బ్యాటరీ సరిగ్గా పనిచేయక ఇబ్బందులు
కొత్త బ్యాటరీతోపాటు రూ.25 వేలు అదనంగా చెల్లించండి
కంపెనీని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన వినియోగదారుల కమిషన్–1
హైదరాబాద్: ఎలక్ట్రిక్ స్కూటర్‌కి నాసిరకం బ్యాటరీ అమర్చినందుకు పీయూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్–1 ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కచ్చితంగా కంపెనీ, షోరూం సిబ్బంది అలసత్వమే అని స్పష్టం చేసింది. కంపెనీ జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలాంటి తప్పులకు తావు లేకుండా ఉండేదని సూచించింది. వినియోగదారుడి ఇబ్బందుల దృష్ట్యా రూ.20 వేల నష్ట పరిహారంతో పాటు రూ.5 వేలు కోర్టు ఖర్చులు ఇవ్వాలని కంపెనీకి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్–1 కమిషన్ అధ్యక్షురాలు ఉమా వెంకట సుబ్బలక్ష్మి , సభ్యులు లక్ష్మీప్రసన్న, మాధవిలతతో కూడిన బెంచ్ ఇటీవల తీర్పునిచ్చింది.
22 నెలల్లో 8 సార్లు బ్యాటరీ సమస్య..
హైదరాబాద్ (మారుతీనగర్ ఓల్డ్ బోయిన్‌పల్లి)కి చెందిన శ్రీనివాస్ రెడ్డి 2021లో పీయూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సంబంధించి ఈ డ్రైవ్ మున్నంగి మోటర్స్ షోరూంలో ఎలక్రి్టకల్ స్కూటర్ (పీయూఆర్ – ఈ – ప్లూటో – 7జీ) ను రూ. 90 వేలతో కొనుగోలు చేశాడు. ఒకసారి చార్జింగ్ పెడితే రెండు, మూడు రోజుల కంటే ఎక్కువ రాకపోవడం, ఎక్కడపడితే అక్కడ అకస్మాత్తుగా ఆగిపోవడం వంటి పలు రకాల సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.
దాదాపు 22 నెలల కాలంలో 8 సార్లు బ్యాటరీ సమస్యతో సరీ్వస్ సెంటర్‌కి వెళ్లాల్సి వచ్చింది. చాలాసార్లు కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. కొంత కాలానికి పరిశీలించిన సర్వీస్ సెంటర్ సిబ్బంది సాఫ్ట్‌వేర్ సమస్య ఉందని చెప్పినా దానికి సరైన పరిష్కారం మాత్రం చూపలేదు. అనంతరం షోరూం సిబ్బంది ఆగస్టు, 2022లో మరో బ్యాటరీని అమర్చారు. దీంతో ఆనందంతో స్కూటర్ తీసుకొని వెళ్లిన శ్రీనివాస్ రెడ్డికి తిరిగి 9 నెలల కాలంలో మళ్లీ అదే సమస్య ఎదుర్కొన్నాడు.
దీంతో తిరిగి మళ్లీ షోరూం సిబ్బంది సంప్రదించాడు. అయితే వారు బ్యాటరీని కంపెనీకి టెస్టింగ్ కోసం పంపాలని, తిరిగి బ్యాటరీ అమర్చాలంటే దాదాపు 3 నుంచి 4 నెలల కాలం పడుతుందని, అంతవరకు ఆగాలని జులై, 2023లో చెప్పారు. అయితే ఇప్పటికీ ఏడాది కాలం దాటినా బ్యాటరీ మాత్రం అమర్చలేదు. ఆ స్కూటర్ బ్యాటరీ లేకుండా నిరూపయోగంగానే ఉన్నది. దీంతో బాధితుడి సంబంధిత షోరూంకి వెళ్లి స్కూటర్‌ని తీసుకెళ్లి డబ్బును ఇవ్వండి, లేదా బ్యాటరీ అయినా మార్చి ఇవ్వండి అని అడిగారు.
కంపెనీ యాజమాన్యం, షోరూం సిబ్బంది çపట్టించుకోకపోవడంతో హైదరాబాద్ వినియోగదారుల కమిషన్–1ను ఆశ్రయించి తన గోడును విన్నవించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన కమిషన్ కంపెనీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వినియోగదారులకు సరైన సౌకర్యం ఇవ్వకుండా కాలయాపన చేయడమేంటని మండిపడింది. బాధితుడి ఎలక్ట్రిక్ స్కూటర్‌కు వెంటనే కొత్త బ్యాటరీ అమర్చాలని సూచించింది. అంతేకాకుండా మళ్లీ ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీని ఆదేశించింది. దీంతో పాటు అతనికి చెల్లించాల్సిన నష్టపరిహారం కూడా 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment