పాత వ్యాధులు.. కొత్త సవాళ్లు! మన దేశంలో పంజా విసురుతున్న మీజిల్స్‌..  | Massive Measles Outbreak Threatens India | Sakshi
Sakshi News home page

పాత వ్యాధులు.. కొత్త సవాళ్లు! మన దేశంలో పంజా విసురుతున్న మీజిల్స్‌.. 

Published Sun, Dec 25 2022 2:39 AM | Last Updated on Sun, Dec 25 2022 8:38 AM

Massive Measles Outbreak Threatens India - Sakshi

కంచర్ల యాదగిరిరెడ్డి
ముంబై, రాంచీ, అహ్మదాబాద్, మళ్లప్పురం, హైదరాబాద్‌.. ఈ ప్రాంతాలన్నింటా ఇటీవల కొత్తగా కలకలం మొదలైంది. దానికి కారణం తట్టు (మీజిల్స్‌) వ్యాధి మళ్లీ విజృంభించడమే.. ఈ ఏడాది ఏకంగా 16వేల మంది పిల్లలకు తట్టు వ్యాధి సోకడం వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. టీకాలు వేసుకోకపోవడమే దీనికి కారణమని కొందరు అంటున్నా.. కేవలం ఒక్కసీజన్‌లో దేశంలో ఇంతమందికి మీజిల్స్‌ సోకడం అసాధారణ­మని వైద్య నిపుణులు అంటున్నారు.

ఒక్క మన దేశంలోనేకాదు.. అమెరికా, బ్రిటన్, పలు యూరప్‌ దేశాల్లోనూ కొద్దినెలలుగా వైరల్, బ్యాక్టీరియల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అందులోనూ బాధితులు ఎక్కువగా పిల్లలే. వరుస కోవిడ్‌ వేవ్‌ల తర్వాత పరిస్థితి చక్కబడుతున్న సమయంలో (చైనా, మరికొన్ని దేశాలు మినహా) ఇతర వైరల్‌ వ్యాధుల దాడి పెరగడంపై నిపుణులు అనుమానాస్పదంగానే స్పందిస్తున్నారు. దీనికి ప్రత్యేకమైన కారణా­లేమైనా ఉన్నాయా అన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి కూడా. 

ముంబైలో మొదలై.. 
ఈ ఏడాది అక్టోబర్‌లో ముంబైలో పెద్ద సంఖ్యలో తట్టు కేసులు నమోదయ్యాయి. ఆ నెల 26వ తేదీ నాటికి ఇరవై మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు కూడా. తర్వాత రాం­చీ, అహ్మదాబాద్, మళ్లప్పురంలో..తాజాగా తెలంగా­ణలోనూ వందల సంఖ్యలో ఈ వ్యాధి కేసులు నమోదవ­డం గమనార్హం. ముంబైలో మరణించిన పిల్లల్లో ఒక్కరు మాత్రమే తట్టు నిరోధక టీకా వేసుకున్నట్టు పరీక్షల ద్వా­రా తెలిసింది. కాకపోతే రెండు డోసులు వేసుకోవాల్సిన టీకా ఒక డోసు మాత్రమే వేసుకున్నట్టు గుర్తించారు. 

అమెరికాలో పదిరెట్లు ఎక్కువగా.. 
అమెరికాలో గత మూడు నెలల కాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అదుపు చేయలేనంతగా తీవ్రమయ్యాయి. చాలామంది పిల్లలు రెస్పిరేటరీ సైనిటికల్‌ వైరస్‌ బారిన పడుతున్నారు. పెద్దల్లో సాధారణ జలుబు మాదిరి లక్షణాలతో కనిపించే ఈ వ్యాధి.. పిల్లల్లో మాత్రం ఆందోళనకర స్థాయికి చేరుతుంది. గత ఏడాది కాలంలో ఈ వ్యాధి కనీసం మూడు సార్లు ప్రభావం చూపిందని న్యూయార్క్‌లోని మైమోనైడ్స్‌ పీడియాట్రిక్‌ సీనియర్‌ వైద్యులు రబియా ఆఘా తెలిపారు.

రోగుల తాకిడిని తట్టుకునేందుకు ఐసీయూ వార్డు సామర్థ్యా­న్ని రెట్టింపు చేశామని పేర్కొన్నారు. మూడు, నాలుగేళ్ల పిల్లలకు సోకు­తున్న ఈ వ్యాధి మామూలుగా తట్టుకోగలిగిన స్థాయి­లోనే ఉంటుందని.. ఈసారి మాత్రం లక్షణాలు బాగా తీవ్రంగా కనిపిస్తున్నాయని ఆమె వివరించారు. ఇక గత నెలలో అమెరికాలో ఇన్‌ఫ్లూయెంజాతో ఆస్పత్రుల్లో చేరినవారి సంఖ్య గత పదేళ్లలోనే అత్యధికమని అక్కడి వైద్య నిపుణులు చెప్తున్నారు. 

బ్రిటన్‌లో బ్యాక్టీరియా దాడి.. 
బ్రిటన్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఇప్పటివరకు స్ట్రెప్టోకాకస్‌ బ్యాక్టీరియా కారణంగా 16 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్‌కు ముందు అంటే 2017 –18 సీజన్‌లో మాత్రమే ఈస్థాయి ఇన్ఫెక్షన్లు, మరణాలు సంభవించాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది. స్ట్రెప్టోకాకస్‌ బ్యాక్టీరియాతో గొంతునొప్పి, టాన్సిలైటిస్‌ వంటి లక్షణాలు ఉంటాయి. అరుదుగా మాత్రం మెనింజైటిస్‌ వంటి ప్రాణాలమీదికి వచ్చే ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. అయితే ఈ ఏడాది మరణాల సంఖ్య మాత్రం అసాధారణంగా పెరిగిందని లం­డన్‌­లోని పిల్లల వైద్యుడు రోని చుంగ్‌ అంటున్నారు. 

కోవిడ్‌ లాక్‌డౌన్లు కారణమా? 
పిల్లల్లో ఈ ఏడాది వైరల్‌ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుండటం వెనుక కోవిడ్‌ సమయంలో విధించిన లాక్‌డౌన్లు కారణం కావచ్చని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రపంచదేశాలన్నీ లాక్‌డౌన్లు విధించాయి. చాలా దేశాల్లో పిల్లలను పాఠశాలలకు, నర్సరీలకు పంపలేదు. వారంతా ఈ ఏడాది మళ్లీ పాఠశాలలకు, నర్సరీలకు వెళుతున్నారు. ఇది ఆర్‌ఎస్‌వీ, జలుబు, స్ట్రెప్టోకాకస్‌ బ్యాక్టీరియా సమస్యలు విజృంభించేందుకు కారణమవుతోందని అంచనా. ఇక కోవిడ్‌ సోకిన పిల్లల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం వల్ల కూడా ఈ ఏడాది వ్యాధులు ఎక్కువయ్యేందుకు కారణం కావచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. 

►కోవిడ్‌ వచ్చిన తొలి ఏడాది బ్రిటన్‌తోపాటు అమెరికా, జర్మనీ ఆస్ట్రేలియాల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలు బాగా తగ్గిపోయాయని.. ఈ ఏడాది మళ్లీ అధిక సంఖ్యలో నమోదవడం చూస్తే కోవిడ్‌ లాక్‌డౌన్లను అనుమానించాల్సి వస్తోందని క్వీన్స్‌ యూనివర్సిటీ వైరాలజిస్ట్‌ కానర్‌ బామ్‌ఫర్డ్‌ తెలిపారు. జర్మనీలో 2021 సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో ఆర్‌ఎస్‌వీ వ్యాధి 2017–2019 మధ్యకాలం కంటే యాభై రెట్లు ఎక్కువగా నమోదైనట్లు.. న్యూజిలాండ్‌లో 2021లోనే ఆర్‌ఎస్‌వీ కేసులు ఎక్కువైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 
 
కోవిడ్‌తో బలహీనతకు రుజువులు లేవు 
కోవిడ్‌ సోకితే రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడుతుందని, తర్వాతి కాలంలో వైరల్‌ సమస్యలు పెరుగుతాయని చెప్పేందుకు ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలేవీ లేవని పిల్లల వైద్య నిపుణురాలు రబియా ఆఘా తెలిపారు. ఈ ఏడాది వ్యాధుల బారినపడ్డ పిల్లలు ఎక్కువగానే ఉన్నా.. వచ్చే ఏడాదికల్లా పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువని పేర్కొన్నారు.

ఏదేమైనా వ్యాధుల నుంచి పిల్లలను రక్షించుకునేందుకు భౌతిక దూరాన్ని పాటించడం, రద్దీ ప్రాంతాల్లో తిరగకపోవడం, మాస్కులు ధరించడం, గాలి, వెలుతురు బాగా ఆడేలా చూడటం అవసరమని అమెరికాకు చెందిన సీడీసీ (సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌) మళ్లీ హెచ్చరికలు చేయడం మొదలుపెట్టింది. మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. 

పొంచి ఉన్న టైఫాయిడ్‌ ముప్పు 
భారత్‌లో సమీప భవిష్యత్తులో టైఫాయిడ్‌ జ్వరాలు విరుచుకుపడే అవకాశమున్నట్టు ప్రముఖ వైరాలజిస్ట్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ ఇటీవల హెచ్చరించారు. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.28 – 1.61 లక్షల మందిని బలితీసుకుంటుండగా.. ఇందులో 40శాతం మరణాలు భారత్‌లో సంభవిస్తున్నవే. ఈ వ్యాధి రక్షణకు టీకా ఉన్నప్పటికీ ఖరీదు ఎక్కువ కావడంతో చాలామంది తీసుకోవడం లేదని.. ఫలితంగా రానున్న పదేళ్లలో మరణాల సంఖ్య రెట్టింపు అవుతుందని, వ్యాధి బారినపడే వారి సంఖ్య ఏకంగా 4.6 కోట్లకు చేరుతుందని ఆమె హెచ్చరించారు. టైఫాయిడ్‌ టీకాను కూడా సార్వత్రిక టీకా కార్యక్రమంలో చేర్చడం ద్వారా మాత్రమే ఈ ముప్పును ఎదుర్కొనగలమని స్పష్టం చేశారు. 

టీకా కార్యక్రమాన్ని పటిష్టం చేస్తాం
దేశవ్యాప్తంగా తట్టు, ఇతర వ్యాధులు పెరుగుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఇవి సీజనల్‌ వ్యాధులైనప్పటికీ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని ఆయన ఇటీవల హైదరాబాద్‌లో చెప్పారు. టీకాలపై అవగాహన పెంచడానికి, ప్రతి ఒక్కరూ టీకాలు తప్పనిసరిగా తీసుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement