
98% ఎలక్ట్రిక్ స్కూటర్లలో సమస్యలు
పెట్రోల్ వేరియంట్లతో పోలిస్తే రెండింతలు
జె.డి.పవర్ తాజా అధ్యయనంలో వెల్లడి
సాక్షి, స్పెషల్ డెస్క్: పెట్రోల్ ఖర్చు తప్పుతుందని, నిర్వహణ వ్యయం తక్కువ అని, పర్యావరణ హితం అనే కారణాలతో ముచ్చటపడి కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు.. కొనుగోలు చేసిన కొన్నాళ్లకే ముందుకు కదలక మొరాయిస్తున్నాయి. పెట్రోల్‌తో నడిచే స్కూటర్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్లలో సమస్యలు దాదాపు రెండింతలు ఉన్నాయని జె.డి.పవర్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
100లో 98 ఈ–సూ్కటర్లలో సమస్యలు తలెత్తాయని గుర్తించారు. సంప్రదాయ స్కూటర్ల విషయంలో ఇది 53 మాత్రమే నమోదైంది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన 6,500 మందికిపైగా యజమానుల స్పందనల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది.
అధ్యయనంలోని అంశాలివీ..
పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాల్లో ఇంజిన్ పనితీరు, బ్రేకింగ్, రైడ్ నాణ్యత, విద్యుత్ వ్యవస్థలతో సహా కీలక అంశాలను ఈ అధ్యయనం విశ్లేషించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విషయంలో బ్యాటరీ పనితీరు, ఛార్జింగ్, వేగం తీరును ప్రమాణికంగా తీసుకున్నారు. నాణ్యత పరంగా అతి తక్కువ సమస్యలతో ఈవీ విభాగంలో బజాజ్ చేతక్, అన్ని విభాగాల్లో బెస్ట్ బ్రాండ్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ నిలిచాయి.
ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించే కొద్దీ సమస్యలు పెరుగుతున్నాయి. వాహనం కొనుగోలు చేసిన మొదటి ఆరు నెలల్లో 2,500 కిలోమీటర్లకు మించి నడిపిన కస్టమర్లు, తక్కువ ప్రయాణం చేసినవారితో పోలిస్తే సగటున 9 శాతం ఎక్కువ సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ ధోరణి ము ఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లలో స్పష్టంగా కనిపిస్తోంది. బ్రేక్స్, లైట్స్, ఎలక్ట్రికల్ విడిభాగాలతోపాటు వాహన పటుత్వం, ఫినిషింగ్ సమస్యలు అత్యంత సాధారణమయ్యాయి.
దేశంలో 86% ద్విచక్ర వాహనాల్లో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. యజమానులు వెల్లడించిన అత్యంత సాధారణ సమస్యల్లో ఇంజన్‌కు సంబంధించినవి 18% ఉన్నాయి. ఎలక్ట్రికల్ విడిభాగాలు, లైటింగ్ 15%, బ్రేకింగ్ సిస్టమ్స్ 15% ఉన్నాయి.
గత సంవత్సరంతో పోలిస్తే 2025లో కస్టమర్ సంతృప్తి మెరుగుపడింది. తమ వాహనాలకు ఊహించిన దానికంటే తక్కువ సమస్యలు ఉన్నాయని 58% మంది పేర్కొన్నారు. 2024లో ఈ సంఖ్య 44% ఉంది. ఊహించిన దానికంటే తక్కువ సమస్యలను ఎదుర్కొన్నామని 61% మంది ఈ–సూ్కటర్స్ ఓనర్స్ చెప్పారు.