Metro work
-
Hyderabad: పాత బస్తీలో మెట్రోరైలు పనులు షురూ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ వాసుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఎన్నో ఏళ్ల తర్జనభర్జనలు..ప్రభుత్వ నిర్ణయాల అనంతరం ఇక్కడ మెట్రో రైలు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు చారిత్రక పాతబస్తీలో మెట్రో పనులు మొదలయ్యాయి. మెట్రో రూట్లో రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మెట్రో రెండో దశలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ లైన్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ రూట్లో పాతబస్తీలో రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణ పనులను సకాలంలో పూర్తి చేసి మెట్రో నిర్మాణ పనులను పట్టాలెక్కించేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌మెట్రో రైల్ కార్యాచరణను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పనుల పురోగతిని తెలియజేస్తున్నట్లు హెచ్‌ఏఎంఆర్‌ఎల్ ఎండీ ఎనీ్వఎస్‌రెడ్డి చెప్పారు. సుమారు ఏడున్నర కిలోమీటర్ల నిడివి గల ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట మార్గంలో 1100 ఆస్తులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఆస్తుల సేకరణ పనులు వేగవంతమయ్యాయన్నారు. త్వరలో పరిహారం చెల్లింపు... భూసేకరణ చట్టానికి అనుగుణంగా సేకరించనున్న ఆస్తులకు పరిహారం చెల్లించేందుకు హెచ్ఏఎంఎల్ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు గుర్తించిన 1100 ఆస్తులలో 900 ఆస్తులకు సంబంధించిన రిక్విజిషన్ను మెట్రోరైల్ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈ మేరకు ఆయన వాటిలో 800 ఆస్తులకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ వివిద దఫాలుగా విడుదల చేశారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులలో 400 ఆస్తులకు ప్రిలిమినరీ డిక్లరేషన్‌ను కూడా జారీ చేశారు. వాటిలో 200 ఆస్తుల పరిహారానికి సంబంధించిన అవార్డులను ఈ నెలాఖరులోగా ప్రకటించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత సేకరించిన వాటికి పరిహారం చెల్లించి కూల్చివేతలు చేపట్టనున్నారు. దీంతో మెట్రో రైలు మార్గ నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. ఈ మార్గంలో ఉన్న వివిధ నిర్మాణాలు, ప్రభావిత ఆస్తుల యాజమానులతో సానుకూలంగా చర్చించి, వాటిని భూసేకరణ చట్టం ప్రకారం సేకరించి రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్టు ఎండీ వివరించారు. రోడ్డు విస్తరణలోను, మెట్రో నిర్మాణంలోను మతపరమైన, చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సమర్ధవంతమైన ఇంజినీరింగ్ పరిష్కారాలతో పరిరక్షిస్తుస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. పర్యాటకంగా మరింత ఆకర్షణ... మెట్రో రైల్ రాకతో పాత నగరం మరింత ఆకర్షణను సంతరించుకోనుంది. ఇప్పటికే జాతీ య, అంతర్జాతీయ పర్యాటకులు చార్మినార్ సహా పలు ప్రాంతాలను సందర్శించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న సంగతి తెలిసిందే. మెట్రో అందుబాటులోకి వస్తే మరింత ఎక్కువ మంది పర్యాటకులు పాతబస్తీని సందర్శించే అవకాశం ఉంది. అటు నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి, ఇటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికులు, పర్యాటకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాతబస్తీకి రాకపోకలు సాగించనున్నారు. -
ఓలిఫెంటో బ్రిడ్జి వద్ద పూర్తైన మెట్రో
-
నాంపల్లి వద్ద ట్రాఫిక్ మళ్లింపు
నాంపల్లి టీ జంక్షన్ వద్ద జరుగుతున్న మెట్రో రైలు పనుల కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ట్రాఫిక్ అడిషన్ కమిషనర్ సూచించారు. శుక్రవారం నుంచి ఏడు రోజుల పాటు మెట్రో పనులు జరగనున్నాయని చెప్పారు. పనుల కారణంగా ఏర్పాటు చేసిన మార్గం వెడల్పు తక్కువగా ఉండటంతో వాహనాల రాకపోకలు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ కారణంగా వాహనదారులకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాహనచోదకులు ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. కమిషనర్ వివరించిన ప్రత్యామ్నాయ మార్గాల వివరాలు ఇలా ఉన్నాయి. 1. ఎంజే మార్కెట్ వైపు నుంచి నాంపల్లి టీ జంక్షన్ కు వచ్చే వాహనాలను తాజ్ ఐలాండ్, ఏక్ మినార్ మసీదు క్రాస్ రోడ్స్, నాంపల్లి రైల్వేస్టేషన్, దుర్గా భవాని హోటల్ ల మీదుగా చాపెల్ రోడ్డుకు మళ్లిస్తారు. 2. జీపీఓ, అబిడ్స్, చాపెల్ రోడ్డుకు వెళ్లడానికి వచ్చే వాహనాలను తాజ్ ఐలాండ్, ఏక్ మినార్ మసీదు క్రాస్ రోడ్స్, నాంపల్లి రైల్వేస్టేషన్, దుర్గా భవాని హోటల్ ల మీదుగా చాపెల్ రోడ్డుకు మళ్లిస్తారు. 3. బజార్ ఘాట్ నుంచి వచ్చే వాహనాలను కూడా చాపెల్ రోడ్డుకు మళ్లిస్తారు. 4. జీపీఓ, అబిడ్స్ ల నుంచి వచ్చే వాహనాలను(ఆర్టీసీ బస్సులకు మినహాయింపు) హైదరాబాద్ కలెక్టరేట్ మీదుగా చిరాగ్ అలీ లైన్ కు మళ్లిస్తారు. -
అలైన్మెంట్ మార్పు లేనట్టే!
* మెట్రో సమీక్షలో సీఎంకు స్పష్టం చేసిన ఎల్అండ్టీ * ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే పనులు * రెండో దశపై చిగురిస్తున్న నగరవాసుల ఆశలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్, మొజంజాహీ మార్కెట్, అసెంబ్లీ వంటి చారిత్రక ప్రదేశాల్లో భూగర్భ మార్గంలో మెట్రో పనులు చేపట్టేది లేదని, ముందుగా ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకే ముందుకు సాగుతామని ఎల్అండ్టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బుధవారం సచివాలయంలో మెట్రో పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగిన సమీక్షాసమావేశంలో ఎల్అండ్టీ సంస్థ ఉన్నతాధికారులు ఈ విషయమై సీఎంతో చర్చించినట్లు సమాచారం. ముందుగా కుదుర్చుకున్న ఒప్పం దం మేరకే నాగోల్-శిల్పారామం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా ఎలివేటెడ్(ఆకాశమార్గం) రూట్లో 72 కి లోమీటర్ల మేర పనులు చేపడతామని సీఎంకు వివరించారని, దానికి ఆయన నుంచి అభ్యంతరమేమీ వ్యక్తం కాలేదని తెలిసింది. గతంలో చారిత్రక ప్రదేశాల్లో భూగర్భ మెట్రో మార్గం ఏర్పాటుపై నిపుణుల ఆధ్వర్యంలో పరిశీలించాలని కేసీఆర్ ఎల్అండ్ టీ, హెచ్ఎంఆర్లను కోరిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం, ఎల్అండ్టీ వర్గాల మధ్య తొలిసారి సానుకూలంగా చర్చలు జరగడం విశేషం. దీంతో మెట్రో పనులకు ఎదురైన తాత్కాలిక అడ్డంకులు అన్నీ తొలగినట్లైంది. కొనసాగిన టెస్ట్ రన్.. గత రెండు రోజులుగా నిలిచిన నాగోల్-ఎన్జీఆర్ఐ(ఉప్పల్)మార్గంలో ఎలివేటెడ్ మెట్రోరైలు ప్రయోగ పరుగు బుధవారం సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు కొనసాగింది. ఇదే విషయమై ‘సాక్షి’ఎల్అండ్టీ వర్గాలను వివరణ కోరగా ఉప్పల్ మెట్రో డిపోలో ఉన్న నాలుగు రైళ్లకు 18 అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మెట్రో టెస్ట్న్క్రు అవసరమైన విద్యుత్ సరఫరాలో గత మూడురోజులుగా ఎలాంటి అంతరాయం కలగలేదని చెప్పారు. గురువారం మరోమారు టెస్ట్న్ ్రనిర్వహించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రెండోదశపై చిగురిస్తున్న ఆశలు! సీఎం కేసీఆర్ తాజా సమీక్షలో మెట్రో పరిధిని సమీప భవిష్యత్‌లో 200 కి.మీ.కి విస్తరించాలని సూచించడడంతో నగరంలో మెట్రో రెండోదశపై ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత మూడు రూట్లకు అదనంగా మహానగరం పరిధిలో మరో 15 రూట్లలో మెట్రో రైలు ప్రాజె క్టు చేపట్టాలన్న డిమాండ్లు ప్రజాప్రతినిధులు, స్థానికుల నుంచి ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు గతంలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లీ అసోసియేట్స్ సంస్థ నిర్వహించిన సమగ్ర రవాణా రంగ అధ్యయనం(సీటీఎస్)లోనూ సముచిత స్థానం కల్పించారు. అయితే ఈ ప్రతిపాదనల్లో వేటికి ఆమోదముద్ర పడుతుందో అన్న అంశం.. సమగ్ర సర్వే, ప్రభుత్వ నిర్ణయం మేరకే తేలుతుందని హెచ్ఎంఆర్ వర్గాలు స్పష్టం చేశాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆయా మార్గాల్లో త్వరలో మెట్రో రైలు మార్గం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సర్వే జరగనున్నట్లు తెలిసింది. గతంలో సీటీఎస్ అధ్యయనంలో చోటు కల్పించిన మెట్రో మార్గాలివీ.. 1.తార్నాక-కీసర ఓఆర్ఆర్ (18.23 కి.మీ.) 2.ఉప్పల్-ఘట్కేసర్ (14.06) 3.భరత్‌నగర్-దుండిగల్ ఓఆర్ఆర్(18.48) 4.జూబ్లీబస్‌స్టేషన్-శామీర్‌పేట్ (19.19) 5. హైటెక్‌సిటీ-శంషాబాద్ (36.59) 6.నాగోల్-బండ్లగూడ (26.26) 7.గోపన్‌పల్లి-బొల్లారం (31.76) 8.లక్డీకాపూల్-ఇస్నాపూర్ (36.26) 9.బొల్లారం-నారపల్లి (21.05) 10.హైటెక్‌సిటీ-కాజిపల్లి (13.07) 11.మలక్‌పేట్-కొంగర ఓఆర్ఆర్ (21.11) 12.నారపల్లి-శంషాబాద్ (28.89) 13.షేక్‌పేట్-కొల్లూరు ఓఆర్ఆర్ (20.85) 14.బీహెచ్ఈఎల్-అబ్దుల్లాపూర్‌మెట్ (19.19) 15.జూబ్లీ బస్టాండ్-శంషాబాద్ (14.12) -
వివాదాల్లో మెట్రో పనులు!
బేగంపేట్ కంట్రీక్లబ్ భవంతి కూల్చివేతకు నోటీసులు అనుమానాలు వ్యక్తం చేస్తోన్న యాజమాన్యం డీపీఆర్ ఉల్లంఘనలపై ఆందోళన హెచ్ఎంఆర్, ఎల్అండ్టీల నిర్వాకంపై బాధిత సంస్థ న్యాయ పోరాటం సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో రైలు పనులపై వివాదాలు ముసురుకుంటున్నాయి. తాజాగా బేగంపేట్‌లోని కంట్రీక్లబ్ గ్లోబల్ కార్పొరేట్ కార్యాలయం కూల్చివేతపై హెచ్ఎంఆర్ జారీ చేసిన నోటీసు వివాదానికి కేంద్రబిందువవుతోంది. మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 2005లో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఉల్లంఘిస్తూ మెట్రో స్టేషన్ల నిర్మాణం చేపట్టడంపై బాధితులు ఆక్రోషిస్తున్నారు. అప్పట్లో కంట్రీక్లబ్ గ్లోబల్ కార్పొరేట్ కార్యాలయం నిర్మాణానికి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) జారీ చేసిన హెచ్ఎంఆర్ వర్గాలు.. తాజాగా ఈ భవంతి కూల్చివేతకు పత్రికా ప్రకటన జారీచేయడంతో పాటు, జూలై 2013లో తమ సంస్థకు నోటీసు జారీ చేయడం దారుణమని కంట్రీక్లబ్ సీఎండీరాజీవ్రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బేగంపేట్ రైల్వే స్టేషన్, తాజాగా నిర్మించనున్న మెట్రో స్టేషన్ అనుసంధానానికి అవసరమైన ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్నా.. తమ సంస్థను లక్ష్యంగా చేసుకొని కూల్చివేతకు నోటీసులివ్వడం అన్యాయమన్నారు. తరచూ మెట్రో అలైన్మెంట్ మార్పడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొంటున్నారు. ఉల్లంఘనలు ఇవీ.. నాగోల్-శిల్పారామం మెట్రో కారిడార్ పరిధిలోని బేగంపేట్ రైల్వేస్టేషన్‌కు ఆనుకుని మెట్రో స్టేషన్ నెం.10 పూర్తిగా ప్రభు త్వ స్థలంలోనే నిర్మిస్తామని 2005లో హెచ్ఎంఆర్ వర్గాలు డీపీఆర్‌లో పేర్కొన్నాయి. వాస్తవంగా మెట్రో స్టేషన్ నిర్మాణం, బేగంపేట్ రైల్వేస్టేషన్ అనుసంధానానికి (ఇంటిగ్రేషన్) అవసరమైన ప్రభుత్వ ఖాళీ స్థలం కూడా ఈప్రాంతంలో చాలినంత ఉంది. కానీ హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ వర్గాలు కంట్రీక్లబ్ గ్లోబల్ కార్పొరేట్ కార్యాలయానికి చెందిన ఆరు అంతస్తుల భవంతిఉన్న ప్రాంగణంలో 2637.76 చదరపు మీటర్ల స్థలాన్ని సేకరించేందుకు 28.6.2013లో కంట్రీక్లబ్ యాజమాన్యానికి నోటీసు జారీచేయడం, పత్రికా ప్రకటన విడుదల చేయడంపై సదరు సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. క్లబ్ నెలకొన్న ప్రాంగణంలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని, క్లబ్ ప్రాంగణంలో జోక్యం చేసుకోరాదని ఆదేశిస్తూ స్టే ఉత్తర్వులిచ్చింది. కానీ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి అదే నెలలో కంట్రీక్లబ్ ప్రధాన ద్వారం వద్ద ప్రహరీని కూల్చివేయడంతోపాటు ట్రాన్స్ఫార్మర్ను హెచ్ఎంఆర్ వర్గాలు తొలగించడం కోర్టు ధిక్కారమేనని కంట్రీ క్లబ్ యాజమాన్యం ఆరోపిస్తోంది. మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, ఇప్పటికే మెట్రో ట్రాక్ నిర్మాణానికి సంస్థకు చెందిన రూ.35 కోట్లు విలువ చేసే 1700 చదరపు అడుగుల స్థలాన్ని కూడా తాము కోల్పోయామని క్లబ్ యాజమాన్యం చెబుతోంది. మెట్రో పనులు చేపట్టేందుకు 90 శాతం రైట్ ఆఫ్‌వే (వాహనాల రాకపోకలకు వీలుగామార్గం) ఉన్నపుడు మాత్రమే పనులు చేపట్టాలని సమగ్ర ప్రాజెక్టు నివేదికలో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం పనులు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారని పేర్కొంది. ప్రస్తుత బేగంపేట్ రైల్వే స్టేషన్ బ్రిడ్జి సెక్షన్ ప్రాంగణంలో ఎలివేటెడ్ మెట్రో స్టేషన్ నిర్మాణానికి తమ వద్ద నుంచి హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ సంస్థలు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ ఏడాది జనవరిలో 21న తమకు రాతపూర్వకంగా తెలిపారని కంట్రీక్లబ్ యాజమాన్యం చెబుతోంది. అయినా, ఈ ప్రాంతంలో మెట్రో పనులకు ఆగమేఘాలపై సన్నాహాలు చేయడంపై అనుమానం వ్యక్తం చేస్తోంది. పది దేశాల్లోని 20 లక్షల మంది వినియోగదారులకు సేవలందిచేందుకు ఉద్దేశించిన గ్లోబల్ కార్పొరేట్ కార్యాలయాన్ని లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆరు అంతస్తుల్లో నిర్మించామని, ఇందులో వెయ్యి మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపింది. ఈ భవంతి కూల్చివేత వల్ల తమ క్లబ్ పరిపాలన స్తంభించిపోతుందని సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. డీపీఆర్ గుట్టు వీడదా..? మెట్రో ప్రాజెక్టు నిర్మాణంపై డీపీఆర్ బహిర్గతం చేయాలంటూ కంట్రీక్లబ్ యాజమాన్యం ఈ ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తు చేసింది. దీనికి స్పందనగా హెచ్ఎంఆర్ సంస్థ ఫిబ్రవరి 19న రాత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో.. ‘మెట్రో సమగ్ర ప్రాజెక్టు నివేదిక తమ మేధోసంపద (ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ)’ అంటూ స్పష్టం చేయడం విమర్శలకు తావిస్తోంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై మహానగరాల మెట్రోరైలు ప్రాజెక్టు నివేదికలు ఆన్లైన్లో దేశంలో ప్రతి పౌరుడికీ అందుబాటులో ఉండగా.. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నివేదికను బహిర్గతం చేయడానికి అభ్యంతరం ఏంటని సదరు సంస్థ ప్రశ్నిస్తోంది. డీపీఆర్‌ను గుట్టుగా ఉంచడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపిస్తోంది. పదేపదే అలైన్మెంట్ మార్చడం, ప్రైవేటు వ్యక్తుల ఆస్తులకు నష్టం కలిగిస్తున్న హెచ్ఎంఆర్, ఎల్అండ్టీల వైఖరి ప్రశ్నార్థకంగా మారుతోందని ఆరోపిస్తోంది. సీబీ‘ఐ’ వేయాల్సిందే.. మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని మేం వ్యతిరేకించడం లేదు. కానీ డీపీఆర్ గుట్టును, దానిపై బాధితుల్లో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలను నివృత్తి చేయాలి. హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ ఉన్నతాధికారుల వ్యవహారశైలి, ప్రస్తుత హోదాల్లో కొనసాగేందుకు వారికున్న సాంకేతిక అర్హతలు, నిర్మాణ లోపాలు, డీపీఆర్ ఉల్లంఘనలు, తరచూ అలైన్మెంట్ మార్పు తదితర అంశాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలి. న్యాయస్థానం ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్న హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ సంస్థల తీరును కోర్టు ధిక్కారంగా పరిగణించాలి. - రాజీవ్‌రెడ్డి, కంట్రీక్లబ్ చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్