Sakshi Special Story On Tollywood Star Heroes Remuneration, Theatres And Collections - Sakshi
Sakshi News home page

అడ్డగోలు పారితోషికాలు, అవసరం లేని రికార్డులు.. సినీ పరిశ్రమకే ‘మెగా ’కష్టం!

Published Mon, Aug 21 2023 7:50 AM | Last Updated on Mon, Aug 21 2023 10:33 AM

Sakshi Special Stories On Star Tollywood Star Heroes Remuneration

విస్తృత ప్రజాదరణ, ప్రాచుర్యం ఉన్న క్రికెట్, సినిమా ఈ దేశంలో మతాన్ని మించినవని అంటారు. జాతీయ గుర్తింపును తీర్చిదిద్ది, భారతదేశపు ‘సాఫ్ట్‌పవర్‌’కు ప్రతీకగా నిలిచే ఈ రెంటి గురించి ఎవరి అభిప్రాయం వారిదే! పబ్లిక్‌లోకి వచ్చాక... వీటిపై మాట్లాడద్దని ఎవరన్నా అంటే అది అజ్ఞానం, అర్థరహితం. సినీ పరిశ్రమ ప్రస్తుత పరిస్థితి, మితిమీరిన పారితోషికాలు, అదుపు తప్పిన చిత్ర నిర్మాణవ్యయం, అందుకుంటున్న పారితోషికాలకు తారలు లెక్కలు సరిగ్గా చూపుతున్నారా, ప్రభుత్వానికి పన్ను కడుతున్నారా, ఆడని సినిమాలకు సైతం శత – ద్విశతదినోత్సవ ‘వీర’ రికార్డులు లాంటి అనేక అంశాలపై ఇటీవల జరుగుతున్న చర్చను ఈ దృష్టితో చూడాలి. పార్లమెంట్‌లో వచ్చిన పారితోషికాల ప్రస్తావనను ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ అంటూ అగ్రతార చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర ద్విశత దినోత్సవ వేదికపై నుంచి చేసిన వ్యాఖ్యలు రచ్చను పెంచాయి. 

(చదవండి: 'రీ-రిలీజ్' ట్రెండ్.. ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువ!)

‘భోళా శంకర్‌’ చిత్రం రిలీజ్‌కు కొద్దిరోజుల వ్యవధి ఉండగా, ప్రత్యేక ఆహ్వానితులతో ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల విజయోత్సవ వేడుక జరిగింది. ఆ వేదికపై ఆయన ఆచితూచి తన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ పేరెత్తకుండానే తారల వివాదాస్పద పారితోషికాల అంశాన్ని ప్రస్తావించారు. సినిమా వాళ్ళకు ఎక్కువ రెమ్యూనరేషన్లు ఇస్తున్నారనే అంశం పార్లమెంట్‌లో చర్చించాల్సిన విషయం కాదనీ, వరుసగా సినిమాలు చేస్తున్నది పరిశ్రమలోని వారికి ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతోనే అనీ అన్నారు. పాత రాజకీయ వాసనలు పోని చిరంజీవి ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ – ఉపాధి అవకాశాలపై రాజకీయ నేతలు దృష్టి సారించాలనీ సలహా ఇచ్చారు. పారితోషికాల విషయాన్ని పెద్దది చేసి దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్‌ చేయద్దనీ అభ్యర్థించారు. గమనిస్తే – ‘ఆచార్య’ చిత్ర సమయంలో జరిగిన పరిణామాలు, ఆ చిత్రానికి ఆరంభ వసూళ్ళు సైతం ఆశించినంతగా రాని పరిస్థితితో అక్కడ నుంచి చిరు కొత్త ధోరణిలోకి దిగారు. కారణాలు ఏమైనా ఆ తరువాత నుంచి తన ప్రతి కొత్త సినిమా రిలీజు ముందు అనివార్యంగా అన్నయ్య నోట తమ్ముడి మాట వినిపిస్తోంది. ఇది కేవలం యాదృచ్ఛికమే అనుకోగ లమా? ఇదీ విశ్లేషకుల ప్రశ్న. దానికి జవాబు లోతైన వేరే చర్చ.

(చదవండి: సీఎం పాదాలకు మొక్కిన తలైవా.. మండిపడుతున్న నెటిజన్స్!)

అది అటుంచితే... పరిశ్రమ బాగు కోసమే సినిమాలు చేస్తున్నామని పైకి ఎవరు ఎంతగా చెబుతున్నా, అసలు చిత్ర నిర్మాణ వ్యయంలో అత్యధిక భాగం అగ్రతారలు, అగ్ర టెక్నీషియన్ల జేబులోకే చేరుతుందనేది నిష్ఠుర సత్యం. తారల ఈ భారీ పారితోషికాల వ్యవహారంపై చర్చ ఇవాళ కొత్తది కాదు. ఆ మాటకొస్తే తీసుకొనే రెమ్యూనరేషన్‌లో మనమే జాతీయ స్థాయిలో ఘనులమంటూ, ‘బిగ్గర్‌ దేన్‌ (అమితాబ్‌) బచ్చన్‌’ అని జాతీయ ఆంగ్లపత్రికల్లో సైతం మన హీరోలే రాయించుకున్న సందర్భాలూ ఉన్నాయి. అయితే, అంతకంతకూ సినిమాల సక్సెస్‌ శాతం తగ్గి, భారీ నష్టాలు పెరుగుతున్నందున... పారితోషికాల లాంటి అనుత్పాదక వ్యయం తగ్గాలనీ, సినిమా మేకింగ్‌ కోసం పెట్టే ఉత్పాదక వ్యయం పెరగాలనీ సాక్షాత్తూ పరిశ్రమలో పెద్దలే ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. ఇవాళ తెలుగులో పెద్ద సినిమాల బడ్టెట్‌లో సగటున మూడింట రెండొంతులు, మరోమాటలో 65 నుంచి 70 శాతం దాకా రెమ్యూనరేషన్లకే పోతోంది. అదేమంటే మార్కెట్‌లో ఉన్న డిమాండ్, సినిమాకు జరిగే వ్యాపారాన్ని బట్టే అంతంత పారితోషికాలు ఇస్తున్నారని వాదిస్తున్నారు. సమర్థించుకోవాలని చూస్తున్నారు. కానీ, ఈ ధోరణి పరిశ్రమ దీర్ఘకాలిక ప్రయోజనాలకూ, పైకి చెబుతున్న సోకాల్డ్‌ కార్మిక ఉపాధికీ పనికొచ్చేదైతే కానేకాదు. 

(చదవండి: రజనీకాంత్ మరో రికార్డ్.. ఆ లిస్టులో ప్రభాస్‌తోపాటు..)

అసలు ఇంతంత పారితోషికాలకూ ఓ కథ ఉంది. పైరసీ సినిమా చూడడం రక్తపుకూడు లాంటిదని మన స్టార్లు డైలా గులు చెబుతారు. కానీ, కొత్త సినిమా రిలీజంటే అధికారికంగా, అనధికారికంగా టికెట్‌ రేట్లు పెంచుకొని, పబ్లిక్‌ బ్లాక్‌మార్కెటింగ్‌ చేసే ధోరణిని ఆరంభించినదే మన మెగా తారలు. పైగా ఆ అధిక రేట్లతో సహజంగానే వచ్చే వసూళ్ళ లెక్క వేరు, ప్రభుత్వానికి చూపి పన్నుకట్టే లెక్క వేరు! ప్రభుత్వ ఖజానాకు వేస్తున్న ఈ కన్నానికి తోడు... బలుపు కాక వాపు అయిన ఆ ఓపెనింగ్‌ కలెక్షన్లే గీటురాయిగా టాప్‌స్టార్స్‌ పారితోషికాలను పెంచేస్తూ... నిర్మాతల జేబుకు పెడుతున్న చిల్లు అదనం. వెరసి... పైరసీ పెరగడానికీ, థియేటర్లలో సినిమా ఆడే రోజులు తగ్గి అన్ని సెక్టార్లలో పరిశ్రమ ఇక్కట్లలో పడడానికీ పరోక్షంగా కారణమయ్యారు.

అధిక టికెట్‌ రేట్లకూ, పారితోషికాలకూ జరుగుతున్న ఆ పన్నుల ఎగవేత మాట అటుంచుదాం. ఇటీవల 100 – 200 రోజులు బలవంతాన లాగించి ఆడిస్తున్న అగ్రతారల సినిమాలకు ప్రభుత్వానికి జీఎస్టీ కూడా దక్కట్లేదు. ఆశ్చర్యపరిచే ఈ లోగుట్టు ఇన్ని పెద్ద కబుర్లు చెబుతున్నవారికి తెలుసా? చాలామందికి తెలియనిదేమిటంటే... వార్షిక టర్నోవర్‌ రూ. 20 లక్షల లోపుంటే, జీఎస్టీ కట్టనక్కర్లేదని చట్టం. ఈ లొసుగును అడ్డం పెట్టుకొంటూ... సినిమాలు రిలీజయ్యే చిన్న సెంటర్లలోని పలు నాన్‌–ఏసీ థియేటర్లు తమ వార్షిక టర్నోవర్‌ రూ. 20 లక్షల లోపేనని బొంకుతున్నాయి. అలా అవి తాము ప్రదర్శించే సిన్మాలకు ప్రభుత్వానికి దఖలు పరచాల్సిన ‘డైలీ కలెక్షన్‌ రిపోర్ట్‌’ (డీసీఆర్‌) రాయనక్కర్లేదు, జీఎస్టీ కట్టనూ అక్కర్లేదు. జీఎస్టీ లేని ఆ థియేటర్లను వాటంగా చేసుకొని, ఆడని సినిమాకు సైతం శత, ద్విశత దినోత్సవాలు చేసే సంస్కృతికి పలువురు హీరోలు, వారి భజన బృందాల వారు తెర తీశారు. ఇటీవల జరుగుతున్న పెద్ద హీరోల సినిమాల విజయోత్సవాల తెర వెనుక భాగోతం ఇదే! అలాంటి వేదికపై నిల్చొని చిరు సుద్దులు చెప్పడం పెను చోద్యం! పిచ్చుక లాంటి పరిశ్రమపై బ్రహ్మాస్త్రం వేస్తున్నారనడం విడ్డూరం.  

జీఎస్టీ చట్టాన్ని సందు చేసుకొని... స్టార్‌ హీరోల సినిమాకు దొంగ రికార్డుల వీరతాళ్ళు వేసేందుకు ఈ నాన్‌–జీఎస్టీ సినీ థియేటర్లు భలే అక్కరకొస్తున్నాయి. ఇన్ని రోజులకు ఇంత అని ఫ్యాన్స్‌ దగ్గర ఎంతో కొంత మొత్తం గుత్తగా మాట్లాడుకొంటూ, ఆ హాళ్ళు అయినకాడికి సొమ్ము చేసుకుంటున్నాయి. వెరసి, మూసేసిన చాలా థియేటర్లకు బయట మాత్రం వాల్‌పోస్టర్లు ప్రదర్శిస్తూ, ఆడని సినిమాను సైతం శతదినోత్సవ విజయంగా ప్రకటిస్తున్నారు.

కొద్దికాలంగా ఇద్దరు, ముగ్గురు అగ్ర హీరోల సినిమాలకు ఎక్కువగా జరుగుతున్నది ఇదే! గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఒక సూపర్‌తార అభిమానులు ఆయన ఫ్లాప్‌ సినిమాలన్నిటికీ ఇలానే శతదినోత్సవాలు చేస్తుంటారు. ఇక, ఒక దివంగత నటుడి సినిమా చిత్తూరు జిల్లా అరగొండలో ఆడింది ఒక్కరోజు ఒకే ఒక్క ఆట అయినా, 100 రోజులు గడిచాక ఈ ఏడాది శతదినోత్సవం చేయడం ఈ పెడ ధోరణికి తాజా పరాకాష్ఠ. అంతెందుకు... ఈ ఏడాదే సంక్రాంతికి రిలీజైన అగ్రతారల చిత్రాలూ తాజాగా ఇదే పద్ధతిలో 200 రోజులంటూ హంగామాగా షీల్డులు అందుకున్నవే! ఒకరు కర్నూలు జిల్లా ఆలూరులో చేస్తే, మరొకరు కృష్ణాజిల్లా అవనిగడ్డలో చేశారు. సెంటర్లు తేడానే తప్ప, మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌! 

నిజానికి, కింది సెంటర్ల నాన్‌–జీఎస్టీ థియేటర్లు సైతం ప్రతి పెద్ద సినిమానూ దాదాపు రూ. 3 – 4 లక్షల డబ్బు పెడుతూ ప్రదర్శిస్తున్నాయి. ఏటా కనీసం అలాంటి ఆరేడు సినిమాలు ఆడుతూ, 20 లక్షల నాన్‌–జీఎస్టీ టర్నోవర్‌ పరిధి దాటి మరీ వార్షిక లాభాలూ గడిస్తున్నాయి. పైకి మాత్రం జీఎస్టీ పరిధిలో లేమంటూ పన్ను ఎగవేస్తున్నాయనేది చిదంబర రహస్యం. చిరు దుకాణాలకు ఊరటగా ప్రభుత్వమిచ్చిన ఈ 20 లక్షల నాన్‌– జీఎస్టీ రూల్‌ను సినిమా హాళ్ళు మోసానికి వాడుకోవడం దుర దృష్టకరం.

నిజానికి, ట్యాక్స్‌ లేని హాళ్ళలో డీసీఆర్‌ ఉండదు గనక, అక్కడ సినిమా ఆడినా సరే బాక్సాఫీస్‌ పరిధిలో ఆడనట్టే లెక్క. ఇవాళ ప్రముఖులు ఇళ్ళల్లోనే క్యూబ్‌ కనెక్షన్లు పెట్టుకొని కొత్త సినిమాలు చూసుకుంటున్న ప్రదర్శనలతో అదీ ఒక రకంగా సమానం. ఇంత చిన్న లాజిక్‌ మర్చిపోయి, ఒకపక్క అభిమాన హీరోకు లేని రికార్డ్‌ తేవాలనే వెర్రి ప్రేమతో సామాన్య ఫ్యాన్స్‌ జేబులో సొమ్ము పోగొట్టుకుంటుంటే... మరోపక్క ప్రభుత్వానికి సినిమాహాళ్ళ పన్ను ఎగవేత సాక్షిగా హీరోలు విజయోత్సవ వేలంవెర్రిలో సాగడం విచారకరం. తెలిసో తెలియకో ఈ తప్పులో భాగమవుతున్న మన పెద్ద హీరోలు ముందు కళ్ళు తెరవాలి. ఈ అవాంఛనీయ వైఖరిని ఇకనైనా సరిచేసుకోవాలి. 

చాలామంది గ్రహించని మరొక్క సంగతి – ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500కు పైగా థియేటర్లుంటే, ఇవాళ వాటిలో ఏడాదంతా సినిమాలు ప్రదర్శిస్తున్న హాళ్ళు రెండొంతులే! సుమారు 500కు పైగా హాళ్ళు ఏటా కొన్ని నెలలు మూసివేసే ఉంటున్నాయి. ఇటు సక్సెస్‌ఫుల్‌ సినిమాలూ, అటు కరోనా అనంతర కాలంలో హాళ్ళకు ప్రేక్షకులు రావడమూ తగ్గిపోయాక అదీ వర్తమాన సినీ పరిశ్రమ దుఃస్థితి. అందుకే, అడ్డగోలు పారితోషికాలు, అవసరం లేని రికార్డులతో బంగారు బాతును ఒకేసారి కోసుకుతినాలని చూస్తే అది యావత్‌ సినీ పరిశ్రమకే మెగా కష్టం. ఇది పిచ్చుకలు తమ గూటిపై తామే వేస్తున్న బ్రహ్మాస్త్రం. ప్రభుత్వానికి పన్ను ఎగవేతతో లేని హైప్‌ సృష్టిస్తూ, ఏకంగా పరిశ్రమ నెత్తిన పెడుతున్న భస్మాసుర హస్తం! 
– రెంటాల జయదేవ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement