
2029 అసెంబ్లీ ఎన్నికల్లో భూభారతే ప్రధానం
నేడు భూభారతి పోర్టల్‌ను సీఎం ప్రారంభిస్తారు
3 జిల్లాల్లోని మూడు మండలాల్లో అమలు
జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తాం
మీడియాతో ఇష్టాగోష్టిలో మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: వచ్చే 2029 శాసనసభ ఎన్నికలకు భూభారతి చట్టం, పోర్టల్‌ను రెఫరెండంగా స్వీకరిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పునరుద్ఘాటించారు. భూములున్న ప్రతి ఒక్కరికి భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా ‘భూ భారతి’చట్టాన్ని, పోర్టల్‌ను తెస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం భూభారతి చట్టాన్ని, పోర్టల్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
సోమవారం నుంచే భూభారతి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇకపై ధరణి పోర్టల్ ఉండదని తెలిపారు. భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమా లపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. పోర్టల్ ప్రారంభం కాగానే ప్రజలంతా ఒకేసారి దానిని సందర్శించవద్దని, అలా చేస్తే పోర్టల్ ఆగిపోయే ప్రమాదం ఉందని మంత్రి చెప్పారు. కొంతమంది ఉద్దేశ పూర్వకంగా పోర్టల్‌ను నిలుపుదల చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
తొలుత 3 మండలాల్లో భూభారతి
భూభారతి చట్టాన్ని, పోర్టల్‌ను తొలుత మూడు జిల్లాల్లోని మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతు న్నట్లు పొంగులేటి తెలిపారు. ధరణిలో తలెత్తిన సమస్యలు భూభారతిలో రాకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అచ్చుతప్పులు, భూ విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, తండ్రి పేరు మార్పు, భూ లావా దేవీల్లో అవకతవకలను సరిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ మూడు మండలాల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్రమంతా ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు.
ధరణిని తెచ్చిన సమయంలో దాదాపు 4 నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని తెలిపారు. పార్ట్ బీలోని భూముల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండగా, భూభారతిలో 6 మాత్రమే ఉంటాయని వెల్లడించారు. భూభారతి అమలు కోసం ఎంపికచేసిన గ్రామాల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. భూభారతిలో ఎమ్మార్వో స్థాయి నుంచి సీసీఎల్‌ఏ వరకు ఐదు స్థాయిల్లో భూ సమస్యల పరిష్కారానికి వీలుగా అధికారాల వికేంద్రీకరణ చేసినట్లు వివరించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మే మొదటివారంలో గ్రామ పాలనాధికారులు
వచ్చేనెల మొదటివారంలో గ్రామాల్లో రెవెన్యూ పాలనా యంత్రాంగాన్ని పునరుద్ధరిస్తామని పొంగులేటి తెలిపారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వేయి మంది లైసెన్సుడ్ సర్వేయర్లను నియమిస్తామని మంత్రి ప్రకటించారు.