ఈ రూట్‌లో రోడ్డు విస్తరణ పనులు ముమ్మరం
నెలాఖరులోగా ప్రభావిత ఆస్తులకు అవార్డులు
తదనంతరం పరిహారం చెల్లింపు
పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ వాసుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఎన్నో ఏళ్ల తర్జనభర్జనలు..ప్రభుత్వ నిర్ణయాల అనంతరం ఇక్కడ మెట్రో రైలు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు చారిత్రక పాతబస్తీలో మెట్రో పనులు మొదలయ్యాయి. మెట్రో రూట్‌లో రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మెట్రో రెండో దశలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ లైన్ నిర్మించనున్న సంగతి తెలిసిందే.
ఈ రూట్‌లో పాతబస్తీలో రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణ పనులను సకాలంలో పూర్తి చేసి మెట్రో నిర్మాణ పనులను పట్టాలెక్కించేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌మెట్రో రైల్ కార్యాచరణను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పనుల పురోగతిని తెలియజేస్తున్నట్లు హెచ్‌ఏఎంఆర్‌ఎల్ ఎండీ ఎనీ్వఎస్‌రెడ్డి చెప్పారు. సుమారు ఏడున్నర కిలోమీటర్ల నిడివి గల ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట మార్గంలో 1100 ఆస్తులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఆస్తుల సేకరణ పనులు వేగవంతమయ్యాయన్నారు.
త్వరలో పరిహారం చెల్లింపు...
భూసేకరణ చట్టానికి అనుగుణంగా సేకరించనున్న ఆస్తులకు పరిహారం చెల్లించేందుకు హెచ్‌ఏఎంఎల్ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు గుర్తించిన 1100 ఆస్తులలో 900 ఆస్తులకు సంబంధించిన రిక్విజిషన్‌ను మెట్రోరైల్ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈ మేరకు ఆయన వాటిలో 800 ఆస్తులకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ వివిద దఫాలుగా విడుదల చేశారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులలో 400 ఆస్తులకు ప్రిలిమినరీ డిక్లరేషన్‌ను కూడా జారీ చేశారు. వాటిలో 200 ఆస్తుల పరిహారానికి సంబంధించిన అవార్డులను ఈ నెలాఖరులోగా ప్రకటించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ఆ తర్వాత సేకరించిన వాటికి పరిహారం చెల్లించి కూల్చివేతలు చేపట్టనున్నారు. దీంతో మెట్రో రైలు మార్గ నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. ఈ మార్గంలో ఉన్న వివిధ నిర్మాణాలు, ప్రభావిత ఆస్తుల యాజమానులతో సానుకూలంగా చర్చించి, వాటిని భూసేకరణ చట్టం ప్రకారం సేకరించి రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్టు ఎండీ వివరించారు. రోడ్డు విస్తరణలోను, మెట్రో నిర్మాణంలోను మతపరమైన, చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సమర్ధవంతమైన ఇంజినీరింగ్ పరిష్కారాలతో పరిరక్షిస్తుస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.
పర్యాటకంగా మరింత ఆకర్షణ...
మెట్రో రైల్ రాకతో పాత నగరం మరింత ఆకర్షణను సంతరించుకోనుంది. ఇప్పటికే జాతీ య, అంతర్జాతీయ పర్యాటకులు చార్మినార్ సహా పలు ప్రాంతాలను సందర్శించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న సంగతి తెలిసిందే. మెట్రో అందుబాటులోకి వస్తే మరింత ఎక్కువ మంది పర్యాటకులు పాతబస్తీని సందర్శించే అవకాశం ఉంది. అటు నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి, ఇటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికులు, పర్యాటకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాతబస్తీకి రాకపోకలు సాగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment