సాక్షి, హైదరాబాద్: అడవులు, పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణలో పెద్దపులుల తర్వాత చిరుతలు కూడా కీలకపాత్రను పోషిస్తున్నాయి. చిరుతలను కూడా ‘కీ స్టోన్’ స్పీషీస్‌గా పరిగణిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని చిరుత పులుల సంఖ్యను శాస్త్రీయ పద్ధతుల ద్వారా లెక్కించిన వివరాలు, అధికారిక గణాంకాల నివేదికను ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పెద్దపులుల పరిరక్షణ, వాటి సంఖ్యను అధికారికంగా అంచనా వేయడంలో భాగంగానే చిరుతపులుల సంఖ్యపైనా మొట్ట మొదటిసారిగా అధికారిక లెక్కలను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రకటించింది. కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ దేశంలో ఏయే రాష్ట్రాల్లో ఎన్ని చిరుతలున్నాయనే దానిపై అధికారిక గణాంకాలు వెల్లడించింది. మనరాష్ట్రంలో సంఖ్యాపరంగా 341 చిరుతలున్నట్టుగా అధికారికంగా వెల్లడైంది. ఈ దేశవ్యాప్త అధ్యయనానికి కొనసాగింపుగా 2022లో మరోసారి అధికారికంగా వీటి లెక్కలకు సంబంధించి కేంద్రం రెండో నివేదికను విడుదల చేయనుంది.
స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా నివేదికలో ఏముందంటే...
కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా-2018 పేరిట ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలో మొత్తం 12,852 చిరుత పులులున్నట్లుగా అంచనా వేస్తున్నారు. వీటిలో అత్యధికంగా సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్లలో 8,071 చిరుతలుండగా, అందులో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 3,421, పశ్చిమ కనుమల్లో భాగంగా ఉన్న కర్నాటక 1,783 చిరుతలతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్లలో అంతర్భాగంగా ఉన్న మహారాష్ట్ర 1,690 చిరుతలతో తృతీయ స్థానంలో నిలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 492, తెలంగాణలో 334 చిరుతలున్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. 2014లో దేశంలో దాదాపు 7,900 చిరుతలు ఉండగా 2018 నాటికి వాటి సంఖ్య 12,852కు (దాదాపు 60 శాతం) పెరగడం గమనార్హం.
చిరుతల పరిరక్షణా ముఖ్యమే...
దేశంలో పులులు, చిరుతల సంరక్షణకు చేపడుతున్న చర్యలు ఏ మేరకు ఫలప్రదం అవుతున్నాయనే విషయంపై నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్రాల అటవీశాఖలు, ఈ రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా వీటి సంఖ్యను శాస్త్రీయంగా గణిస్తోంది.
చిరుత తీరిది...
పెద్ద పులుల మాదిరిగానే రెండేళ్లకు పైబడిన చిరుతలను ‘అడల్ట్’గా పరిగణిస్తారు. రెండున్నరేళ్ల నుంచే అది సంతానోత్పత్తి మొదలుపెడుతుంది. 10 ఏళ్ల వయసు వచ్చేవరకు పిల్లలకు జన్మనిస్తుంది. చిరుతల ఆయుర్ధాయం సహజమైన అడవుల్లో 14, 15 ఏళ్లు ఉంటుంది. ఆహారం, వైద్యం అందుబాటులో ఉండటంతో పాటు ఇతర జంతువుల నుంచి ప్రాణహాని ఉండదు కాబట్టి జూలలో 17, 18 ఏళ్ల వరకు జీవించే అవకాశం ఉంటుంది. చిరుతలు పెద్దగా బరువు పెరగవు. గరిష్టంగా 55-60 కేజీల వరకు బరువుంటాయి. ఆహారం కూడా రోజుకు రెండు కేజీల మేర సరిపోతుంది.
చిరుతల సంఖ్య పెరిగేందుకే అవకాశాలు
రాష్ట్రంలో పెద్దపులులు, చిరుతపులుల సంఖ్య పెరుగుదలతో అడవులు, పర్యావరణానికి మంచి భవిష్యత్ ఉంటుంది. చిరుతల సంఖ్యపై తొలి నివేదిక తయారీలో కేంద్ర పరిశోధక బృందానికి రాష్ట్రం నుంచి అటవీశాఖ అధికారులు అవసరమైన సహకారాన్ని అందించారు. 2022 జనవరిలో రెండో నివేదికను కేంద్రం వెలువరించేందుకు సంబంధించి అవసరమైన ముందస్తు చర్యలు, సహకారాన్ని రాష్ట్ర అటవీశాఖ పరంగా అందజేస్తున్నాము. మనరాష్ట్రంలో చిరుతల సంఖ్య 341గా ఉన్నట్టుగా గత నివేదికలో వెల్లడైంది. వచ్చే జనవరిలో విడుదలయ్యే అధికారిక నివేదికను బట్టి తెలంగాణలో వాటి సంఖ్య కచ్చితంగా పెరుగుతుందనే భావిస్తున్నాము. -ఎ.శంకరన్, వైల్డ్ లైఫ్ విభాగం ఓఎస్డీ, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్
Comments
Please login to add a commentAdd a comment