యెద యెదలో రగిలిన స్ఫూర్తి | Rang De Basanti story | Sakshi
Sakshi News home page

యెద యెదలో రగిలిన స్ఫూర్తి

Published Sun, Sep 27 2015 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

యెద యెదలో రగిలిన స్ఫూర్తి

యెద యెదలో రగిలిన స్ఫూర్తి

దేడ్ కహానీ  - రంగ్ దే బసంతీ
‘‘మరగకపోతే రక్తం కాదది, నీటితో సమానం. దేశానికి పనికిరాకపోతే యువత కాదది, నిర్వీర్యం’’ అని అర్థం వచ్చేలా టైటిల్ పడింది. చాలా అర్థవంత మైన సినిమా చూడబోతున్నానని అర్థం అయ్యింది. గంటా ఇరవై ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకెన్ల దగ్గర వచ్చే ఒక సన్నివేశం - అనూహ్యమైనది. అది రాసిన రచయితలకి, తీసిన దర్శకుడికి, అభిమాని కానివాడు ప్రేక్షకుడే కాడు.
 
భారత స్వాతంత్య్ర సమరయోధుల్ని చంపే బాధ్యతని నిర్వర్తిస్తున్న బ్రిటిషు పోలీసు అధికారి చర్చ్‌కి వెళ్లి జీసస్ దగ్గర ఏడవడం,  తను చంపుతున్న సమర యోధులు చిరునవ్వుతో దేశం కోసం ప్రాణాలని అర్పిస్తుంటే, వారికి అతను అభిమానిగా మారడం... ఒక పక్క పాలకుల ఆజ్ఞ, మరోపక్క మానవ హృదయం - ఈ సంఘర్షణని ఇంత అందంగా చూపించిన సినిమా, ఈ నేపథ్యం ఉన్న కథల్లో ఎక్కడా లేదు. స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో తీసిన ప్రతి సినిమా దేశభక్తిని హీరోని చేసి పాలకుల్ని విలన్లని చేస్తుంది. అది సాధారణ కాన్‌ఫ్లిక్ట్. కానీ దేశభక్తికి విధి నిర్వహణకి సమానంగా అంతః సంఘ ర్షణని చూపించడం అసాధారణ కాన్‌ఫ్లిక్ట్.
 
ఇప్పటివరకూ - స్వాతంత్య్ర పోరాట యోధుల కథలు పూర్తిగా పీరియాడికల్ సినిమాలుగానూ, ఈనాటి యువతరం కథలు పూర్తిగా మోడరన్‌గానూ అంటే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టు తీస్తూ వచ్చారు. కానీ మొదటి సారి ఆనాటి యువ దేశభక్తులైన హీరోల కథని, ఈనాటి అల్లరి చిల్లరి యువ హీరోల కథని కలిపి ఒకే కథగా అల్లుకో వడం, అందుకు సూత్రధారిగా ఒక బ్రిటిష్ అమ్మాయి పాత్రనే సృష్టించడం... నిజంగా అద్భుతమైన ఆలోచన.

ఆ ఆలోచనకి ఫలితమే... ‘రంగ్ దే బసంతి’. దాన్ని నిర్మించి, దర్శకత్వం వహించిన వ్యక్తి రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా. హీరోగా నటించింది... తన పాత్ర చుట్టూ కథ, కథనాలు పరిభ్రమించాలనుకోకుండా, మంచి కథ, కథనాలతో ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉండాలనుకునే ఆమిర్‌ఖాన్. నాకు తెలిసి... ఇలా ఆలోచించి సినిమాలు ఓకే చేసే హీరో ఇండియాలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఆయన ఒక్కరే. ఇలాంటి కథలు చేయడానికి అంగీకరించే పెద్ద హీరోల్ని అభినందించి తీరాలి.
 
ఈ దశాబ్దన్నరలో బాలీవుడ్‌లో మూసధోరణి పోయి ప్రేక్షకులు ఆదరించేలా మంచి కథలు వస్తున్నాయి. ఈ విషయం ఒక్కో సినిమా వచ్చి వెళ్తున్నప్పటికంటే, ఈ వ్యాసం రాయడం కోసం వరసగా ఆ సినిమాలు మళ్లీ చూస్తున్నప్పుడు బాగా తెలుస్తోంది నాకు. ఇక ‘రంగ్ దే బసంతి’ విషయానికి వద్దాం.
 
న్యూఢిల్లీలో నివాసముంటున్న పంజాబీ కుటుంబంలో పుట్టిన రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా యురేకా ఫోర్బ్స్ కంపెనీలో వాక్యూమ్ క్లీనర్లు అమ్మేవాడు. తర్వాత ఒక అడ్వర్టయిజింగ్ కంపెనీని పెట్టి కోక్, పెప్సీ, టయోటా, బీపీఎల్ కంపెనీలకి యాడ్స్ తీశాడు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్‌తో ‘అభీ బేబీ’ అనే మ్యూజిక్ వీడియో తీశాడు. 2001లో అమితాబ్ ప్రధాన పాత్రలో, మనోజ్ బాజ్‌పాయ్ సహనటుడిగా ‘అక్స్’ అనే సినిమా తీశాడు.

అక్స్ అంటే రిఫ్లెక్షన్. ఈ దర్శకుడు తన ఆలోచనలని తెరమీదకి సరిగా రిఫ్లెక్ట్ చేయలేడు అనిపించింది ‘అక్స్’ చూసి. కానీ అమితాబ్‌కి అవార్డుల పంట పండింది. అర్థం కాకపోతే అవార్డులెక్కువొస్తాయేమో అనుకున్నాను నా ఇగోని శాటిస్‌ఫై చేసుకోడానికి. ఆ తర్వాత రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్ సినిమాలు తీశాడు మెహ్రా.

అంతే... ఫిదా అయిపోయాను అతడి టాలెంట్‌కి. తను రిటైరైపోయినా ఈ రెండు సినిమాలూ చాలు తనని తరతరాలు గుర్తు పెట్టుకోడానికి. నేను, నాలాంటి చాలామంది దర్శకులు జీవితాంతం టైర్ అవుతూనే ఉండాలి తన సినిమాల స్థాయిని అందుకోడానికి. అందుకే ‘భాగ్ మిల్కా భాగ్’ చూసిన తర్వాత నా ఫేస్‌బుక్‌లో పెట్టాను- ‘‘సిగ్గేస్తోంది, దర్శకుడైన పదేళ్లలో ఇలాంటి సినిమా ఒక్కటి కూడా ఇంకా తీయనందుకు’’ అని. దటీజ్ ఓం ప్రకాష్ మెహ్రా.
 
మళ్లీ రంగ్ దే బసంతి విషయానికి వద్దాం.
భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో బ్రిటిష్ జనరల్‌గా ఇండియాలో పనిచేసిన మెకిన్‌లే మనవరాలు, స్యూ మెకిన్‌లే బ్రిటన్ టెలివిజన్ చానల్‌లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తూ ఉంటుంది. తాతగారు రాసుకున్న డైరీ చదివితే అందులో భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి మహామహుల బలిదానాలు, వాటి పర్యవసానాలు ఉంటాయి. దానిని ఫిల్మ్ చేసి, ఆ కథల్ని ప్రజలకి చూపించాలని ఆశ పడుతుంది. చానల్ ఓనర్‌ని అడిగితే, అవి బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ రిజెక్ట్ చేస్తుంది.
 
దాంతో ఎలాగైనా తన తాతగారి డైరీ కథల్ని సినిమాగా తెరకెక్కిస్తానని చాలెంజ్ చేసి ఢిల్లీ వస్తుంది స్యూ. అక్కడ తన ఫ్రెండ్ సోనియాని (సోహా అలీ ఖాన్) కలుస్తుంది. సోనియా ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతుంటుంది. ఆమె స్నేహితులు డీజే, కరణ్, అస్లమ్‌ఖాన్, సుఖీరామ్... నలుగురూ పరమ అల్లరి మూక. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలనుకునే ఆధునిక మెట్రో నగరాల యువతలాగ ఉంటారు. వీళ్ల స్నేహితుడు అజయ్‌సింగ్ రాథోడ్ ఆర్మీలో యుద్ధ విమానాల పైలట్. అతి కష్టమ్మీద తన భారత స్వాతంత్య్ర సమర వీరుల కథలో ముఖ్య పాత్రలకి ఈ అయిదుగురినీ ఒప్పిస్తుంది స్యూ.
 
కానీ వాళ్లకి దేశమంటే లెక్కలేదు. నిన్న ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం లేదు. రేపు ఎలా ఉండాలో అన్న ఆలోచన లేదు. ఈరోజు బావుంటే చాలు... అంతే. అలాంటి వారిని నెమ్మదిగా దేశభక్తుల, అమరవీరుల పాత్రలు, ఆలోచనలు కొంచెం కొంచెం ప్రభావితం చేస్తాయి. వాళ్లెందుకు ప్రాణ త్యాగం చేసి చిరునవ్వుతో దేశం కోసం చనిపోయారు అన్న ఆలోచన నుంచి... మనం దేశం కోసం ఎలా బతకాలి అని ఆలోచించే స్థాయికి చేరుకుంటారు. అవినీతితో ఆవిరైపోయిన నీతిని సమాజంలో నింపడానికి కంకణం కట్టుకుంటారు.
 
సరిగ్గా అదే సమయంలో వాళ్ల స్నేహితుడు అజయ్ మిగ్-21 యుద్ధ విమానం నడుపుతూ మరణించడం వాళ్లని కుంగదీస్తుంది. గత పదిహేను సంవత్సరాలలో 206 మిగ్ యుద్ధ విమానాలు కూలిపోయాయి, 78 మంది ఆర్మీ పైలట్లు అసువులు బాశారు, 1964 నుంచి మన దేశం వాడుతున్న మిగ్ విమానాల పనిముట్ల దిగుమతిలో జరుగుతున్న స్కామ్... ఈ విమానాలు నాసిరకంగా తయారై మన సైనికుల ప్రాణాలు పోవడానికి కారణం అని తెలుసుకున్న ఈ నలుగులూ తమ స్నేహితుడి మృతికి కారణమైన రక్షణ మంత్రిని చంపేస్తారు. తీవ్ర వాదులుగా ముద్రపడతారు.

చివరికి ఆకాశవాణిలో నిజాన్ని నేరుగా ప్రజలకి వివరిస్తారు. అయినా పోలీసుల చేతిలో హతమౌతారు. పరాయివాడి పాలన కోసం అసువులు బాసిన వీరులలాగే చిరునవ్వులు చిందిస్తూ, వారి పాత్రలు తమలో నింపిన స్ఫూర్తిని మొత్తం యువతరానికి రేడియో ద్వారా పంచుతూ, స్వ పరిపాలనలో అవినీతి రాజకీయ నాయకుల రాక్షస ఘాతానికి బలై పోతారు. ఇది కథా? ఒక సినిమా కథా? కాదు... జీవితం. ఇది వాస్తవం.
 
వ్యవస్థలో చెడుని మనం కూకటివేళ్లతో సహా పెకలించి మార్పును తేలేం. కానీ మనం మారడం ద్వారా వ్యవస్థలో మార్పు దానంతట అదే వస్తుంది. ఇవాళ కాకపోయినా రేపు. రేపు కాకపోతే ఎల్లుండి. మారాలన్న ఆలోచన మనకి ఉండాలి. అంతే.
 
బాధ్యతారాహిత్యంగా ఉన్న యువతకి దిశానిర్దేశం చేసేవాడు వట్టి సినిమా దర్శకుడు మాత్రమే కాడు. సమాజానికి దార్శనికుడు కూడా. రాజ్‌కుమార్ హిరానీ తర్వాత ఆ కోవలోకి వచ్చే రెండో వ్యక్తి రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా అని కచ్చితంగా చెప్పొచ్చు. అతుల్ కులకర్ణి, సిద్ధార్థ, అతిథి పాత్రలో మాధవన్ చాలా బాగా నటించి మెప్పించారు. ఎ.ఆర్.రెహమాన్ పాటలు అత్యద్భుతం. నిజానికి ఆస్కార్‌కి రెండు ట్రాక్స్ నామినేట్ అయ్యాయి కూడా.
 
ఇవన్నీ ఏమో కానీ, నేను మాత్రం వీలు చూసుకుని రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దగ్గరకెళ్లాలి అని నిర్ణయించుకున్నా. సినిమాలు ఎలా తీయాలో నేర్చుకోవడానికి కాదు. అది నాకూ కాస్తో కూస్తో వచ్చు. అయినా వెళ్లాలను కుంటున్నాను. దేనికో తెలుసా? ఒక సినిమాని ఎలా ఊహించాలో, మనకొచ్చే కొన్ని వందల థాట్స్‌లో ఏ థాట్‌ని సినిమాగా మలచాలో, ఒక దర్శకుడు ఒక వస్తువులో మంచి కథ ఉందని ఎలా గ్రహి స్తాడో, అలాంటి కథని ఎలా ఎంచు కుంటాడో నేర్చు కోవడానికి. వచ్చే వారం మరో మంచి సినిమాతో కలుద్దాం.
- వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement