వివాదాల్లో మెట్రో పనులు! | Subsequently disputes! | Sakshi
Sakshi News home page

వివాదాల్లో మెట్రో పనులు!

Published Sun, Apr 6 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM

Subsequently disputes!

  •     బేగంపేట్ కంట్రీక్లబ్ భవంతి కూల్చివేతకు నోటీసులు
  •      అనుమానాలు వ్యక్తం చేస్తోన్న యాజమాన్యం
  •      డీపీఆర్ ఉల్లంఘనలపై ఆందోళన
  •      హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీల నిర్వాకంపై బాధిత సంస్థ న్యాయ పోరాటం
  •  సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో రైలు పనులపై వివాదాలు ముసురుకుంటున్నాయి. తాజాగా బేగంపేట్‌లోని కంట్రీక్లబ్ గ్లోబల్ కార్పొరేట్ కార్యాలయం కూల్చివేతపై హెచ్‌ఎంఆర్ జారీ చేసిన నోటీసు వివాదానికి కేంద్రబిందువవుతోంది. మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 2005లో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఉల్లంఘిస్తూ మెట్రో స్టేషన్ల నిర్మాణం చేపట్టడంపై బాధితులు ఆక్రోషిస్తున్నారు.

    అప్పట్లో కంట్రీక్లబ్ గ్లోబల్ కార్పొరేట్ కార్యాలయం నిర్మాణానికి నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) జారీ చేసిన హెచ్‌ఎంఆర్ వర్గాలు.. తాజాగా ఈ భవంతి కూల్చివేతకు పత్రికా ప్రకటన జారీచేయడంతో పాటు, జూలై 2013లో తమ సంస్థకు నోటీసు జారీ చేయడం దారుణమని కంట్రీక్లబ్ సీఎండీరాజీవ్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బేగంపేట్ రైల్వే స్టేషన్, తాజాగా నిర్మించనున్న మెట్రో స్టేషన్ అనుసంధానానికి అవసరమైన ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్నా.. తమ సంస్థను లక్ష్యంగా చేసుకొని కూల్చివేతకు నోటీసులివ్వడం అన్యాయమన్నారు. తరచూ మెట్రో అలైన్‌మెంట్ మార్పడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొంటున్నారు.
     
    ఉల్లంఘనలు ఇవీ..
    నాగోల్-శిల్పారామం మెట్రో కారిడార్ పరిధిలోని బేగంపేట్ రైల్వేస్టేషన్‌కు ఆనుకుని మెట్రో స్టేషన్ నెం.10 పూర్తిగా ప్రభు త్వ స్థలంలోనే నిర్మిస్తామని 2005లో హెచ్‌ఎంఆర్ వర్గాలు డీపీఆర్‌లో పేర్కొన్నాయి.

    వాస్తవంగా మెట్రో స్టేషన్ నిర్మాణం, బేగంపేట్ రైల్వేస్టేషన్ అనుసంధానానికి (ఇంటిగ్రేషన్) అవసరమైన ప్రభుత్వ ఖాళీ స్థలం కూడా ఈప్రాంతంలో చాలినంత ఉంది.

    కానీ హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ వర్గాలు కంట్రీక్లబ్ గ్లోబల్ కార్పొరేట్ కార్యాలయానికి చెందిన ఆరు అంతస్తుల భవంతిఉన్న ప్రాంగణంలో 2637.76 చదరపు మీటర్ల స్థలాన్ని సేకరించేందుకు 28.6.2013లో కంట్రీక్లబ్ యాజమాన్యానికి నోటీసు జారీచేయడం, పత్రికా ప్రకటన విడుదల చేయడంపై సదరు సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.

    దీనికి హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. క్లబ్ నెలకొన్న ప్రాంగణంలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని, క్లబ్ ప్రాంగణంలో జోక్యం చేసుకోరాదని ఆదేశిస్తూ స్టే ఉత్తర్వులిచ్చింది.
     
    కానీ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి అదే నెలలో కంట్రీక్లబ్ ప్రధాన ద్వారం వద్ద ప్రహరీని కూల్చివేయడంతోపాటు ట్రాన్స్‌ఫార్మర్‌ను హెచ్‌ఎంఆర్ వర్గాలు తొలగించడం కోర్టు ధిక్కారమేనని కంట్రీ క్లబ్ యాజమాన్యం ఆరోపిస్తోంది.
     
    మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, ఇప్పటికే మెట్రో ట్రాక్ నిర్మాణానికి సంస్థకు చెందిన రూ.35 కోట్లు విలువ చేసే 1700 చదరపు అడుగుల స్థలాన్ని కూడా తాము కోల్పోయామని క్లబ్ యాజమాన్యం చెబుతోంది.

    మెట్రో పనులు చేపట్టేందుకు 90 శాతం రైట్ ఆఫ్‌వే (వాహనాల రాకపోకలకు వీలుగామార్గం) ఉన్నపుడు మాత్రమే పనులు చేపట్టాలని సమగ్ర ప్రాజెక్టు నివేదికలో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం పనులు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారని పేర్కొంది.
     
    ప్రస్తుత బేగంపేట్ రైల్వే స్టేషన్ బ్రిడ్జి సెక్షన్ ప్రాంగణంలో ఎలివేటెడ్ మెట్రో స్టేషన్ నిర్మాణానికి తమ వద్ద నుంచి హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ సంస్థలు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ ఏడాది జనవరిలో 21న తమకు రాతపూర్వకంగా తెలిపారని కంట్రీక్లబ్ యాజమాన్యం చెబుతోంది. అయినా, ఈ ప్రాంతంలో మెట్రో పనులకు ఆగమేఘాలపై సన్నాహాలు చేయడంపై అనుమానం వ్యక్తం చేస్తోంది.

    పది దేశాల్లోని 20 లక్షల మంది వినియోగదారులకు సేవలందిచేందుకు ఉద్దేశించిన గ్లోబల్ కార్పొరేట్ కార్యాలయాన్ని లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆరు అంతస్తుల్లో నిర్మించామని, ఇందులో వెయ్యి మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపింది. ఈ భవంతి కూల్చివేత వల్ల తమ క్లబ్ పరిపాలన స్తంభించిపోతుందని సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
     
    డీపీఆర్ గుట్టు వీడదా..?

    మెట్రో ప్రాజెక్టు నిర్మాణంపై డీపీఆర్ బహిర్గతం చేయాలంటూ కంట్రీక్లబ్ యాజమాన్యం ఈ ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తు చేసింది. దీనికి స్పందనగా హెచ్‌ఎంఆర్ సంస్థ ఫిబ్రవరి 19న రాత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో.. ‘మెట్రో సమగ్ర ప్రాజెక్టు నివేదిక తమ మేధోసంపద (ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ)’ అంటూ స్పష్టం చేయడం విమర్శలకు తావిస్తోంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై మహానగరాల మెట్రోరైలు ప్రాజెక్టు నివేదికలు ఆన్‌లైన్‌లో దేశంలో ప్రతి పౌరుడికీ అందుబాటులో ఉండగా.. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నివేదికను బహిర్గతం చేయడానికి అభ్యంతరం ఏంటని సదరు సంస్థ ప్రశ్నిస్తోంది. డీపీఆర్‌ను గుట్టుగా ఉంచడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపిస్తోంది. పదేపదే అలైన్‌మెంట్ మార్చడం, ప్రైవేటు వ్యక్తుల ఆస్తులకు నష్టం కలిగిస్తున్న హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీల వైఖరి ప్రశ్నార్థకంగా మారుతోందని ఆరోపిస్తోంది.
     
     సీబీ‘ఐ’ వేయాల్సిందే..

     మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని మేం వ్యతిరేకించడం లేదు. కానీ డీపీఆర్ గుట్టును, దానిపై బాధితుల్లో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలను నివృత్తి చేయాలి. హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ ఉన్నతాధికారుల వ్యవహారశైలి, ప్రస్తుత హోదాల్లో కొనసాగేందుకు వారికున్న సాంకేతిక అర్హతలు, నిర్మాణ లోపాలు, డీపీఆర్ ఉల్లంఘనలు, తరచూ అలైన్‌మెంట్ మార్పు తదితర అంశాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలి. న్యాయస్థానం ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్న హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ సంస్థల తీరును కోర్టు ధిక్కారంగా పరిగణించాలి.
     - రాజీవ్‌రెడ్డి, కంట్రీక్లబ్ చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement