కలెక్షన్ కింగ్ | Collection King | Sakshi
Sakshi News home page

కలెక్షన్ కింగ్

Published Sun, Feb 7 2016 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM

కలెక్షన్ కింగ్

కలెక్షన్ కింగ్

 దేడ్ కహానీ - సింగ్ ఈజ్ కింగ్
 ఒకటిన్నర దశాబ్ద కాలంలో బాలీవుడ్ గమనం...
 వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు


 భారతీయులకి ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఎవరు ఎంత ఎత్తు ఎదిగితే, వాళ్లమీద అన్ని సెటైర్లు, జోకులూ వేయడం. భారత భూభాగంలో పంజాబ్ ప్రాంతంలో సిక్కు మతస్థుల్ని సర్దార్లు అంటారు. వీళ్ల పేర్ల చివర మనకి రెడ్డి, చౌదరి, శాస్త్రి, నాయుడు అని ఉన్నట్టు సింగ్ అని ఉంటుంది. వీళ్లకి తలమీద ఓ కోక కూడా ఉంటుంది. దాన్ని టర్బన్‌గా తలకి చుట్టుకుంటారు. అది ఆచారం. వీళ్లు చాలా బలిష్టులు, మంచివాళ్లు, యుద్ధ రంగంలో కమాండర్ల స్థాయిలో పోరాట యోధులు, చాలా మంచి పేరు, మర్యాద కలిగినవాళ్లు. కానీ వీళ్లనిని బఫూన్‌లని చేసి కడుపారా నవ్వుకుంటుంది శాడిస్టు సమాజం.
 
 ‘‘ఓ సర్దారు ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ షాపుకెళ్లాడు. నాకీ చిన్న టీవీ సెట్ కావాలన్నాడు. షాపువాడు, నేను సర్దార్జీకి అమ్మను అన్నాడు. వెంటనే ఇంటికెళ్లి టర్బన్ తీసేసి, గెటప్ మార్చి మళ్లీ షాపుకి వచ్చి, నాకీ చిన్న టీవీ కావాలన్నాడు. షాపువాడు, చెప్పానా, నేను సర్దార్జీకి అమ్మను అన్నాడు. సర్దార్జీకి కోపం వచ్చి, మళ్లీ ఇంటికెళ్లి జుత్తు, గెడ్డం కూడా తీసేసి, పూర్తిగా వేషం మార్చుకుని, మారువేషంలో షాపుకొచ్చి, నాకీ టీవీ కావాలన్నాడు. షాపువాడు కోపంగా, ఎన్నిసార్లు చెప్పాలయ్యా, నేను సర్దార్జీలకి అమ్మనని అన్నాడు. ఎలా గుర్తుపట్టేస్తు న్నావు నన్ను అని అడిగాడు సర్దార్జీ. ఎలా అంటే, ఇది టీవీ కాదు. మైక్రో అవెన్ కాబట్టి అన్నాడు తాపీగా షాపువాడు.
 
 దేశ పరిరక్షణలో ప్రాణాలొడ్డే వీర సోదరులు మనకి బ్రహ్మా నందం, పోసాని, పృథ్వీ లాంటి పాత్రల ముడి సరుకులు. అయినా మనం బాధ పడక్కర్లేదు. ఇదీ దేశ సేవే. అలాక్కూడా వాళ్లు మన ఆరోగ్యాల్ని కాపాడుతున్నట్టే. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకో అర్థమయ్యే ఉంటుంది. 2008లో అనీస్ బజ్మీ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రధారులుగా వచ్చిన ‘సింగ్ ఈజ్ కింగ్’ సినిమా గురించి. యాభై కోట్లకి, నూట యాభై కోట్లు వసూలు చేసిన సూపర్‌హిట్.
 
  ‘వెల్‌కమ్’ సినిమా సూపర్ హిట్ తర్వాత ఆ స్థాయిలో నవ్వులు పూయించాలంటే ఈ నేపథ్యం తప్పనిసరని భావించినట్టున్నాడు దర్శకుడు అనీస్ బజ్మీ. ఆయన అంచనా నిజమైంది. అడుగు తీసి అడుగేస్తే నవ్వించే ప్రయత్నం చేశాడు సినిమా అంతా. దీపావళి టపాసుల్లా కొన్ని పేలొచ్చు, కొన్ని పేలకపోవచ్చు. కానీ ఆయన ప్రయత్నం మాత్రం ఫలించింది. కలెక్షన్లు బాగా వచ్చి, నిర్మాత మొహంలో నవ్వులు పూయించి,‘కలెక్షన్’ కింగ్ అనిపించుకున్నాడు సింగ్. ఆస్ట్రేలియాలో పెద్ద అండర్‌వరల్డ్ డాన్ లక్కీసింగ్ (సోనూసూద్). అతని అన్న మిఖాసింగ్. అతని అనుచరులంతా ఊరి నుంచి పారిపోయి వచ్చిన సింగ్‌లే. వీళ్ల మాఫియాలో లక్కీని అందరూ ‘కింగ్’ అంటారు... డాన్ లాగ.
 
 పంజాబ్‌లో ఉన్న ఓ మారుమూల కుగ్రామంలో ఒక అమాయకుడు, మంచివాడైన యువకుడు హ్యాపీసింగ్ (అక్షయ్ కుమార్). ఇతను చేసే ప్రతి చిన్న పనీ ఎవరో ఒకరికి తీరని నష్టం కలిగిస్తుంది. దాని వెనుక ఏ దురుద్దేశం లేకపోయినా, అతని వల్ల జరిగే నష్టాల కారణంగా తనని ఎలాగైనా ఊరి నుంచి పంపించేయాలని అదే వూళ్లో ఉన్న రంగీలా (ఓమ్‌పురి) ప్లాన్ చేస్తాడు. హ్యాపీ ఊళ్లో ఉన్నంతవరకూ తనకి పెళ్లి చెడిపోతూనే ఉంటుందని అతని భయం. చివరికి ఒక సంబంధం కుదిరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయుంటుంది రంగీలాకి. అలాంటి సమయంలో ఆస్ట్రేలియాలో కింగ్ మాఫియా గురించి లక్కీ ఫొటోతో ఒక న్యూస్ వస్తుంది. ఇక్కడున్న లక్కీ తండ్రికి కడుపునొప్పి వస్తుంది అదే రోజు అసిడిటీతో.
 
  రెండింటినీ కలిపి రంగీలా ఊరివాళ్లతో పథకం పన్నుతాడు. పేపర్‌లో న్యూస్ వల్లే లక్కీ తండ్రికి గుండెపోటు వచ్చిందని. హ్యాపీ వెళ్లి లక్కీని తీసుకొస్తే గానీ ఆ ముసలాయన ప్రాణం నిలబడదని. హ్యాపీ ఒప్పుకుంటాడు బలవంతంగా. కానీ తనకి ఇంగ్లీషు రాదు. ఊళ్లో నాలుగు ఇంగ్లీషు ముక్కలు ఇంగ్లీషు మాట్లాడగలిగిన రంగీలా తోడుగా రావాలని హ్యాపీ ఊరివాళ్లని ఒప్పిస్తాడు. ఊరివాళ్లంతా వీళ్లిద్దరికీ చందాలేసుకుని మరీ ఆస్ట్రేలియా టిక్కెట్లు కొని పండగ చేసుకుంటారు. తీరా కనెక్టింగ్ ఫ్లయిట్ క్యాచ్ చేయాల్సిన టైమ్‌లో వేరేవాడికి డ్యాష్ ఇచ్చి బోర్డింగ్ పాసులు మారిపోయి (?) (లాఫ్టర్‌కి లాజిక్కులు ఉండవు)
 
 ఆస్ట్రేలియా బదులు ఈజిప్టు వెళ్తారు.
 అక్కడ హ్యాపీ కత్రినాకైఫ్‌ని చూసి ఆమె బ్యాగ్ కొట్టేసిన దొంగని పట్టించి ఆమెతో రోజంతా గడిపి ప్రేమలో పడిపోయి ఎయిర్‌లైన్స్ వాళ్లిచ్చిన ఆస్ట్రేలియా టిక్కెట్లతో (?) ఈజిప్టు నుంచి ఆస్ట్రేలియా వచ్చేస్తారు. ఆస్ట్రేలియాలో లక్కీసింగ్‌ని రమ్మని బతిమాలితే రాడు. పైగా హ్యాపీని, రంగీలాని మెడపట్టి బైటకి గెంటేస్తాడు. నడిరోడ్డున ఉన్న హ్యాపీని కిరణ్ ఖేర్ ఆదరిస్తుంది. నీడనిస్తుంది.

 తర్వాత లక్కీ మీద జరిగిన ఓ అటాక్‌లో హ్యాపీ లక్కీ ప్రాణాలు కాపాడబోయి అతని తలకి పెద్ద దెబ్బ తగిలేలా చేస్తాడు అనుకోకుండా. దాంతో లక్కీ కోమాలోకి వెళ్తాడు. చూపు, ఒళ్లు, చెవులు అన్నీ పనిచేస్తాయి బ్రెయిన్ తప్ప. అతడు చేసిన ఓ సైగ వల్ల... లక్కీ బాగయ్యే వరకూ హ్యాపీనే కింగ్ అవ్వ మంటున్నాడని అర్థం చేసేసుకుంటారు సర్దార్జీలంతా.
 
 హ్యాపీ కింగ్ అయ్యాక కిరణ్ కూతురు, అల్లుడు ఈజిప్టు నుంచి వస్తున్నారని, తన పేదరికం కూతురికి తెలీదని ఏడుస్తుంటే (?)... లక్కీ తన హోటళ్లు, బంగ్లాలు ఆవిడవిగా నమ్మించి, అతను మేనేజరుగా, మిగిలిన మాఫియా అనుచరులంతా సర్వెంట్లుగా నాటకం ఆడ తారు. తీరా వచ్చిన కూతురు తను ప్రేమించిన కత్రినాకైఫ్, కాబోయే అల్లుడు బోర్డింగ్ పాస్ మారడానికి కారకుడైన గుద్దిన వ్యక్తి పునీత్. వాళ్ల పెళ్లికి ఎన్ని మంచి ప్రయత్నాలు చేసినా అవి బెడిసికొట్టి చివరికి హ్యాపీకి, కత్రినాకి పెళ్లవుతుంది. లక్కీకి బ్రెయిన్ పనిచేసి, మాఫియాని మంచితనంతో మార్చిన హ్యాపీని కౌగిలించుకుని తనతో కలిసి పంజాబ్ వెళ్లిపోతాడు. కథ సుఖాంతం.
 
 ఈ మొత్తం వ్యవహారంలో కళ్లు సరిగా కనపడని, చెవులు సరిగా వినపడని లక్కీ అన్న మిఖాసింగ్‌గా జావెద్ జాఫ్రీ చాలా నవ్విస్తాడు. హిందీ సినిమాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే... అంతర్జాతీయ మార్కెట్ అవ్వడం వల్ల చిన్న కామెడీ కథల్ని కూడా భారీ తారాగణంతో ‘బాహుబలి’లా తీసేస్తారు. దానివల్ల సినిమా ఎక్కడైనా బోరు కొట్టినా, నవ్వించకపోయినా విజువల్‌గా భారీగా ఉండో, ఫైట్లు, ఛేజ్‌లు, పాటలు గ్రాండ్‌గా ఉండో చక్కగా పాసైపోతుంటుంది.
 
 ఆలోచనాత్మకమైన కమర్షియల్ హిట్స్‌కి ముందు, అనాలోచితంగా తీస్తే సూపర్‌హిట్ అయిన సినిమాలు 2008లో ‘సింగ్ ఈజ్ కింగ్’ వరకూ బాలీవుడ్‌ని శాసించాయని చెప్పచ్చు. తర్వాత సినిమాల నుంచి బాలీవుడ్ తీరుతెన్నులు చాలా మారిపోయినట్టు తెలుస్తుంది.  పి.ఎస్.: నేను పెట్టిన క్వశ్చన్ మార్కులన్నీ కథ రాసేటప్పుడు కనీసం ఊహించడానికి కూడా సాహసించని విషయాలు. అయితే ధైర్యంగా సినిమాగా తీసేస్తే... అవేవీ హిట్‌కి అడ్డం రాని విషయాలు అని అర్థం అయింది. ఏదైనా ప్రేక్షకుడికి నచ్చేలా తీయడమే సక్సెస్. అలా తీసి భారీ హిట్టు కొట్టేశాడు అజ్మీ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement