టీచర్స్ డే రోజు పూజించుకుంటున్నాం సరే. వారి మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వానికి, ఇంటికి శ్రద్ధ ఉందా? చెప్పాల్సిన క్లాసుల సంఖ్య, సిలబస్‌ల వత్తిడి, విద్యార్థులు నిత్యం తెచ్చే సమస్యలు, స్కూల్లో అరాకొరా వసతులు, స్కూలుకు రానూ పోనూ ప్రయాణ సౌలభ్యం లేని ఆందోళన... ఇవన్నీ టీచర్ల మానసిక ఆరోగ్యం దెబ్బ తీస్తున్నాయి. ఆ అసహనం విద్యార్థుల మీదకు మళ్లితే వారు గాయపడటమే కాక పాఠాలు నడవవు. శాంతంగా, నవ్వుతూ ఉండే టీచర్లు ఎందరు?
2023లో బిహార్‌లో టీచర్ల మానసిక ఆరోగ్యం మీద ప్రభుత్వం సర్వే చేసింది. మొత్తం 75 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 4 లక్షల మంది టీచర్లకు 12 రకాల ప్రశ్నలున్న ప్రశ్నాపత్రాన్ని పంపి వాటికి సమాధానాలు రాయించారు. ఈ సర్వే చేయడానికి ముఖ్య కారణం విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులు...
– టీచర్లు తరచూ తిడుతూ ఉండటం, కొడుతూ ఉండటం
– స్కూలుకు సరిగ్గా రాకపోవడం
– సిలబస్ సమయానికి పూర్తి చేయలేకపోవడం ప్రభుత్వం జీతాలు ఇచ్చి పాఠాలు చెప్పమంటే పిల్లలతో వారు వ్యవహరిస్తున్న తీరులో ఎందుకు తేడా వస్తున్నదో తెలియడానికి ఈ సర్వే చేశారు. కాని సర్వే ఫలితాలను మాత్రం బయట పెట్టలేదు. సర్వేలో అడిగిన కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి.
– మీ ఇంట్లోని ఒత్తిడి స్కూల్లో మీ ఉద్యోగం మీద పడుతున్నదా?
– పిల్లల్ని ఎంత తరచుగా తిడుతున్నారు?
– సిలబస్ టైమ్‌కి పూర్తి చేయగలుగుతున్నారా?
– మీరు ఇంట్లో ఎక్కువ ఒత్తిడి ఫీలవుతారా స్కూల్లోనా?
– ఇప్పటి విద్యా వ్యవస్థ మీద సంతృప్తిగా ఉన్నారా?
ఈ సర్వేతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఏం చెప్పారంటే మాకు పాఠాలు చెప్పే పని కంటే వేరే పనులు ఎక్కువ చెబుతున్నారు అని. వాటిలో ఎలక్షన్ డ్యూటీలు, సర్వేలు, మిడ్ డే మీల్స్ ఉన్నాయి. సర్వేల పనిలో టీచర్లను పెడితే ఆ సమయంలో టీచర్ల అటెండెన్స్ దారుణంగా పడిపోతోంది. కొందరైతే ‘మిడ్ డే మీల్స్‌ను బయటి ఏజెన్సీకి అప్పగించాలి. చీటికి మాటికి దాని గురించి ఇన్‌స్పెక్షన్‌లకు వస్తుంటే ఒత్తిడిగా ఉంది’ అన్నారు.
వ్యక్తిగత శ్రద్ధకు సమయం లేదు..
స్కూల్లో పాఠాలు, హోమ్‌వర్క్‌లు, పరీక్షలు పెట్టి పేపర్లు దిద్దటాలు, స్కూల్ మేనేజ్‌మెంట్‌తో మీటింగ్‌లు, పేరెంట్స్‌తో మీటింగ్‌లు, సిలబస్‌ను పూర్తి చేయడం, వృత్తిపరమైన పోటీ (మంచి పేరు రావడం), స్టూడెంట్‌ల వ్యవహారశైలితో సమస్యలు... ఇవన్నీ ఒత్తిడి కలిగించేవే. ఇక కుటుంబ పరమైన ఒత్తిడులు కూడా ఉంటాయి. ఇంటి వొత్తిడి స్కూల్లో స్కూలు ఒత్తిడి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే రెండు చోట్లా టీచర్లకు స్థిమితం ఉండదు. స్థిమితంగా లేని స్వభావంతో పాఠం చెప్పడం కష్టం. ఈ మొత్తం వ్యవహారంలో టీచర్లు తమ మానసిక స్థితి గురించి శ్రద్ధ పెట్టే ఆలోచన చేయలేకపోతున్నారు.
పిల్లలకు ఒత్తిడి..
క్లాసురూమ్‌లో కూచోగానే పిల్లలు తలెత్తి చూసేది టీచర్‌నే. టీచర్ ముఖం ప్రసన్నంగా ఉంటే వారు ప్రసన్నంగా పాఠం వింటారు. చిర్రుబుర్రులాడే టీచర్ ఉండే క్లాసులోని పిల్లల్ని పరీక్షిస్తే వారిలో ‘కార్టిసల్’ అనే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతున్నదని తేలింది. పిల్లల మానసిక ఆరోగ్యం పై స్కూల్ వాతావరణం నెగెటివ్ ప్రభావం ఏర్పరిస్తే వారిలో సమస్యలు వస్తాయి. వీళ్లు మళ్లీ టీచర్‌కు స్ట్రెస్ ఇస్తారు. అంటే ఇదొక సైకిల్‌గా మారుతుంది.
వ్యక్తిగత ఒత్తిడి..
టీచర్ ఉద్యోగంలో ఉన్నవారికి కుటుంబం నుంచి చాలా సపోర్ట్ ఉండాలి. ఇంటి పని తగ్గించగలగాలి. ఆర్థిక, భావోద్వేగ సమస్యలు తెలుసుకొని మిత్రులు, బంధువులు సపోర్ట్‌గా నిలవాలి. సక్సెస్‌ఫుల్ విద్యార్థులను తయారు చేయించడంలో ఆమె సక్సెస్ అయ్యేలా తోడు నిలవాలి.
చర్యలు తీసుకోవాలి..
టీచర్లు, పిల్లలు మంచి మానసిక స్థితిలో ఉంటూ స్కూల్ జీవనం కొనసాగించాలంటే టీచర్ల గురించి ఆలోచించాలి. టీచర్ల కోసం ప్రభుత్వంగాని, ప్రయివేటు యాజమాన్యాలుగాని కింది చర్యలు తీసుకోవాలి.
– తరచూ నిపుణులచే కౌన్సిలింగ్ చేయించడం
– మెంటల్ హెల్త్ వర్క్‌షాప్‌లు నిర్వహించడం
– సాటి టీచర్ల నుంచి మద్దతు లభించే పని వాతావరణం.
– వసతులు, బోధనా సామాగ్రి ఏర్పాటు
– ఇంటి పని, ఉద్యోగ బాధ్యత సమతుల్యత గురించిన అవగాహన
– యాజమాన్యం, తల్లిదండ్రులు, పిల్లలకు టీచర్లు అనుసంధానకర్తలుగా ఉండేలా చేసి ఆ టీచర్లు చెప్పే సూచనలను పాజిటివ్‌గా చూడటం.
Comments
Please login to add a commentAdd a comment