అలైన్‌మెంట్ మార్పు లేనట్టే!
* మెట్రో సమీక్షలో సీఎంకు స్పష్టం చేసిన ఎల్‌అండ్‌టీ
* ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే పనులు
* రెండో దశపై చిగురిస్తున్న నగరవాసుల ఆశలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్, మొజంజాహీ మార్కెట్, అసెంబ్లీ వంటి చారిత్రక ప్రదేశాల్లో భూగర్భ మార్గంలో మెట్రో పనులు చేపట్టేది లేదని, ముందుగా ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకే ముందుకు సాగుతామని ఎల్‌అండ్‌టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బుధవారం సచివాలయంలో మెట్రో పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగిన సమీక్షాసమావేశంలో ఎల్‌అండ్‌టీ సంస్థ ఉన్నతాధికారులు ఈ విషయమై సీఎంతో చర్చించినట్లు సమాచారం.
ముందుగా కుదుర్చుకున్న ఒప్పం దం మేరకే నాగోల్-శిల్పారామం, ఎల్‌బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా ఎలివేటెడ్(ఆకాశమార్గం) రూట్లో 72 కి లోమీటర్ల మేర పనులు చేపడతామని సీఎంకు వివరించారని, దానికి ఆయన నుంచి అభ్యంతరమేమీ వ్యక్తం కాలేదని తెలిసింది. గతంలో చారిత్రక ప్రదేశాల్లో భూగర్భ మెట్రో మార్గం ఏర్పాటుపై నిపుణుల ఆధ్వర్యంలో పరిశీలించాలని కేసీఆర్ ఎల్‌అండ్ టీ, హెచ్‌ఎంఆర్‌లను కోరిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం, ఎల్‌అండ్‌టీ వర్గాల మధ్య తొలిసారి సానుకూలంగా చర్చలు జరగడం విశేషం. దీంతో మెట్రో పనులకు ఎదురైన తాత్కాలిక అడ్డంకులు అన్నీ తొలగినట్లైంది.
కొనసాగిన టెస్ట్ రన్..
గత రెండు రోజులుగా నిలిచిన నాగోల్-ఎన్‌జీఆర్‌ఐ(ఉప్పల్)మార్గంలో ఎలివేటెడ్ మెట్రోరైలు ప్రయోగ పరుగు బుధవారం సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు కొనసాగింది. ఇదే విషయమై ‘సాక్షి’ఎల్‌అండ్‌టీ వర్గాలను వివరణ కోరగా ఉప్పల్ మెట్రో డిపోలో ఉన్న నాలుగు రైళ్లకు 18 అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మెట్రో టెస్ట్న్‌క్రు అవసరమైన విద్యుత్ సరఫరాలో గత మూడురోజులుగా ఎలాంటి అంతరాయం కలగలేదని చెప్పారు. గురువారం మరోమారు టెస్ట్న్ ్రనిర్వహించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
రెండోదశపై చిగురిస్తున్న ఆశలు!
సీఎం కేసీఆర్ తాజా సమీక్షలో మెట్రో పరిధిని సమీప భవిష్యత్‌లో 200 కి.మీ.కి విస్తరించాలని సూచించడడంతో నగరంలో మెట్రో రెండోదశపై ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత మూడు రూట్లకు అదనంగా మహానగరం పరిధిలో మరో 15 రూట్లలో మెట్రో రైలు ప్రాజె క్టు చేపట్టాలన్న డిమాండ్లు ప్రజాప్రతినిధులు, స్థానికుల నుంచి ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు గతంలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో లీ అసోసియేట్స్ సంస్థ నిర్వహించిన సమగ్ర రవాణా రంగ అధ్యయనం(సీటీఎస్)లోనూ సముచిత స్థానం కల్పించారు. అయితే ఈ ప్రతిపాదనల్లో వేటికి ఆమోదముద్ర పడుతుందో అన్న అంశం.. సమగ్ర సర్వే, ప్రభుత్వ నిర్ణయం మేరకే తేలుతుందని హెచ్‌ఎంఆర్ వర్గాలు స్పష్టం చేశాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆయా మార్గాల్లో త్వరలో మెట్రో రైలు మార్గం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సర్వే జరగనున్నట్లు తెలిసింది.
గతంలో సీటీఎస్ అధ్యయనంలో చోటు కల్పించిన మెట్రో మార్గాలివీ..
1.తార్నాక-కీసర ఓఆర్‌ఆర్ (18.23 కి.మీ.)
2.ఉప్పల్-ఘట్‌కేసర్ (14.06)
3.భరత్‌నగర్-దుండిగల్ ఓఆర్‌ఆర్(18.48)
4.జూబ్లీబస్‌స్టేషన్-శామీర్‌పేట్ (19.19)
5. హైటెక్‌సిటీ-శంషాబాద్ (36.59)
6.నాగోల్-బండ్లగూడ (26.26)
7.గోపన్‌పల్లి-బొల్లారం (31.76)
8.లక్డీకాపూల్-ఇస్నాపూర్ (36.26)
9.బొల్లారం-నారపల్లి (21.05)
10.హైటెక్‌సిటీ-కాజిపల్లి (13.07)
11.మలక్‌పేట్-కొంగర ఓఆర్‌ఆర్ (21.11)
12.నారపల్లి-శంషాబాద్ (28.89)
13.షేక్‌పేట్-కొల్లూరు ఓఆర్‌ఆర్ (20.85)
14.బీహెచ్‌ఈఎల్-అబ్దుల్లాపూర్‌మెట్ (19.19)
15.జూబ్లీ బస్టాండ్-శంషాబాద్ (14.12)