షేక్‌స్పియర్ బాహుబలి! | Shakespeare Baahubali! | Sakshi
Sakshi News home page

షేక్‌స్పియర్ బాహుబలి!

Published Sun, Oct 25 2015 7:39 PM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

షేక్‌స్పియర్ బాహుబలి!

షేక్‌స్పియర్ బాహుబలి!

దేడ్ కహానీ - ఓంకార
* షేక్‌స్పియర్ నవలకు చిత్రరూపం.
* అవార్డులందుకున్న చిత్రరాజం.
* విశాల్ ప్రతిభకు తార్కాణం.
ఈవారం సినిమా గురించి రాసేముందు చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పి తీరాలి. 1998, 99 మధ్య ప్రాంతాల్లో ఇందిరా పార్క్ దగ్గరలో నివాసం ఉంటూ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతుండేది శిరీష అనే నా విజయవాడ స్నేహితురాలు.

చాలా బాగా చదివేది. అలాగే సినిమాలన్నా, వాటిని చూసి విశ్లేషించడమన్నా తనకు యమా ఇష్టం. ట్రైలర్ చూసి ఆ కథని ఊహిం చెయ్యడం, ట్రైలర్ చూసి ఆ సినిమా ఆడుతుందో లేదో కరెక్ట్‌గా చెప్పగలగడం ఆమె ప్రత్యేకతలు. తను ఇంగ్లిషు లిటరేచర్ బాగా చదివేది. నేనోసారి అడిగాను... ఇంగ్లిషు సాహిత్యంలో ఇవాళ్టి సినిమాలకి పనికొచ్చే కథలేమన్నా ఉన్నాయా అని. ఒక్కక్షణం కూడా ఆలో చించకుండా టక్కున చెప్పింది షేక్‌స్పియర్ డ్రామాలున్నాయ్ అని. నాకు కొద్దిగా ఐడియా ఉంది గానీ, అవి అంత మోడరన్ అనిపించలేదెప్పుడూ. తను ఎందుకలా అందో అని, నాకు తెలుగులో ఒక్కో షేక్‌స్పియర్ డ్రామాని కథలాగ చెప్పమన్నాను.
 
రోజూ సాయంత్రం నాలుగు నుంచి అయిదు మధ్య ఇందిరా పార్కు రోడ్డు మీద, వాళ్లింటి వరండాలో, ఎదురుగా ఉన్న బేకరీలో... రోజుకొక షేక్‌స్పియర్ డ్రామాని కథలాగ చెప్పేది. ఒకరోజు మాక్‌బెత్, ఒకరోజు ఒథెల్లో, ఇంకోరోజు హామ్లెట్, ఇంకోరోజు కింగ్‌లియర్, ఏ మిడ్ సమ్మర్ నైట్స్‌డ్రీమ్, మర్చెంట్ ఆఫ్ వెనిస్, మచ్ ఎడో అబౌట్ నథింగ్, యాజ్ యూ లైక్ ఇట్, ట్వెల్త్ నైట్, రోమియో అండ్ జూలియట్, ద ట్రాజెడీ ఆఫ్ జూలియస్ సీజర్ ఇత్యాదివి ఓ పదిహేను రోజుల పాటు ఓపిగ్గా నేరేట్ చేసింది. ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవాళ్టి తరానికి ఆమోదయోగ్యమైన సినిమా అవుతుందని నాకనిపించలేదు ఆ రోజు.

అదే తనకి చెప్పి షేక్‌స్పియర్ కథల చర్చ ఆపేశాను. 1600వ టైమ్‌లో రాసిన డ్రామా ఇవాళ్టి జీవితంలో ఎలా జరుగుతుందనేది నాకర్థమయ్యేది కాదు. ప్రేక్షకుడు ఎలా కనెక్ట్ అవుతాడని! నా ఆలోచన పూర్తిగా తప్పని నిరూపించాడు దర్శకుడు, రచయిత, నిర్మాత, సంగీత దర్శకుడు విశాల్ భరద్వాజ్. బాలీవుడ్‌లో మిలీనియమ్ సంచలనం అతను.
 
సంగీత దర్శకుడిగా పద్దెనిమిది సినిమాలు చేశాక... ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందాక... బాగా బిజీగా ఉన్న టైములో రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా మారి... మళ్లీ వాటితో పాటు సంగీత దర్శకత్వం తనే చేస్తూ... దర్శకుడిగానూ, సంగీత దర్శకుడి గానూ రెండేసి అవార్డులు అందుకుంటున్న ఈతరం మేధావి విశాల్. పది సినిమాలు తీసి ఆరు నేషనల్ అవార్డ్స్ అందుకున్న దర్శకుడు.
 
షేక్‌స్పియర్ నాటకాలలో మాక్‌బెత్‌ని ‘మక్బూల్’గా, ఒథెల్లోని ‘ఓంకార’గా, హామ్లెట్‌ని ‘హైదర్’గా రూపొందించి ఈ తరం ప్రేక్షకులకి 1600వ శతాబ్దపు మానవ బంధాల మధ్యనున్న భావో ద్వేగాల రుచి చూపించి సక్సెస్ అయ్యారు విశాల్. షేక్‌స్పియర్ నాటకాలు చాలా మంది పాఠకులు చదివే ఉంటారు. కానీ చాలామంది ప్రేక్షకులు చదవరు.
 
1600లోనే ఒథెల్లో నాటకాన్ని ఒక చిన్న కథానిక నుంచి స్ఫూర్తి పొంది రాసినట్టు చెప్పుకొచ్చారు షేక్‌స్పియర్. 2000 తర్వాత దానిని సినిమాగా స్ఫూర్తి పొందడంలో తప్పేముంది! ఇంకో విశేషం ఏంటంటే, ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గొప్పగా మాట్లాడుకుంటున్న మన తెలుగు సినిమా ‘బాహుబలి’... ‘ఓంకార’ చిత్రంలో హీరో అజయ్ దేవ్‌గన్ పదవి పేరు.

మహారాష్ట్రలో ‘భాయి’, తమిళ నాడులో దళపతి, నాయగన్... ఇవన్నీ మాఫియా లేదా రౌడీల బాస్‌ల సర్వ నామాలు. అలా ఉత్తర్‌ప్రదేశ్‌లో బాహు బలి అంటారు ఒక రౌడీ లీడర్‌ని. ఆ పదవి అజయ్ దేవ్‌గన్ పోషించిన ఓమీ భాయ్‌ది. అతనికి ఇద్దరు అనుచరులు... లంగ్‌డా త్యాగి, కేశు. ఈ ఇద్దరిలో తన తర్వాత ఎవరిని బాహుబలిని చేయాలన్న ప్రశ్న వచ్చినపుడు, అప్పటివరకూ ఓమి తర్వాత స్థానం తనదే అని భావిస్తున్న త్యాగిని కాదని, కేశుని బాహుబలిని చేస్తాడు ఓమి. తనేమో రాజకీయ నాయకుడౌతాడు. దీంతో త్యాగికి కడుపు మండి ఓమి భార్యకి, కేశుకి అక్రమ సంబంధం సృష్టించి... ఓమి చేతనే ఆమె హత్యకు గురయ్యేలా చేస్తాడు. భార్యని చంపేసిన తర్వాత ఓమికి... త్యాగి భార్య ద్వారా నిజం తెలిసి తనను తానే హతమార్చు కుంటాడు. చాలా బరువైన కథ.
 
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన చిత్రం ఇది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిన్న చిన్న టౌన్‌షిప్స్‌లో ఉండే వాతావరణాన్ని తీసుకుని చేశారు. డైలాగ్స్ కూడా సినిమా కోసమని సెన్సార్ చేసేయకుండా... సహజంగా రౌడీలు మాట్లాడే బూతులు, యాసతో రాయించుకోవడం వల్ల ఈ సినిమాని కుటుంబ సమేతంగా భారతీయులు అంతగా ఆదరించలేక పోయారు. అయితే సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, విశాల్ భరద్వాజ్, అజయ్ దేవ్‌గన్‌లను మాత్రం అవార్డులు వరించాయి. యూరప్ దేశాలలోను, అమెరికాలోను ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.
 
ఆ భాషలోని బూతులు సరిగా అర్థం కాకపోవడం వల్ల అనుకుంటా, నాక్కూడా ఈ సినిమా అంత ఎబ్బెట్టుగా అనిపించలేదు. కానీ హిందీలో మారుమూల గల్లీ భాష అర్థం అయ్యేవాళ్లు మాత్రం ఆడవాళ్లని, పిల్లల్ని చూడద్దని రికమెండ్ చేసేలా ఉంటుందిట స్క్రిప్టు. విజువల్‌గా ఇది కొంచెం డార్క్ సినిమా. డార్క్ సినిమాల లుక్‌ని లైక్ చేసే ప్రేక్షకులు వేరు. వాళ్లు ఎక్కువ ఎ సెంటర్ ప్రేక్షకులు. బి, సిలలో సినిమా కళకళలాడుతూ గ్లామరస్‌గా కనిపించాలి భారతదేశంలో.
 
సైఫ్ అలీఖాన్ పోషించిన లంగ్‌డా త్యాగి పాత్ర మొదట హీరోకి నమ్మిన బంటులా ఉంటుంది. తర్వాత విలన్‌లా మారుతుంది. నటనకు చాలా అవకాశ మున్న పాత్ర. ఈ పాత్రని మొదట ఆమిర్ ఖాన్ చేస్తానని ముందుకొచ్చాట్ట. తర్వాత డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో సైఫ్‌ని వరించింది.
 గత రెండు వారాలుగా ఈ శీర్షికలో 2006లో విడుదలైన సినిమాల గురించి రాస్తున్నాను. అవి ఫనా, కార్పొరేట్... ఇప్పుడు ఓంకార.

విశేషమేమిటంటే... ‘ఫనా’లో చేసిన కాజోల్, ‘కార్పొరేట్’లో చేసిన బిపాషాబసు, ‘ఓంకార’లో చేసిన కరీనాకపూర్... వీళ్లు ముగ్గురూ 2007లో ఉత్తమ నటి అవార్డుకు పోటీపడ్డారు. కరీనా కపూర్ అవార్డును గెలిచింది. ఈ చిత్రంలో త్యాగి భార్యగా నటించిన కొంకణాసేన్‌శర్మ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. నటీనటుల నటనా పటిమకి ఇంతకన్నా మంచి కొలమానం ఏముంటుంది? పెట్టిన డబ్బుకు మూడింతలు వసూలు చేయడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు, ప్రశంసకుల విమర్శలు అన్నీ పొంది తనకంటూ ఓ స్థానాన్ని ఈ చిత్రమూ, దీని దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఇద్దరూ ఏర్పరచుకున్నారు.
 
కొత్తగా దర్శకులు అవ్వాలనుకునే చాలామందికి కనువిప్పు కలగాల్సిన అంశం ఏమిటంటే... పాత సాహిత్యంలో భావాలు, పాత్రల ప్రవర్తన, వాటి మధ్య సంఘర్షణ (కాన్‌ఫ్లిక్ట్) చాలా బలంగా ఉంటాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఈతరం జీవనశైలిలో ఆ పాత్రల్ని ప్రవేశపెట్టి, అటువంటి కాన్‌ఫ్లిక్ట్‌నే క్రియేట్ చేస్తే ఇప్పుడూ ఆ కథలు కిక్కిస్తాయి. పాత కథ తీయమంటే పీరియడ్ కథలే తీయక్కర్లేదు. ఆ సాహిత్యాన్ని చదవాలి. ఈ కాలానికి వాటి సారాన్ని అప్లయ్ చేసు కోవాలి. అప్పుడు ప్రేక్షకుడు ఆదరిస్తాడు.

ఇది హిందీలో కొత్త తరంలో వచ్చిన, అంటే మిలీనియమ్‌లో దర్శకులైనవాళ్లు ఆచరించి నిరూపిస్తున్న నిజం. తెలుగులో కొత్త దర్శకులు ఎక్కువమంది ఫెయిల్ అవుతుండడానికి కారణం సాహిత్యం మీద అవగాహన లేకపోవడం, సమాజం గురించి అసలేమీ తెలియకపోవడం, కనీసం రోజూ న్యూస్ పేపర్ చదివే అలవాటైనా చాలామందికి లేకపోవడం, పాత్రలు, పాత్ర ప్రవర్తన, చిత్రణ, భావోద్వేగాల కొలతలు తెలియకపోవడం, నాటకాలు, కవితలు, కథలు, నవలలు ఎక్కువగా తెలియకపోవడం, కొరియన్ సినిమాలే జీవితంగా బతికేయడం. విశాల్ భరద్వాజ్‌ని చూసి సాటి దర్శకులే కాదు, సంగీత దర్శకులు కూడా చాలా నేర్చుకోవాలి. కొత్త పథానికి, పాత భావానికి మధ్య వారధి విశాల్. ఆ రూట్‌లో ఓంకారం పలికించిన ప్రణవ నాదం విశాల్.
 
పి.ఎస్.:
షేక్‌స్పియర్ నాటకాలు సినిమాలకి బాగా పనికి వస్తాయని చెప్పిన నా స్నేహితురాలు ప్రస్తుతం వాళ్లాయన అనిల్, కూతురితో పాటు బెంగళూరులో సెటిల్ అయ్యారు. తన జడ్జిమెంట్‌ని మరోసారి అభినందిస్తూ... మళ్లీ వారం మరో మంచి సినిమాతో కలుద్దాం.
- వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement