కొన్ని మానసిక సమస్యలు శారీరక లక్షణాలతో వ్యక్తమవుతాయి. అయితే ప్రతి శారీరక లక్షణమూ మానసిక సమస్య కారణంగా కాకపోవచ్చు. కానీఙో రిపోర్ట్ ప్రకారం ఔట్ పేషెంట్ విభాగానికి వచ్చే బాధితుల్లో 15 శాతం మందికి అవి మానసిక సమస్యలతో వచ్చిన లక్షణాలు కావచ్చేమోనని గణాంకాలు పేర్కొంటున్నాయి.
మానసిక సమస్యలు ఇలా శారీరక లక్షణాలతో ఎందుకు కనిపిస్తాయి, అనేకసార్లు చికిత్స తీసుకున్న తర్వాత కూడా పదే పదే లక్షణాలు కనిపిస్తుంటే కొన్నిసార్లు అది మానసికమైన కారణాల వల్ల కావచ్చేమోనని ఎలా అంచనా వేయవచ్చు లాంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.
మానసిక సమస్యలు అనేక శారీరక వ్యవస్థలపై తమ ప్రభావాలను చూపవచ్చు. మానసిక సమస్యల కారణంగా కొన్ని శరీరంలో కనిపించే లక్షణాలెలా ఉంటాయో చూద్దాం.
జీర్ణవ్యవస్థ పైన...
గట్ ఫీలింగ్ అనే మాటను చాలామంది ఉపయోగిస్తుంటారు. ఫీలింగ్స్ మనసుకు సంబంధించిన భావన కదా... మరి జీర్ణవ్యవస్థ అయిన శారీరకమైన అంశంతో దాన్ని ముడిపెట్టడం ఎందుకు అని అనిపించవచ్చు. ఒక చిన్న పరిశీలనతో దీన్ని తెలుసుకోవచ్చు. ‘సెరిటోనిన్’ అనే స్రావం మానసిక ఉద్వేగాలకు కారణమవుతుంది.
నిజానికి మానసిక అంశాలకోసం స్రవించడం కంటే... సెరిటోనిన్ అనేది జీర్ణవ్యవస్థలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆందోళన, వ్యాకులత జీర్ణవ్యవస్థలో మార్పులకు దారితీస్తాయి. దాంతో ఎసిడిటీ, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, ఆకలి వేయకపోవడం, వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
రక్తప్రసరణ వ్యవస్థపై...
మనసుకు తీవ్రమైన దుఃఖం కలిగినప్పుడు అది గుండె, రక్తప్రసరణ వ్యవస్థ ప్రభావితం చేస్తుంది. తీవ్రమైన దుఃఖం, ఉద్వేగాలు కొందరిలో గుండెజబ్బులకు దారితీస్తాయి. ఒకసారి గుండెపోటు వచ్చినవారిలో మానసిక సమస్యలు ఉంటే అది మళ్లీ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. మానసిక ఒత్తిడి కలిగినప్పుడు రక్తపోటులోనూ తేడాలు రావడం తెలిసిన విషయమే.
ఒళ్లునొప్పులు...
మానసిక సమస్యలు కొన్నిసార్లు ఒళ్లునొప్పులు, కండరాల నొప్పుల రూపంలోనే వ్యక్తమవుతుంటాయి. మానసిక సమస్యలకూ, ఒంటినొప్పులకూ సంబంధమేమిటనే కోణంలో పరిశీలించినప్పుడు కొన్ని అంశాలు అబ్బురపరుస్తాయి. ఉదాహరణకు సెరిటోనిన్, అడ్రినలిన్ వంటి రసాయన స్రావాలు మానసిక సమతౌల్యతకు దోహదపడుతుంటాయి. ఈ రసాయనాలను ‘కెమికల్ గేట్స్’గా పరిగణిస్తారు. గేట్ అనేది అనవసరమైన వాటిని రాకుండా నిరోధించడం కోసం అన్నది తెలిసిందే.
అలాగే ఈ రసాయన గేట్స్... అనవసరమైన అనేక సెన్సేషన్స్‌ను నివారించి, అవసరమైన వాటినే మెదడుకు చేరవేసేలా చూస్తాయి. కానీ డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఉన్నప్పుడు సెరిటోనిన్ వంటి ఈ ద్రవాలు తగ్గడంతో కెమికల్ గేట్స్ తమ కార్యకలాపాలను నిర్వహించలేవు. ఫలితంగా అవసరమైనవే కాకుండా అనవసరమైన సెన్సేషన్‌లు కూడా ఫిల్టర్ కాకుండా మెదడుకు చేరతాయి.
దాంతో డిప్రెషన్ వంటి సమస్యలున్నప్పుడు... కొద్దిపాటి నొప్పి కూడా చాలా తీవ్రంగా ఉన్నట్లు తోచవచ్చు. చిన్న నొప్పి కూడా చాలా ఎక్కువగా అనిపించవచ్చు. ఇలాంటి ఈ పరిణామాన్నే ‘అన్ ఎక్స్‌ప్లెయిన్‌డ్ పెయిన్ సిండ్రోమ్’ అని అంటారు. ఇలాంటప్పుడు దీర్ఘకాలిక వెన్నునొప్పి (క్రానిక్ బ్యాక్ పెయిన్), శరీరంలోని అనేక భాగాల్లో నొప్పులు, మెడనొప్పి, కండరాల నొప్పి వంటివి కలిగే అవకాశముంది.
శరీరం లాగే మనసుకూ జబ్బూ..
మన సమాజంలో మానసిన సమస్యలను బయటకు చెప్పుకోలేని సమస్య (స్టిగ్మా)గా చూస్తుంటారు. మానసిక సమస్య అని చెప్పుకోవడం కష్టం కాబట్టి... మనసు వాటిని శారీరక లక్షణాలుగా మార్చి వ్యక్తం చేస్తుంటుంది. అయితే ఇది కాన్షియస్‌గా జరిగే ప్రక్రియ కాదు. బాధితులకూ / పేషెంట్లకూ ఇలా జరుగుతుందని తెలియదు. అధిక ఒత్తిడి వంటి కొన్ని మానసిక సమస్యలు ఉన్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ పనితీరూ తగ్గి అది శారీరక లక్షణాలుగా వ్యక్తమవుతుంది.
అందుకే పరీక్షల సమయంలో లేదా పరీక్షలకు ముందు పిల్లల్లో / పెద్దల్లోనూ జ్వరాలు, జీర్ణ సమస్యలు, తలనొప్పి, కడుపునొప్పి, నిద్రలేమి... వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. శరీరానికి లాగే మనసుకూ జబ్బు వచ్చే అవకాశముందని గుర్తించి, అది ఏమాత్రం తప్పు కాదని గ్రహించి, తగిన మందులు తీసుకుంటే... ఈ సమస్యలు రావడం తగ్గిపోయి, మాటిమాటికీ డాక్టర్ షాపింగ్ చేస్తూ, డబ్బు, ఆరోగ్యం వృథా చేసుకునే అవస్థలూ తగ్గుతాయి. ∙
Comments
Please login to add a commentAdd a comment