ఊబకాయంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం
కాలేయానికి, మెదడుకూ మధ్య కూడా ఓ బయలాజికల్ క్లాక్
‘ఆకలి’కి సంబంధించిన సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుందంటున్న తాజా అధ్యయనం
యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా శాస్త్రవేత్తల వెల్లడి
షిఫ్టుల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులూ, అడపాదడపా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉన్నవారంతా వేళకాని వేళల్లో ఆహారం తీసుకోవడం చాలా సాధారణం. అయితే ఓ అధ్యయనం ప్రకారం ఇలాంటివారిలో ఊబకాయంతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నట్టు తెలిసింది. జీర్ణాశయానికి, మెదడుకూ మధ్య సమాచార సమన్వయాలు జరుగుతున్న విషయాలు అనేక అధ్యయనాల్లో వెలుగు చూశాయి.
కాలేయానికి, మెదడుకూ మధ్య కూడా బయటకు కనపడని కమ్యూనికేషన్స్ ఉంటాయని ఈ సరికొత్త అధ్యయనం తేల్చిచెబుతోంది. యూఎస్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని పెరల్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందాల పరిశోధనల్లో ఈ అంశాలు వెలుగుచూశాయి. – సాక్షి, హైదరాబాద్
కాలేయానికి, మెదడుకు మధ్య కూడా ‘క్లాక్’లింకు పట్టపగలు పనిచేయడంతోపాటు రాత్రివేళల్లో నిద్రపోయేలా మెదడులోని బయలాజికల్ క్లాక్ నిర్దేశిస్తుందని, దీన్నే సర్కేడియన్ రిథమ్‌గా చెబుతారన్న విషయం తెలిసిందే. తాజాగా పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం.. కాలేయానికి, మెదడుకూ మధ్య కూడా ఓ బయలాజికల్ క్లాక్ ఉంటుంది. ఆకలి వేసినప్పుడూ, ఏం తినాలన్నది నిర్ణయం తీసుకునేటప్పుడూ వేగస్ నర్వ్ ద్వారా కాలేయం నుంచి మెదడుకూ, మెదడు నుంచి మళ్లీ కాలేయానికి సమాచారాలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంటుంది.
దాన్నిబట్టే ఓ వ్యక్తి తానెప్పుడు తినాలి? తినేటప్పుడు ఎలాంటి ఆహారాలను ఎంపిక చేసుకోవాలి వంటివి జరుగుతుంటాయి. ఈ కాలే య, మెదడు క్లాక్ సమాచారాల రిథమ్‌లో ఏదైనా తేడా వస్తే.. అది జీవక్రియల్లో అంతరాయాలకు దారితీస్తుందని, దాంతో బరువు పెరగడం, అది అనేక ఆరోగ్య సమస్యలకు తావివ్వడం,అవి మరికొన్ని అనారోగ్యాలకు దారితీయ డం.. ఇలా ఒక దానివెంట మరొక సమస్యకు దారితీస్తుంటాయి.
ఎలుకల కాలేయంలోని ‘రెవ్–ఎర్బ్స్’అనే కుటుంబానికి చెందిన జన్యువులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. దేహంలోని సర్కేడియమ్ రిథమ్‌ను నిర్దేశించే బయలాజికల్ క్లాక్ నిర్వహణలో ఈ జన్యువులు కీలక భూమిక పోషిస్తాయి. రకరకాల జీవక్రియలు, హార్మోన్లు వెలువడేలా చూడటం వంటి అనేక వాటిలో అవి పాలు పంచుకుంటుంటాయి.
ఎలుకలు, మనుషుల జీవక్రియల పరిశీలన
ఈ అధ్యయనంలో పాల్గొన్న ముఖ్యుల్లో ఒకరూ అలాగే పెన్ మెడిసిన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్, ఒబిసిటీ అండ్ మెటబాలిజమ్ డైరెక్టర్ డాక్టర్ మిచెల్ లాజర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఎలుకలూ, మనుషులూ మెలకువతో ఉన్నప్పుడు తినే జీవులు కాబట్టి ఈ రెండు శరీరాల్లో జీవక్రియల పనితీరు పరిశీలించినప్పుడు కాలేయానికి, మెదడుకూ మధ్య ఉండే నిర్దేశిత సమాచారాల గురించిన వివరాలు తెలిశాయి. ఎలుకల్లో ఉండే ‘రెవ్–ఎర్బ్స్’జన్యువులకు మెదడుతో ఉన్న కనెక్షన్ తొలగించినప్పుడు ఎలుకలు తాము చురుగ్గా లేని సమయంలోనూ ఇష్టం వచ్చినట్టుగా
తినడం, అవసరమైన దానికంటే ఎక్కువగా తినేయడం మొదలుపెట్టాయి. ఈ తిండి ఎలా ఉందంటే... అచ్చం రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు ఆకలితో నిమిత్తం లేకుండా మామూలు కంటే ఎక్కువగానే తినేయడంలా అనిపించింది. ఇంకా ఇదెలా ఉందంటే.. జెట్‌లాగ్ తర్వాత బయలాజికల్ క్లాక్‌లో అంతరాయం కలగడంతో వేళాపాళా లేకుండా ఇష్టమొచ్చి నట్టు తినేయడంలా కనిపించింది.
వేగస్ నర్వ్ ద్వారా సమాచార మార్పిడి
ఎప్పుడు, ఎలా తినాలి అనే ఈ సమాచారాల ఇచ్చిపుచ్చుకోడాలు వేగస్ నర్వ్ అనే ఓ కీలక నరానికి చెందిన అత్యంత సంక్లిష్టమైన నర్వ్ ఫైబర్స్ ద్వారా జరుగుతుంటుంది. ఎప్పుడు ఆకలిగా అనిపించాలి, ఎప్పుడు ఎంత మొత్తంలో తినాలనే ఆదేశాలు కాలే యం ఈ నరం ద్వారానే మెదడుకు చేరవేస్తుంది. దాని ప్రకారమే మనుషులకూ లేదా జీవాలకు ఎప్పుడు ఆకలి వేయాలో అప్పుడు ఆకలిగా అనిపించడం, దాన్ని బట్టి ఎంత తినాలో అంత తినేశాక ఆకలి తీరడం వంటివన్నీ సర్కేడియన్ రిథమ్‌కు అనుగుణంగా జరుగుతుంటాయి.
డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం
ప్రస్తుతం పనివేళల్లో గణనీయమైన మార్పులు రావడం, అర్ధరాత్రి, అపరాత్రీ అనే తేడాలు లేకుండా పనులు చేయాల్సి రావడం దుష్ప్రభావం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అధిక రక్తపోటు, మధుమేహం, రక్తంలో కొలెస్టరాల్ మోతాదులు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. చివరకు ఇవన్నీ టైప్–2 డయాబెటిస్, గుండెజబ్బులూ, పక్షవాతం వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తున్నాయని డాక్టర్ మిచెల్ లాజర్ చెబుతున్నారు.
మనదేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్–ఇండియా డయాబెటిస్ (ఐసీఎమ్‌ఆర్–ఇండియాబ్) నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం భారత్‌లో 10.1 కోట్ల డయాబెటిస్ బాధితులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల మంది డయాబెటిస్ బాధితులు ఉండగా... అందులో 10.1 కోట్ల మంది కేవలం మన దేశం నుంచే ఉన్నారు. అంటే ప్రపంచంలోని ప్రతి 8 మంది డయాబెటిస్ బాధితుల్లో ఒకరు భారత్‌వాసి అన్నమాట.
మన భారతీయ గణాంకాలను యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధనల ఫలితాలతో అనుసంధానించి చూస్తే నిద్రపోవాల్సిన సమయంలో పనిచేస్తూ, వేళగాని వేళల్లో భోజనం చేస్తున్నవారిలో ఈ జీవక్రియలకు సంబంధించిన జబ్బులైన డయాబెటిస్ వంటివి చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా... ఈ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా అనుసరించాల్సిన చికిత్స ప్రణాళికల ప్రాధాన్యాన్నీ నొక్కి చెబుతోంది. ఉదాహరణకు చాలా ఊబకాయంతో ఉన్న ఎలుకల తాలూకు వేగస్ నర్వ్‌ను కట్ చేసినప్పుడు... మళ్లీ అవి నార్మల్ ఎలుకల్లాగే తినడం, మితంగానే ఆహారం తీసుకోవడం వంటివి చేశాయి.
ఈ పరిశోధనతో ఎంతో మేలు
దేహం తాలూకు ఓ పూర్తిస్థాయి సమన్వయ వ్యవస్థ (హోమియోస్టాటస్) అంతా చక్కగా కొనసాగుతూ జీవక్రియలన్నీ సక్రమంగా జరిగేలా చూడటానికి కాలేయం తాలూకు ఏఏ అంశాలు, ఏఏ జన్యువులు పాలుపంచుకుంటున్నాయో పరిశీలించి, ఆ వ్యవస్థల కారణంగా దేహంపై పడే ప్రతికూల ప్రభావాలూ, దాంతో వచ్చే అనర్థాలూ, అనారోగ్యాలకు అవసరమైన చికిత్సలను తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఎంతగానో తోడ్పడుతుందన్నది పరిశోధకుల అభిప్రాయం. ఈ పరిశీలనల వెలుగులో ప్రజల ఆరోగ్య సంరక్షణలకు అసరమైన చర్యలూ, ప్రణాళికలు రూపొందింవచ్చన్నది అనేక ఆరోగ్య సంస్థలకు చెందిన అధికారులు, ప్రణాళికావేత్తల భావన.
Comments
Please login to add a commentAdd a comment