చదువులకూ పెద్దన్నే.. | America is home to the best educational opportunities | Sakshi
Sakshi News home page

చదువులకూ పెద్దన్నే..

Published Sun, Jun 11 2023 2:20 AM | Last Updated on Sun, Jun 11 2023 2:22 AM

America is home to the best educational opportunities - Sakshi

అమెరికా సంయుక్త రాష్ట్రాలు..! కొందరికి అగ్రరాజ్యం..  దేశాలకు పెద్దన్న.. మరికొన్నింటికి కుట్రదారు, శత్రువు.. కానీ ప్రపంచం మొత్తం అంగీకరించే ఓ అంశంలో  పైచేయి ఆ దేశానిదే.. అదే అత్యుత్తమ ఉన్నత విద్య. రెండు వందలకుపైగా దేశాలున్న ఈ భూమ్మీద  ఒక్క అమెరికానే ఎక్కువమంది విదేశీ  విద్యార్థులను ఎందుకు ఆకర్షిస్తోందో తెలుసా?

రెండు లక్షల మంది.. గత ఏడాది ఒక్క భారతదేశం నుంచే ఉన్నత చదువుల కోసం అమెరికాకు చేరిన విద్యార్థుల సంఖ్య ఇది. గత ఏడాది మొత్తంగా 200 దేశాలకు చెందిన 9.48 లక్షల మందికిపైగా విద్యార్థులు అమెరికాలోని నాలుగు వేలకుపైగా ఉన్న యూనివర్సిటీల్లో చేరడం గమనార్హం. దీనికి ఎన్నో కారణాలు. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, విస్తృత అవకాశాలు, వైవిధ్యత, చదువుకోవడంలో రకరకాల వెసులుబాట్లు, అంతర్జాతీయ గుర్తింపు, స్కాలర్‌షిప్‌లు.. ఇలా మరెన్నో సానుకూల  అంశాలు విద్యార్థులను అమెరికా వైపు ఆకర్శిస్తున్నాయి.

ప్రభుత్వ విద్యా సంస్థలు టాప్‌!
అమెరికా మొత్తమ్మీద ఉన్నత విద్యనందించే సంస్థలు నాలుగు వేలకుపైనే ఉన్నా­­యి. అత్యాధునిక కృత్రిమ మేధ/మెషీన్‌ లెర్నింగ్‌ మొదలుకుని జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ వరకు.. ఆర్ట్స్, హ్యుమానిటీస్, పొలిటికల్‌ ఎకానమీ.. ఇలా ఎన్నో రంగాలకు సంబంధించి విస్తృతస్థాయి కోర్సులు అందుబా­టులో ఉన్నాయి.

ప్రైవేట్‌ విద్యా సంస్థలు ఉన్నా.. ప్రభుత్వ సంస్థల్లో చేరే విద్యార్థులే ఎక్కువని అక్కడి విద్యాశాఖ గణాంకాలు చెప్తున్నాయి. కాలేజీలు, యూనివర్సి­టీల్లో అత్యధికం గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ అందిస్తు­న్నాయి. కమ్యూనిటీ కాలేజీల్లో రెండేళ్ల కోర్సు­లుంటాయి. ఇవి సిద్ధాంతాలకు కాకుండా వాస్తవిక జ్ఞానానికి, ఉద్యో­గాలకు పనికొచ్చే విషయాలకు ఎక్కువ ప్రాధాన్య­తనిస్తాయి.

విదేశీ విద్యార్థుల్లో చాలా­మంది ఈ కమ్యూనిటీ కాలేజీలు అందించే రకరకాల సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు చేసి.. తర్వాత ఉన్నత విద్య కోసం ఇతర యూనివర్సిటీల్లో చేరుతుంటారు. హార్వర్డ్, యేల్, బ్రౌన్, ప్రిన్స్‌టన్‌ వంటి ప్రైవేట్‌ యూనివర్సిటీలు విద్యార్థుల ఫీజులతోపాటు దాతలు ఇచ్చే విరాళాలతో నడుస్తూంటాయి.

ఎన్నో రకాల వెసులుబాట్లతో..
భారత్‌లో ఇంటర్మీడియట్‌లో చదివే కోర్సులే మీరు భవిష్యత్తు­లో ఏం కావాలని అనుకుంటున్నారో నిర్ణయిస్తాయి. ఎంపీసీ అయితే ఇంజనీరింగ్‌.. బైపీసీ అయితే వైద్యం. కానీ అమెరికాలో విభిన్న చదువులకు అవకాశం ఉంటుంది. చాలా యూనివర్సిటీల్లోని నాలుగేళ్ల గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్‌లోనూ రెండేళ్లపాటు హ్యుమానిటీస్, నేచురల్‌ సైన్సెస్, సోషల్‌ సైన్స్, గణితం వంటి సబ్జెక్టుల్లో కోర్సు చేయాల్సి ఉంటుంది.

ఈ నాలుగేళ్ల కోర్సు సమయంలో ఎప్పుడైనా మీరు ఎంచుకున్న మేజర్‌ (ప్రధాన సబ్జెక్ట్‌)ను మార్చుకోవచ్చు. ఇంజనీరింగ్‌ చేస్తూ కంప్యూటర్‌ సైన్స్‌ నుంచి కృత్రిమ మేధకు మారిపోవచ్చు. యూనివర్సిటీలో చేరేటప్పుడు ఫలానా సబ్జెక్టు అని ఎంచుకోవాల్సిన అవసరమూ లేదు. యూనివర్సిటీ అందించే వేర్వేరు కోర్సులను దగ్గరి నుంచి పరిశీలించి.. నచ్చిన అంశాన్ని మేజర్‌గా ఎంచుకోవచ్చు.

కచ్చితంగా క్లాస్‌రూమ్‌లకు రావాలన్న నియమం లేదు. ఆన్‌లైన్‌ కోర్సులు చేయవచ్చు. ఒకేసారి రెండు డిగ్రీలు చదవవచ్చు. ఒక యూనివర్సిటీ నుంచి ఇంకోదానిలోకి మారి కోర్సులు కొనసాగించేందుకూ అభ్యంతరాలు ఉండవు.

గుర్తింపు, ఉద్యోగావకాశాలు
అమెరికా యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికి ప్రపంచ దేశాలన్నింటిలోనూ తగిన గుర్తింపు ఉంటుంది. చదువుకునే సమయంలోనే వివిధ దేశాల వారితో కలిసిమెలిసి ఉండే అవకాశం లభిస్తుంది. పేరు ప్రతిష్టలున్న అధ్యాపకులు, నిపుణుల నుంచి నేర్చుకుని ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే యూనివర్సిటీల పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్, ఫార్చ్యూన్‌–500 కంపెనీల్లో అత్యధికం అగ్రరాజ్యంలోనే ఉండటం వంటి కారణాలతోనూ అమెరికాలో చదివిన వారికి మెరుగైన ఉద్యోగావకాశాలు కలిగిస్తాయి.

అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత  మూడేళ్లపాటు ఆ దేశంలోనే పనిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్‌ విద్యార్థులకు ఇది ఎంతో విలువైన  వృత్తిపరమైన నైపుణ్యాన్ని అందిస్తుంది. దీన్ని ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ (ఓపీటీ) అంటారు.

యూనివర్సిటీలు స్వయంగా కెరీర్‌ సర్వీసులను  కూడా అందిస్తాయి. విదేశీ విద్యార్థులకు,  కంపెనీలకు మధ్య వారధిగా నిలుస్తాయి. రెజ్యూమ్‌లు ఎలా తయారు చేసుకోవాలన్న చిన్న  అంశాల నుంచి కంపెనీలతో కెరీర్‌ ఫెయిర్‌లు,  మెంటార్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌ వరకు సాయం అందిస్తాయి.

ఖర్చుల మాటేమిటి?
అమెరికా చదువులంటే ఖరీదైనవని చాలా­మంది అంటూ ఉంటారు. అందులో వాస్తవం కొంతే. జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం వ్యవ­హరిస్తే.. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం బోలెడన్ని స్కాలర్‌షిప్‌లు, గ్రాంట్లు అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు చదువు­కునేటప్పుడే పనిచేసుకునేందుకు అవకాశం కల్పించ­డం, రుణాలు వంటి మార్గాల ద్వారా విద్యాభ్యాసానికయ్యే ఖర్చులను పొందవచ్చు.
అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి లభించే ఆర్థిక సాయం ప్రధానంగా రెండు రకాలు. ఒకటి మీ అవసరాలను తీర్చేది. రెండోది మీ ప్రతిభకు అనుగుణంగా దక్కేది. కొన్ని స్కాలర్‌షిప్స్‌ ట్యూషన్‌ ఫీజులతోపాటు అక్కడి రోజువారీ ఖర్చులకు కావాల్సిన మొత్తాలను కూడా అందిస్తాయి. కొన్ని స్కాలర్‌షిప్‌లు ట్యూషన్‌ ఫీజు మొత్తం లేదా అందులో కొంత భాగాన్ని చెల్లిస్తాయి.
 యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్ని­యా­ను ఉదాహరణగా తీసుకుంటే.. విదేశీ విద్యా­ర్థుల కోసం మెరిట్‌ ఆధారిత స్కాలర్‌ర్షిప్ లు, క్యాంపస్‌లో ఉద్యోగం చేసుకునే వెసులు­బాటు ఉంటుంది. మీ అవసరాలకు తగిన ఆర్థిక సాయం (నీడ్స్‌ బేస్డ్‌ ఫైనాన్షియ­ల్‌ ఎయిడ్‌) ఈ యూనివర్సిటీలో లభించదు.
 కేవలం గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్‌కు మాత్ర­మే కాకుండా అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రా­మ్స్‌­­కు కూడా కొన్ని కాలేజీలు, విద్యాసంస్థలు ఆర్థిక సాయం అందిస్తాయి. ఈ అంశంపై మీకు సాయం అవసరమ­నుకుంటే ‘ఎడ్యు­కేషన్‌ యూఎస్‌ఏ’ విభాగా­న్ని సంప్రదించవచ్చు.


- కంచర్ల యాదగిరిరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement