ప్రతిభకు ‘ఆస్కార’మిచ్చే అవార్డులు
ఇంగ్లీషు విశ్వ భాష. ఇంగ్లీషు సినిమాలు విశ్వవ్యాప్తంగా విడుదలవుతాయి. అందుకే ఇంగ్లీషు అవార్డుల్లో ‘ఆస్కార్’ అవార్డులకు విశ్వవ్యాప్తంగా పేరుంది. అందులో విన్నర్‌కి విపరీతమైన క్రేజుంది.కేవలం ఓ 1600 పై చిలుకు మంది కూర్చుని నిర్ణయిస్తే, ప్రపంచమంతా ఆమోదించినట్టేనా అని బొమ్మకు అవతలివైపు బొరుసున్నట్టు ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. కానీ క్రేజు దృష్ట్యా, ఆ అవార్డు విశిష్టత దానిది. దానికి ప్రజలు ఆమోదించిన మీదట ఆస్కార్ అవార్డే సినిమా పరిశ్రమలో ప్రతిభకు అత్యున్నత కొలమానం అని నమ్మక తప్పదు.సిసిలీ బి. డిమిలీ నుంచి జేమ్స్ కామెరూన్ దాకా హాలీవుడ్‌లో ఎందరో గొప్ప దర్శకులు, మేధావులు, కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వాళ్లు అందరూ ప్రతి ఏడాదీ ‘‘అండ్ ది ఆస్కార్ గోస్ టూ...’’ అని యాంకర్ కాస్తంత ఆపి, పాజ్ ఇవ్వగానే చూపించే క్లోజప్ ఎక్స్‌ప్రెషన్ ఒకటే. ఉత్కంఠను అణచి పెట్టుకుంటూనే మామూలుగా ఎదురు చూస్తున్నట్టు గెడ్డం కింద అరచేయి, ముక్కు మీద వరకూ చూపుడు వేలు.
నటులు రాబర్ట్ డీనీరో అయినా, టామ్ హాంక్స్ అయినా, బ్రాడ్ పిట్ అయినా, కేట్ విన్‌స్లెట్ అయినా, ఏఆర్ రెహ్మాన్ అయినా, అవార్డు తీసుకున్నాక మైకు ముందు ప్రకటించే ఉద్వేగం, ఆనందం ఒకటే. ప్రపంచాన్ని గెలిచిన ఫీలింగ్. దానికి ఏ ప్రైజ్‌మనీ సరిపోదు. బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ అని నామ్‌కే వాస్తే కేటగిరీ ఒకటి పెట్టారు. కానీ చాలా మంచి సినిమాలు పరిశీలన దాకా కూడా వెళ్లవు. అవార్డు ఫంక్షన్‌కి ఉన్న ప్రచారం అవార్డుల నామినేషన్‌లకు లేకపోవడమే కారణం. అలా ఉండి ఉంటే ఆ జ్యూరీకి ఏడాదంతా సరిపోదు. వరల్డ్ కప్‌లాగ ఏ నాలుగేళ్లకోసారో ఆస్కార్ నిర్వహించాల్సి వస్తుంది. సీతారామశాస్త్రిగారు 2000లో ఒక సినిమాకు పాట రాశారు.
‘‘నువ్వెవరైనా నేనెవరైనా నీ, నా నవ్వుల రంగొకటే
ఊరేదైనా, పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే
నదులన్నిటికీ నీరొకటే, అలలన్నిటికీ కడలొకటే
మనసు తడిస్తే నీ, నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే’’ -
ఆస్కార్ ఫంక్షన్ చూస్తున్నంత సేపూ ఆర్టిస్టుల భావోద్వేగాలకు మనమూ మూవ్ అవుతాం. వాళ్లెవరో మనకి తెలీదు. మన చిరంజీవో, మన బాలకృష్ణో, మన నాగార్జునో, మన వెంకటేషో, మన పవన్ కల్యాణో, మన మహేష్ బాబో కాదు. అయినా మనం ఫీలౌతాం. అవార్డు రాని వారిని చూసి వారితో పాటు మన కన్ను చెమ్మగిల్లుతుంది. వచ్చిన వారి ఆనంద బాష్పాలు చూసి మన ఇంకో కన్ను హర్షంతో వర్షిస్తుంది. ఎఛీవ్‌మెంట్ ఎవరిదైనా ఆ కిక్కే వేరు. అందుకే ఆస్కార్ అవార్డు అంత గొప్పది. అదొక ప్రత్యేకమైన భావోద్వేగపు సినిమా.
‘‘పూను స్పర్థలు విద్యలందే, వైరములు వాణిజ్యమందే’’ అన్నారు పెద్దలు. అలా మన ప్రాంతీయ సినిమా విశ్వ సినిమాతో ప్రతిభలో స్పర్థలు పడితే, వాణిజ్యంలో వైరమొందితే - విశ్వ సినిమాకు విలువ తగ్గేదేం లేదు కానీ, మన ప్రాంతీయ సినిమా విలువ చాలా పెరుగుతుంది. అందుకు ప్రయత్నిద్దాం. మన నుంచి మరో కొందరు సత్యజిత్‌రేలు, ఏఆర్ రెహ్మాన్‌లు, గుల్జార్‌లు పైకొస్తారు. మన జెండా ఎగరేస్తారు.