్పాన్సర్లు ఎదురు చూస్తున్నారని, పరిశ్రమకు, ఎల్‌అండ్‌టీకి బలమైన ఆర్డర్ల రాక పరంగా ఇది మంచి సానుకూల పరిణామంగా రామన్ పేర్కొన్నారు.
విభాగాల వారీగా...
►ఇన్‌ఫ్రా వ్యాపారం నుంచి రికార్డు స్థాయిలో రూ.12,135 కోట్ల ఆదాయం సమకూరింది.
►విద్యుత్ విభాగం ఆదాయం 1,080 కోట్లు.
►హెవీ ఇంజనీరింగ్ వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయం రూ.334 కోట్లు.
►డిఫెన్స్ ఇంజనీరింగ్ పేరుతో నూతన వెర్టికల్‌ను కంపెనీ ఏర్పాటు చేసింది. ఇందులో డిఫెన్స్, ఏరోస్పేస్, షిప్ బిల్డింగ్ వ్యాపారాలు ఉంటాయి. ఈ విభాగం నుంచి ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.727 కోట్లకు చేరుకుంది.
►ఎలక్ట్రికల్, ఆటోమేషన్ విభాగం ఆదాయం 6% పెరిగి రూ.1,279 కోట్లుగా నమోదైంది.
►హైడ్రోకార్బన్ వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం రూ.3,511 కోట్లు.
►ఐటీ, టెక్నాలజీ సేవల ద్వారా వచ్చిన ఆదాయం రూ.3,324 కోట్లు.
► ఆర్థిక సేవల ఆదాయం రూ.3,058 కోట్లు. రుణాల జారీ పెరగడం, గ్రామీణ గృహ నిర్మాణ విభాగంలో వృద్ధి కలిసొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment