
తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలన్నీ జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలి
సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
ఆత్మప్రబోధనానుసారం ఓటేయాలని పిలుపు
పీవీ నరసింహారావు తరువాత తెలంగాణ వ్యక్తికి మరో ఉన్నత హోదా అని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికను రాజ్యాంగ పరిరక్షకులకు, రాజ్యాంగ వ్యతిరేకులకు మధ్య జరుగుతున్న ఎన్నికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటున్న వారికి, ఏ పార్టీతో సంబంధం లేకుండా రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిన తెలంగాణ రైతు బిడ్డ, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలన్నీ సంపూర్ణ మద్దతునివ్వాలని కోరారు.
ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ప్రకటించడం తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవ ప్రతిష్టలను పెంచిందన్నారు. ఎన్నికల కమిషన్‌ను కూడా దుర్వినియోగం చేసి, బతికున్న ఓటర్లను చనిపోయినట్లు, లేని ఓటర్లను ఉన్నవారిగా చూపిస్తూ.. ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్న ఎన్డీయే ఒక పక్కన, అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే, రాజ్యాంగబద్ధ్ద సంస్థలను పరిరక్షించే ఇండియా కూటమి మరోవైపు ఉన్నాయని అన్నారు, ఇండియా కూటమి ఉపరాష్టపతి అభ్యర్థిని ప్రకటించిన తరువాత రేవంత్‌రెడ్డి తన నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు.
మనమంతా ఏకం కావాలి
ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా, వ్యవసాయ కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంపికచేసిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన, ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిన పీవీ నరసింహారావు తరువాత తెలంగాణకు చెందిన వ్యక్తి రెండో అత్యున్నత పదవికి పోటీకి ప్రకటించడం మనందరికీ గర్వకారణం. తెలుగు ప్రజలుగా రాజకీయాలకు అతీతంగా ఆత్మప్రబోధనానుసారం ఓటు వేయాలి. ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత తెలుగువారందరిది.
మొత్తం 42 మంది లోక్‌సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులం ఒకతాటిపైకి వచ్చి మద్దతు ప్రకటించాలని కోరుతున్నా. టీడీపీ, బీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, ఎంఐఎం, జనసేన పార్టీల నాయకులు చంద్రబాబు, కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ, పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నా. బీజేపీ పార్లమెంట్ సభ్యులను, ఉభయ కమ్యూనిస్టు పార్టీలను కూడా కోరుతున్నా. రాజకీయాలకు అతీతంగా మనం ఏకం కావాల్సిన సందర్భం ఇది’అని రేవంత్ చెప్పారు.
తమిళ, తెలుగు రాష్ట్రాల మధ్య పోటీకాదు
‘1991లో ప్రధాని రేసులో ఉన్న పీవీ నరసింహారావు నంద్యాల ఎంపీగా పోటీ చేసినపుడు.. కాంగ్రెస్, టీడీపీ సిద్ధాంతపరంగా పూర్తి వైరుధ్యం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఆరోజు పీవీపై పోటీ పెట్టకుండా రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు. ఈరోజు ఒక తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం, ఆ తరువాత రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీలు విజ్ఞత ప్రదర్శించాలి’అని రేవంత్‌రెడ్డి చెప్పారు.
జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా మీరు ఉభయ రాష్ట్రాల్లోని పార్టీ నాయకులను వ్యక్తిగతంగా కలుస్తారా? అని అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతునివ్వా లని బహిరంగంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అని బదులిచ్చారు. బీఆర్‌ఎస్‌ను ఎలా మద్దతు అడుగుతారని ప్రశ్నించగా.. ‘జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కాదు. పార్టీ సభ్య త్వం లేదు. కాంగ్రెస్ ఎంపిక చేయలేదు.
ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థి‘అని అన్నారు. ఇది తమిళ, తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ కాదని వ్యాఖ్యానించారు. ఓబీసీ బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసిన మీరు.. ఇప్పుడు ఓబీసీ వ్యక్తిని ఎన్డీయే నిలబెడితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్న ప్రశ్నకు సీఎం స్పందిస్తూ ‘జస్టిస్ సుదర్శన్‌రెడ్డి బలహీన వర్గాలకు బలమైన గొంతుక. రాష్ట్రపతి వద్దనున్న బీసీల రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుంటున్న ఎన్డీయే అభ్యర్థి, బలహీనవర్గాల వ్యక్తా.? బలహీనవర్గాలకు అండగా నిలబడాల్సిన వ్యక్తా’అని సీఎం ఎదురు ప్రశ్నించారు.